ఈ మధ్య ‘రతన్ టాటా’ అనే ఒక ‘శత కోటీశ్వరుడైన’, కోట్లు, కోట్లు, కోట్లు, కోటాను కోట్లు గల, పారిశ్రామికవేత్త మరణానికి సంబంధించిన వార్తల్ని, అన్ని భాషల పత్రికలూ ప్రచురించడాలూ, టీవీ చానళ్ళు ప్రసారాలు చెయ్యడాలూ, రెండు మూడు రోజులపాటు నిర్విరామంగా జరిగింది. ఆ శత కోటీశ్వరుడి బాల్యం నించీ, వృద్ధాప్యం వరకూ, ఫొటోలతో సహా సమస్త వివరాలనూ, ఆయా కాలాల లెక్కలతో నిరంతరాయంగా ఇచ్చుకుంటూ వచ్చాయి! పాఠకులూ! ఒక మామూలు వార్త కూడా చదవండి! జెంషెడ్‌పూర్‌లోని, టాటా ఉక్కు ఫ్యాక్టరీలో, మొన్న జులై 7న, నరేష్ ప్రసాద్ అనే 32 ఏళ్ళ కార్మికుడు పని ఒత్తిడిలో, క్రేన్ మీద నించీ జారిపడి, చచ్చిపోతే, అది మాత్రం, అతి చిన్న సాధారణ స్థానిక వార్త అయింది! ధనికుడి మరణానికీ, పేదవాడి మరణానికీ, విలువల్లో ఎంత తేడాయో చూడండి! ఆ యువకుడు, ఈ టాటా కంపెనీలో ఉద్యోగంలో ఎందుకు చేరాడంటే, ఈ కంపెనీలో వున్న ఒక పధకం వల్ల. అదేమిటంటే, ‘ఒక ఉద్యోగం వదులుకో, ఒక ఉద్యోగం అందుకో!’ (‘లీవ్ ఎ జాబ్, గెట్ ఎ జాబ్’) అనే పధకం అది! ఆ పధకం కింద, ఆ యువ కార్మికుడు ఆ ఉద్యోగంలో చేరాడట! అంటే, అప్పటిదాకా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూవుండిన అతని తండ్రి, తన ఉద్యోగాన్ని వదులుకుంటే, ఆ ఉద్యోగాన్ని కొడుక్కి ఇచ్చే పధకం- అన్నమాట అది! ఎందుకా పధకం? కొంచెం పెద్ద వయసు వాళ్ళు పోయి, చిన్న వయసు వాళ్ళు వస్తే, పని ఎక్కువగా జరగవచ్చనీ, కొత్త వాళ్ళకి జీతం తగ్గ వచ్చనీ, కూడా!
రతన్ టాటా బాల్యమూ, యవ్వనమూ, విదేశాల్లో అతడి చదువూ, అతడి ప్రేమ ఉదంతమూ, అతడి అమ్మమ్మ చచ్చిపోవడమూ, అతడి జంతు ప్రేమా! ఒకటేమిటి? ఆహా! ఆ గొప్ప గొప్ప జీవిత విశేషాలు ప్రచురించాయి పత్రికలు! వినిపించాయి టీవీలు! అతణ్ణి, ‘పారిశ్రామిక రత్నం’ అని ఒక పత్రికా, ‘పారిశ్రామిక దిగ్గజం’ అని మరొక పత్రికా, ‘ఆదర్శనీయుడైన పారిశ్రామిక వేత్త’ అని ఇంకో పత్రికా…ఇలా శక్తివంచన లేకుండా అనేకానేక ప్రశంసలు కురిపించాయి!
అన్ని పత్రికలూ, ప్రత్యేకించి ప్రస్తావించిన విషయం, ఒకటి వుంది! ఏమిటంటే, రతన్ టాటా, తన ఆదాయంలోనించీ నూటికి అరవై శాతాన్ని ‘ధార్మిక కార్యక్రమాలకి’ ఖర్చుపెట్టిన ‘ధర్మదాత’ అని! ఈ వార్తా కధనాల సందర్భంగా తెలిసిన ఇంకో విషయం: ఇటువంటి ‘ధర్మదాతలు’, ఈ దేశంలోనే కాదు, అమెరికాలో కూడా వున్నారని!
అమెరికా ధర్మదాతల్ని చూడండి! ‘ఫోర్డ్’ అనే ఒక పేద్ద కార్ల పెట్టుబడిదారుడు అక్కడ వున్నాడు! అతడు కూడా, తన పేరుతోనే ‘ఫోర్డ్ ఫౌండేషన్’ అని ఒక సంస్తని పెట్టి, కొన్ని వందల కోట్ల డబ్బుని ప్రపంచవ్యాప్తంగా, ‘దాతృత్వ కార్యాలకు’ ఖర్చు పెడతాడని సమాచారం! ఈ ఫోర్డ్ దాతృత్వానికి ఒక ఉదాహరణ: ఇక్కడి తెలుగు యూనివర్శిటీకి జానపద సాహిత్యం మీద కొన్ని పనులు జరగడానికి, 1986లో, 25 లక్షలు సహాయం గా ఫోర్డ్ ట్రస్టు ఇచ్చిందట! ఈ విధంగా, ఒక దేశంలో ధనికులు, విదేశీ యూనివర్శిటీలలో జరగవలిసిన పరిశోధనల కోసం దానాలు ఇవ్వడం వల్ల, ఆ పరిశోధనల్లో, ఆ దానాలు పొందే దేశాల్లో దానాలు ఇచ్చే దేశాల పెట్టుబడులు విస్తరించడానికి కావలిసిన సమాచారం దొరుకుతుంది! ఇదీ, ఈ రకం దానాల అర్ధం! ఇతర దేశాలనించీ అమెరికాకీ, అమెరికా నించీ ఇతర దేశాలకీ, ప్రొఫెసర్లని కొన్నాళ్ళకోసారి పరిశోధనల పేరుతోనో, మరో పేరుతోనో పంపి, ఫెలోషిప్పులు ఇవ్వడం కూడా ఈ ‘ఫోర్డ్ ట్రస్టు’ చేస్తుంది.
ఫోర్డే కాకుండా అక్కడ ఇంకో ఇద్దరు ప్రసిద్ధ పెట్టుబడిదారీ దాతలు కూడా వున్నారు. ‘రాక్ ఫెల్లర్’ అనే మానవుడు, పేద్ద పెట్రోల్ పారిశ్రామికవేత్త! ఇతను కూడా తన పేరుతోనే ‘రాక్ ఫెల్లర్ ఫౌండేషన్’ అని ఒక సంస్థని పెట్టి, అదే పని చేస్తున్నాడు! యూనివర్శిటీలలో, కొంతమంది ప్రొఫెసర్ల గురించి, ‘ఆయనకి ప్రతిష్టాత్మకమైన రాక్ ఫెల్లర్ ఫెలోషిప్ వచ్చిందండీ!’ అని గొప్పగా చెపుతుంటారట! ఆ పెట్టుబడిదారుడి పేరు వినికిడి చాలు!
పాఠకులారా! ఇంకో దానశీలుణ్ణి చూడండి! అతనే ‘కానగీ’ అని ఒక పేద్ద ఉక్కు పారిశ్రామికవేత్త! ఇతడూ ధర్మత్ముడే! ఇతని సంస్థా దాన ధర్మాల సంస్థే!
పారిశ్రామిక వేత్తలందరూ ట్రస్టుల్ని తమ పేర్లతో పెట్టి, విద్యా, వైద్యం- ఇంకా అలాంటి సౌకర్యాలకోసం ప్రపంచ వ్యాప్తంగా, ధర్మ కార్యాలు చేస్తూ వుంటారు! ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాలకి! వీళ్ళ దానాలు, వేలల్లో, లక్షల్లో కాదండీ! ఇంకా నయం, వందల్లో అనుకున్నారు కాదు! కోట్లలో, శత కోట్లలో! ఈ శత కోటీశ్వర పారిశ్రామికవేత్తల గురించి పేపర్లలో చదివి, వాళ్ళ సంపదల్ని చూసీ, వాళ్ళ ‘దాతృత్వాల్ని’ చూసీ, మూర్చలు పడిపోయే వారు వుంటారు!
మొన్న రతన్ టాటా పోయినప్పుడు కూడా ఇదే జరిగింది కదా! పత్రికలూ, టీవీలూ ఎంతెంత ముచ్చట్లలో పడ్డాయి! ఒక ప్రొఫెసరు గారైతే, ఏకంగా, ‘రతన్ టాటాని ఆదర్శంగా తీసుకోవాలి’ అని బోధించారు. ఎందుకూ ఆదర్శం? దాన ధర్మా ల దాత అట మరి! ఇంతకీ అసలు ప్రశ్నకి పోదాం!
ఈ పెట్టుబడిదారీ దాతలందరికీ, ఆ దానధర్మాలు చేసేసి, కీర్తులు సంపాదించ డానికి కావలిసిన కోట్లూ, శత కోట్లూ ఎలా వచ్చాయం టారూ? ఆ నిజాన్నే ఆ రహస్యాన్నే, మనం తెలుసుకోవాలి! పత్రికల వారికీ, టీవీల వారికీ, అది రహస్యం అవదులెండి! ఎందుకంటే, వీరు కూడా చిన్నా-పెద్దా పరిశ్రమదారులే కదా? కాబట్టి, ఆ రహస్యాన్ని మనం మార్క్సు ద్వారా తెలుసుకోవాలి!
దానధర్మాల్ని అందుకునే ‘దరిద్రులు’ వుంటేనే కదా, దానాల కోసం అవసరం అయ్యేది? దరిద్రులైన వారు వుంటేనే కదా దానాల్నీ, బిచ్చాల్నీ అందుకునేది? అంటే, ధర్మ దాతలకు కోట్లూ, కీర్తులూ, రావడానికి దరిద్రులు వుండి తీరాలి! నిజానికి సమాజంలో, ఏ ‘రహస్యమూ’ వుండదు. ప్రతి విషయమూ, సమాజంలో సత్యంగా జరిగేదే! నిత్యం సూర్యోదయం ప్రత్యక్షమైనంత సహజమైన సత్యమే! సమాజంలో నిత్యం దానిని చూస్తూనే వుంటాం. కానీ, దాన్ని గ్రహించం! అందుకే అది రహస్యం! దాన్ని గ్రహించడమే చైతన్యం!
అసలు, ఏ పారిశ్రామికవేత్త అయినా, చేసే పని ఏమిటి? ఆ శత కోట్ల డబ్బు ఎలా సంపాదిస్తారు? ఏదో ఒక ‘సరుకు’ని తయారు చేయించి, దాన్ని అమ్మించి, ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు!
అమ్మే సరుకుని తయారు చేయించాలంటే మొదట, కొన్ని ముడి పదార్ధాలూ, యంత్రాలూ, కావాలి. అవి, ఇతర పనిస్తలాల్లో తయారై వుంటాయి కాబట్టి, వాటిని డబ్బుతో కొనాలి! వాటి కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. దుస్తుల్ని తయారు చేయించడానికి మొదట ‘బట్ట’ కావాలి కదా? అలాగే, స్టీలుని (ఉక్కుని) తయారు చేయించాలంటే, ‘గనుల్లో తవ్వితే’ ప్రకృతి సహజంగా దొరికే ‘ముడి పదార్ధం’ యేదో కావాలి! ఇలా, మొదట అవసరం అయిన వస్తువులు, కొత్త ఉత్పత్తి కోసం కావలిసిన వాటిని, ఇతర చిన్నా పెద్దా పని స్తలాల నించి కొనవలసి వస్తుంది. ఇవి, కొత్త సరుకు తయారీ కోసం మొదట కావలసిన ‘ఉత్పత్తి సాధనాలు.’ ఈ సాధనాలు వుంటేనే కొత్త సరుకుని తయారు చెయ్యడం జరుగుతుంది. ‘కొత్త సరుకు’ వాళ్ళు, వాటి కోసం కావలిసిన సాధనాల్ని కొనడానికి పెట్టే డబ్బు, మొదటి ఖర్చు!
తర్వాత, ఆ సాధనాలతో కొత్త సరుకుని తయారు చేయించాలి. ఇక్కడ కొత్త సరుకుని ‘స్టీలు’ (ఉక్కు) అనుకుందాం. దీన్ని తయారు చేయడానికి, ఆ పని తెలిసిన, ఆ ఇంజనీరింగు ప్రాక్టీసులు తెలిసిన పనివారు కావాలి! యజమానుల ఆర్డర్ల ప్రకారం పని చేయవలిసిన వారు, యజమాని దృష్టిలో పనివాళ్ళే (వర్కర్స్)! ఆ పనివారిని ‘కార్మికులు’ అనీ, ‘శ్రామికులు’ అనీ, అనవచ్చు.
స్టీలుని చేయించే పరిశ్రమ దారుడు, ఆ పనిచేసే వారికి ‘జీతాలు’ ఇవ్వాలి! పరిశ్రమ దారుడు చేయించే కొత్త సరుకు కోసం, ఈ జీతాలది రెండో ఖర్చు!
మొదట సాధనాలూ, తర్వాత జరిగే కొత్త సరుకూ, ఈ రెండూ శ్రమలతో తయారైనవే అయినా, సాధనాలు అప్పటికే తయారై వచ్చినవి కాబట్టి, వాటిని చేసిన శ్రమకి, మార్క్సు ప్రకారం, ‘పాత శ్రమ’గా లెక్క. వాటితో జరిగే కొత్త సరుకుని చేసిన శ్రమకి ‘కొత్త శ్రమ’గా మరో లెక్క. శ్రమలకు ‘పాతా-కొత్తా’ లెక్కలు ఎందుకంటే, ‘కొత్త సరుకు’ కోసం ‘మొత్తం శ్రమ’ ఎంతో, ఆ మొత్తం శ్రమకి మొత్తం విలువ ఎంతో తెలియడానికి!
ఇక, తర్వాత చూడవలిసింది ఏ పారిశ్రామికవేత్త అయినా చేసే పని ఏమిటి-అని! ఏదో ఒక ‘కొత్త సరుకుని తయారు చేయించి- ఇక్కడ ఉక్కునే అనుకున్నాం- తయారైన సరుకుని అమ్మించి, దాని కోసం పెట్టిన ఖర్చుల కన్నా ‘ఎక్కువ డబ్బు’ని సంపాదించాలన్నదే పారిశ్రామికవేత్తల ఏకైక ఆదర్శం! ఆదర్శనీయులు కదా?
ఆ ‘ఆదర్శాన్ని’ నెరవేర్చేటట్టుగానే, పరిశ్రమల ద్వారా ‘ఎక్కువ డబ్బు’ కూడా వస్తుంది!
ఇదేమిటి! ఇదెలా జరుగుతుంది? కొత్త సరుకు కోసం పెట్టే ఖర్చులు 2 మాత్రమే కదా? ఆ 2 శ్రమల వల్లే, కొత్త సరుకు తయారవుతుంది కదా? ఆ 2 శ్రమల కోసం జరిగిన 2 ఖర్చులతో తయారైన సరుకుని అమ్మితే, ఆ 2 ఖర్చుల కోసం పెట్టిందే వెనక్కి వస్తుంది గానీ, అంత కన్నా ఎక్కువ కూడా వస్తుందా? ఇదెలా జరుగుతుంది?
అదెలా జరుగుతుందో ఈ నాడైతే మనం తెలుసుకోవచ్చు. కానీ, నిన్న మొన్నటిదాకా, అది ఒక రహస్యమే! ఆ రహస్యం 150 సంవత్సరాల కిందట ఒక మేధావి కృషి ద్వారా బైటపడింది! ఆ మేధావి పేరు ‘కార్ల్ మార్క్స్’.
(ఇంకావుంది)
రంగనాయకమ్మ