దేశాన్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి మనువాదమే

Humanity is the evil force that is oppressing the countryప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేని గమ్మత్తులు, చిత్రవిచిత్రాలు కేవలం అంటే కేవలం భారత దేశంలో వైదిక మతగ్రంథాల్లో అపభ్రంశ సృజనాత్మక రచనల్లో మాత్రమే ఉంటాయి. దేశంలోని అధిక సంఖ్యాకులైన బహుజనులు కూడా ఆ ప్రభావంలో పడి, మెదళ్లు పనిచేయని స్థితిలోకి, జడత్వంలోకి దిగజారిపోయారు. ఉదాహరణకు వైదిక రచనల్లోని విషయాలు ఒకసారి గమనించండి- సముద్రం మనిషిలా మాట్లాడుతుంది. భూమిలోపల ఇనుపపెట్టెలో శిశువు బతికి ఉంటుంది. పాయసం తింటే పిల్లలు పుడతారు. జటాయువు అనే పక్షి మాట్లాడుతుంది, పైగా యుద్ధం చేస్తుంది. కోతులు వారధి కడతాయి. కొందరికి మూడు తలలు, మరి కొందరికి పదితలలు ఉంటాయి. జీవశాస్త్రానికీ పోనీ కనీసం ఇంగిత జ్ఞానానికి కూడా అందని విషయాలుంటాయి. రాక్షసులు, దెయ్యాలు, పిశాచాలు ఉండటం, అవి మనుషుల్ని చంపి, పీక్కుతినడం..వంటివన్నీ విచిత్ర కథనాలే కదా? ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఇవన్నీ మన పూర్వీకులు ఎవరెవరో రాశారు. అవి కాదు ప్రమాదం! అవన్నీ నిజమని వాటిని పూర్తిగా నమ్ముతూ బతికే ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు మనుషుల గురించి మనం ఆందోళన పడాల్సి వస్తోంది- ఇది చాలా ప్రమాదం!! ఆవు పేడ తిని, ఆవు మూత్రం తాగే పవిత్రభూమిగా ఈ దేశాన్ని మార్చేసిన తర్వాత, అసలు ఎప్పటికైనా ఇది ఇక స్పృహలోకి వస్తుందా?
మనువాద ప్రభావంలో పూర్తిగా పడిపోయిన ఈదేశ ప్రధానే పరిపాలన, అభివృద్ధి, విద్య, ఉద్యోగాల విషయం మరిచిపోయి, తనే స్వయంగా దేవాలయాల ప్రారంభోత్సవాలు చేస్తూ, ప్రపంచ పురోహితుడిగా దేశాలు తిరుగుతున్నాడు. సముద్రంలోకి దిగి, శ్రీకృష్ణుడి ద్వారక సందర్శించి వచ్చానని, తన జన్మ ధన్యమైందని ప్రకటించు కున్నాడు. చదువూ, వివేకం లేని వారిని ఎన్నుకుని అధికారమిచ్చి అక్కడ కూచోబెడితే జరిగేది ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? దేశ ప్రజలు విజ్ఞత కోల్పోయి మూర్ఖశిఖామణులను ఎన్నుకుంటూ- అలాంటివారికి భజన చేస్తూ ఉంటే దేశం ఏమైనా జపాన్‌లా ముందుకుపోతుందా? దక్షిణ కొరియాద, కెనడా, ఆస్ట్రేలియాల వలె విద్యారంగంలో ఏమైనా ముందు నిలుస్తుందా? మూర్ఖుల బలాన్ని తక్కువగా అంచనా వేయకుడదు. కానీ మన వివేకానికి పదును పెడితే, దాన్ని ఎదుర్కుని అదుపు చేయగలం. మనం ఇక్కడే ఈ దేశ పౌరులుగా ఉన్నాం కాబట్టి, మనవంతు కృషి మనం చేస్తూనే ఉండాలి. మొట్టమొదటి ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన ఈదేశ ఔన్నత్యాన్ని పునరు ద్ధరించుకోవాలి. అభిరుచి ఉన్నవారు దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ పుస్తకాలు చదవాలి.
మనువాదం ఈనాటిది కాదు. అది వేల ఏండ్లుగా ఈ సమాజంలో వేళ్లూనుకుని ఉంది. గతంలోకి వెళ్లి విషయాల్ని విశ్లేషించుకోవాలి. బహుజనుల దృష్టి తమపై పడకుండా బ్రాహ్మణార్యులు అబద్దాలు ప్రచారం చేశారు. మొదటవారికి విద్యను దూరం చేశారు. తాము చెప్పిందే బహుజనులు వింటూ బానిసల్లా పడి ఉండాలని అను కున్నారు. మొఘలుల్ని, ఆంగ్లేయుల్ని దుర్మార్గులుగా చిత్రించారు. తామురాసిందే శాశ్వతంగా నిలిచిపోవాలని అను కున్నారు. ఆపని ఇప్పటికీ నేటి మనువాద పాలకులు కొపసాగిస్తున్నారు.చరిత్ర గ్రంథాల్ని తిరగరాయించి, పాఠకుల విద్యార్థులకు తమ కట్టు కథలు నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తే విషయం ఇట్టే తేట తెల్లమవుతుంది.
నాటి బ్రిటీషువారికి మన నల్లవాళ్ల పట్ల చులకన భావం ఉండేదన్నది-ఒప్పుకుందాం! మన దేశసంపద దోచుకుపోయారన్నది-ఒప్పుకుందాం! తమ పాలనపై తిరుగుబాటు జరిగితే అమానుషంగా అణచివేశారన్నది- ఒప్పుకుందాం! కానీ, వారి కాలంలో ఈదేశ ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంస్కరణలు చేశారన్నది కూడా ఒప్పు కోవాల్సిందే-వేల ఏండ్లుగా కొనసాగుతున్న బ్రాహ్మణిజ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా ‘సతీ సహగమనం’ రద్దుచేశారు. విద్య- ప్రజలందరికీ అందాలన్నారు. విద్య- అంటే మత గ్రంథాలు, పురాణాలు వల్లె వేయడం కాదని లోకజ్ఞానాన్ని పెంచే లెక్కలు, సైన్సు, చరిత్ర, భూగోళం, సామాజికశాస్త్రం వంటివనీ వాటిని బోధనాంశాలుగా చేశారు. ఫలితంగానే పూలే దంపతులు, సాహుమహరాజ్‌, పెరియార్‌, అంబేద్కర్‌ వంటి మహనీయులు నాటి భారతీయ సమాజం నుండి తయారయ్యారు. శూద్రులు, పంచములు, ఆదివాసీలు చదువుకుని చైతన్యవంతులు కాగలిగారు. 1895లోనే భాస్కర్‌రావు జాదవ్‌ అనే ఒక శూద్రుడు కలెక్టర్‌ కాగలిగాడంటే విద్యారంగంలో ఆంగ్లేయులు తెచ్చిన సంస్కరణలే కారణం! అందువల్ల లోతుగా ఆలోచిస్తే-అధిక సంఖ్యాకులైన ఈ దేశ మూలవాసులకు నిజమైన శత్రు వులు ఆంగ్లేయులన్నది కొంతవరకే-కానీ, చాలా వరకు వేలఏండ్ల నాడు యురేషియా నుండి వలస వచ్చిన ఆర్యులే- అసలు శత్రువులు! ఈదేశ మూలవాసుల్ని విభజించి, బానిసలుగా మార్చినవారు యురేషియన్‌ బ్రాహ్మణులే! అయితే, తమ ఆధిపత్యం కొనసాగడానికి దేశంలోని హిందువుల్ని, ముస్లింలని విడగొట్టడానికి పూనుకుంది మాత్రం బ్రిటీషువారేనన్నది-స్పష్టం!
అందువల్ల స్వాతంత్య్ర పోరాటమంటే బ్రిటీష్‌వారిని వెళ్లగొట్టడానికి చేసిన పోరాటం ఒక్కటే కాదు. ఈ దేశంలో అంతర్గతంగా మరొక పోరాటం కూడా జరిగింది. అది యూరోపియన్‌ బ్రాహ్మణుల బానిసత్వం నుండి విము క్తులుగా కావడానికి ఈ దేశ బహుజనులు చేసిన స్వాతంత్య్ర పోరాటం. బ్రిటీష్‌వారితో జరిపిన పోరాటం 1947లో ముగిసింది. అన్నిరంగాల్లో మనువాదులతో జరుపుతున్న పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతరాలు తొలగి పోయి, మనుషులంతా ఒక్కటేనని అందరూ సమ్మతించే దాకా అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ రెండు పోరా టాలను కలగాపులగం చేసి, కొందరు ఈనాటికీ అబద్దాలు ప్రచారం చేస్తుంటారు. ఏది నమ్మాలి? ఏది నమ్మగూడదు? అని సందిగ్ధంలో ఉన్నవారు ఈ కింది విషయాలు తప్పకుండా ఆలోచించాలి.
1.బ్రిటీష్‌ వారు అధికారంలోకి వచ్చాక వర్ణవ్యవస్థను తయారు చేశారా? వారు రాక ముందు నుండే అది ఈ దేశంలో ఉందా?
2.కుల వ్యవస్థ బ్రిటీషు వారు ఏర్పరచి దేశ ప్రజల్ని విభజించారా? లేక వారు రాక ముందు నుండే దేశంలో ఉందా?
3.అస్పృశ్యతను బ్రిటీష్‌ వారు ఏర్పరచి పాటించారా లేక వారు రాక ముందు నుండే అది ఈ దేశంలో ఉందా?
4.అస్పృశ్యుల మెడలకు ముందు ముంత వెనకవైపు నడుముకు చీపురు కట్టించింది మొఘలులా? బ్రిటీష్‌వారా? యురేషియన్‌ బ్రాహ్మణార్యులా?
5.అస్పృశ్యులు కండ్లకు, చేతులకు, నల్లటి తాళ్లు కట్టుకోవాలన్న నిబంధన ఎవరిదీ?
6.శూద్రులకు, పంచములకు, ఆదివాసీలకు విద్యాహక్కు, సంపద హక్కు, మానవ హక్కులు దూరం చేసింది యురేషియన్‌ బ్రాహ్మణులు, మనువాదులు కాదా? బ్రిటీషు వారు వచ్చిన తరువాత కదా పైవాటిని రద్దు చేస్తూ చట్టాలు తెచ్చారు?
7.బ్రిటీష్‌ వారు భారతీయుల్ని బానిసలుగా చూసింది నిజమే, అయినా బానిసల మధ్య, హెచ్చుతగ్గుల్ని వారు ప్రోత్సహించలేదు. దానివల్ల దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు, మహిళలకు కొంత మేలు జరిగింది.
ఇవి ఒకనాటి పరిస్థితులు అనుకుందాం! మరి ఇంత అవగాహన పెరిగి, 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా, మన దేశ పాలకుల ఆలోచనలు పెరగలేదు. ఆచరణలో మార్పులేదు. మనువాదమే-రూపం మార్చుకుంటూ నిత్యజీవితంలో వికృతంగా దర్శనమిస్తోంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఆరెస్సెస్‌, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనువాదం దేశంలో కొత్తబలం పుంజుకుంది. తమ ఆలోచనల్ని ఆమోదించని వారిని నిర్దాక్షిణ్యంగా చంపే యడం, జైలు పాలు చేయడం లేదా అనేక రకాలుగా హింసించడం సర్వసాధారణమై పోయింది. ఆవు పేడతిని, ఆవు మూత్రంలో మునిగిన దేశపాలకులు ఇప్పట్లో తేరుకునేట్లు లేరు. తమను, తమ హక్కుల్ని, రాజ్యాంగాన్ని కాపాడు కోవడానికి, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సి ఉంది. లేకపోతే, మనుస్మృతిని అమలుచేసి, వేల ఏండ్లనాటి అసమా నతల సమాజం స్థాపించాలని ఈ మనువాద పాలకులు కలలు కంటున్నారు.
నిత్య జీవితంలో మనువాదం అడుగడుగునా ఎలా కనిపిస్తోందో చూడండి. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సరస్వతిమాత విగ్రహాన్ని ప్రతిష్టించడం తప్పనిసరి చేసింది. పాఠశాలల్లో సరస్వతి విగ్రహం లేదా ఫొటో లేకుంటే, ఆ పాఠశాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని, డ్రెస్‌కోడ్‌ కూడా పాఠశాలల్లో తప్పక అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కదా మనువాదానికి కొనసాగింపు? ఊహాకల్పిత పాత్ర అయిన ఓ దేవత ఫొటో పాఠశాలల్లో అత్యవసరమా? ఆ రంగంలో కృషిచేసిన మహాత్మాపూలే దంపతుల ఫొటోలు పెట్టించండి. అర్థవంతంగా ఉంటుంది. 2024 సెప్టెంబర్‌లో విజయవాడలో వరదలు వచ్చినపుడు కొందరు ప్రాణాలకు తెగించి వరద బాధితులను రక్షిస్తుంటే- చినజియ్యర్‌ బృందం కృష్ణానది ఉధృతి తగ్గడానికి ఒడ్డున కూర్చుని పూజచేసి నదికి చీరె, రవిక- సారె సమర్పించారు. ఇదే మనువాదానికి కొనసాగింపు. ఇలాంటి నాటకాల ప్రభావంలో సామాన్యజనం పడకుండా అప్రమత్తంగా ఉండాలి. సారెలకు, పూజలకు ఏ ప్రభావం ఉండదని నిరూపణ అయ్యింది కదా? జియ్యరు సారె, ప్రవాహంలో కొట్టుకుపోయింది. కృష్ణానది ఉధృతి తగ్గలేదు. మరి ఎందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తుం టారూ? అంటే మానసిక బలహీనులయిన వారిని తమవైపు తిప్పుకోవడానికి! తమ అస్థిత్వం కాపాడుకోవడానికి!! అంతే, అసలు విషయమే మంటే – మీరు ఏ దేవుడికైనా ఏవిధంగానైనా, ఎంతమందైనా పూజలు చేయండి. నిప్పుతో చేసినా, నిప్పులేకుండా చేసినా, ఆవునెయ్యితో చేసినా, నూనెతో చేసినా, నిశ్శబ్దంగా చేసినా, శబ్దాలతో చేసినా- ఎలా చేసినా, మీమీ ప్రార్థనల వల్ల భౌతిక ప్రపంచంలో ఏ మార్పూ రాదు. ప్రజలు ఈ విషయం గట్టిగా నమ్మితే తమకు పుట్టగతులుండవని మనువాదులు తంటాలు పడుతుంటారు.
”మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి ఆ వెలుగును ప్రతిబింబి స్తుంది. ప్రతిమనిషీ దీపం కాలేకపోవచ్చు. కానీ, అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం!”-అన్నాడు అరిస్టాటిల్‌…ప్రస్తుత మనదేశ నాయకులు ఇలాంటి విషయాలు ఎప్పటికైనా అర్థం చేసుకోగలరా? మనువాదాన్ని వదిలేయగలరా?
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)