యుద్ధాలు ఉన్నంతవరకు మానవాళికి నిజమైన విముక్తి ఉండదు. అయితే నియంతలు ఉన్నంతవరకు యుద్ధాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నియంతల యుద్ధోన్మాదానికి ముకుతాడు వేయాలంటే ప్రపంచ శాంతి ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదు.
”శాంతి – సమభావం – సమిష్టిక్షేమం” ఆధునిక యుగధర్మాలుగా మహాకవి శ్రీశ్రీ అభివర్ణించాడు. ఎవరు ఏ ఖండంలో, ఏ పదవిలో, ఏవృత్తిలో జీవిస్తు న్నా విశ్వమానవ కళ్యాణంకై నిత్యం పాటుపడవల సిందేనన్న జీవన సత్యాన్ని మనం మరువరాదు.
సామ్రాజ్యవాదం తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకే యుద్ధోన్మాదాన్ని నెత్తిన ఎత్తుకుంటు న్నది. యుద్ధ వేటను కొనసాగిస్తున్నది. మున్ముందు ఈ యుద్ధవేట మరింతగా వెర్రితలలు వేయవచ్చు. ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ఫాసిస్టు శక్తులను ఎగదోస్తూ ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వుతున్న విషయాన్ని మనం గమనించాలి. యుద్ధ మేఘాలు కారు మబ్బుల్లా మధ్య ప్రాచ్యంలోనే గాక ఇతరాత్రా దట్టంగా అలముకుంటున్నాయి.
1991లో సోషలిస్టు సోవియట్ యూనియన్ పతనమయ్యాక సామ్రాజ్యవాదం పొగరుబోతుతనంతో ఇక ఏకధృవ ప్రపంచం అంటూ ముందుకొచ్చింది.
ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ, సరళీకరణ విధానాల అమలుకు తిరుగులేకుండా పోయింది. ఫలితంగా అంతులేని అవినీతి, పూడ్చలేని ఆర్థిక అగాధాలు, సహజ వనరుల విశృంఖల దోపిడీ, గుట్టలుగా పేరుకుపోతున్న పేదరికం, పర్యావరణ కాలుష్యం, అసంఖ్యాక ఆకలిచావులు, ఆత్మహత్యలు, బడుగుదేశాల దివాళా మనం నిత్యం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం.
అంతేకాదు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా వంటి దేశాలపై యుద్ధదాడులు జరిగాయి. బడుగుదేశాలపై బాంబుల వర్షం కురిపిస్తూ ఆ దేశాధినేతలను లొంగ దీసుకోవడం సామ్రాజ్యవాదానికి పరిపాటై పోయింది. ఆ సామ్రాజ్యవాద కార్పోరేట్ శక్తులు ఓ దుర్మార్గ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నాయి. వంచు లేక తుంచు (బెండ్ ఆర్ బ్రేక్) పద్ధతిలో ఆ చిన్న దేశాల నేతలను లొంగతీసు కుంటున్నాయి. లేదా అంతం చేస్తున్నాయి.
సోవియట్ రష్యాను విచ్ఛిన్నం చేయడమేగాక, ఆ రష్యాలోని పలు చిన్నచిన్న దేశాలను నాటో కూటమిలో చేర్చుకుని రష్యాకు పక్కలో బల్లెంలా తయారైంది అమెరికా. నాటో కూటమికి అమెరికా నాయకత్వం వహించడం ఎల్లెడలా తెలిసిన విషయమే. అందులో భాగమే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండున్న రేండ్లు కావస్తున్నది. రష్యా రెండు లక్షల సైన్యం కోల్పోయిందని, మరో నాలుగు లక్షల సైన్యం గాయపడిందని ఇటీవల మీడియా చెప్తున్నది. ఉక్రెయిన్‌కు చెందిన 110 డ్రోన్లను రష్యా కూల్చివేసిందని, అయినా యుద్ధం మొదలైన తొలినాళ్ల జోరు ఇప్పుడు లేదని తెలిపింది.
ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందిస్తే ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని అమెరికా ఓ పక్క ప్రపంచానికి చెప్తూనే మరోపక్క ఆ యుద్ధ విమానాల సరఫరాకు తెరదీసింది. అంటే యుద్ధానికి ఎవరు కాలు దువ్వు తున్నారో అందరికీ అర్థమవుతూనే ఉన్నది.
ఇదిలా ఉండగా అమెరికా అండదండలతోనే ఇజ్రాయిల్ గత ఏడాదిగా గాజా పాలస్తీనియులపై యుద్ధదాడి కొనసాగిస్తూనే ఉన్నది. ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నది. సైనికులతో పాటు సాధారణ పౌ రులు సైతం ఇప్పటి వరకు 43 వేలమంది నేలకొరిగారు. లక్షల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో స్రీలు – పిల్లలు అధికం. వీరంతా యుద్ధ బాధితులే తప్ప యుద్ధాన్ని కోరుకోని వారు. మరి ఈ పాపమెవ్వరిది? నియంతలది కాదా? సరిహద్దుల్లోని సైనికుల్నే కాకుండా సాధారణ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడాన్ని ఐక్యరాజ్య సమితితో సహా యావత్ ప్రపంచం ఖండిస్తున్నా ఆ సామ్రాజ్యవాద నియంతలు లెక్కచేయడంలేదు. శరణార్థుల శిబిరాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, జనవాసాలపై బాంబులు వేయడం ఏ రకమైన యుద్ధనీతి? అని ప్రశ్నిస్తున్నా… సిగ్గుపడటం లేదు.
బానిసయుగం కన్నా ఈ యుద్ధక్రౌర్యం మరింత వికృతంగా తయారైంది. యుద్ధోన్మాద విషం నియం తల దేహాలనిండా పాకిపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలంటే ఇంతకన్నా వేరు మార్గం సామ్రాజ్య వాదులకు కన్పించడం లేదు. దీనికి విరుగుడు ఎక్కడి కక్కడ శాంతి ఉద్యమాలను పాదుకొల్పడమే ఏకైక మార్గం. పాఠశాల నుండి విశ్వశాంతి పాఠాలు నేర్పాలి. జాగుచేయకుండా శాంతి – సామరస్య భావాలను ఉగ్గుపాలతో రంగరించి పోయాలి. మొక్కల్ని నాటుతూ ప్రకృతిని, పర్యావర ణాన్ని ఎలా కాపాడుకుంటామో విశ్వశాంతి బీజాలను నాటుకుంటూ నియంతల యుద్ధవేటకు చరమగీతం పాడాలి.
– శైలి, 9959745723