– దురాఘాతానికి ఒడిగట్టిన నానమ్మ, మేనత్త..!
– కుమార్తె జాడ తెలియక తండ్రి ఆత్మహత్య
– తల్లి, గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి..
నవతెలంగాణ-నాంపల్లి
కొడుక్కు తెలియకుండా అతని బిడ్డను తల్లి, సోదరి విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా.. తన బిడ్డ భర్త దగ్గర ఉన్నాడని భార్య భావించగా.. కుమార్తె జాడ తెలియక తండ్రి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య గ్రామానికొచ్చి గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకొచ్చింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని గట్ల మల్లేపల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన మలిగిరెడ్డి సైదిరెడ్డి(34) తొమ్మిదేండ్ల కిందట దీపికను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టి చనిపోయింది. రెండో సంతానంలో పాప వర్ణిక పుట్టింది. తర్వాత దీపికకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్లోని తన తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో సైదిరెడ్డి తల్లి, చెల్లెలు దీపిక వద్దకు వెళ్లి మానసికంగా హింసించి.. వారి కుమార్తె వర్ణిక(3)ను తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా నానమ్మ, మేనత్త కలిసి బాలికను రూ.5 లక్షలకు విక్రయించారు. సైదిరెడ్డి తన కుమార్తె కోసం కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద ఆరా తీసినా తగిన సమాచారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయి చివరకు ఈనెల 22న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో గ్రామస్తులు సైదిరెడ్డి తల్లిని నిలదీశారు. తన మనుమరాలు చనిపోయిందని.. వేరే వారికి దత్తత ఇచ్చినట్టు రకరకాలుగా చెప్పింది. బాలిక వర్ణికను తీసుకొచ్చే వరకు తండ్రి దహన సంస్కారాలు జరగనిచ్చేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. భర్త సైదిరెడ్డి మృతి వార్త తెలియడంతోపాటు కుమార్తె భర్త దగ్గర లేదన్న విషయం తెలుసుకున్న దీపిక వెంటనే గట్లమల్లేపల్లికి వచ్చింది. అనంతరం గ్రామానికి చెందిన మల్లెపల్లి రజిత, గ్రామస్తులతో కలిసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. సైదిరెడ్డి మృతదేహాన్ని గురువారం దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.