కమిటీలతో సమస్యలు సాగదీసే ప్రయత్నం

– సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం సమస్యలను సాగదీయడం కోసమేనని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులంతా ఆశించారని తెలిపారు. కానీ మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం వల్ల ఇప్పట్లో సమస్యలు పరిష్కారం కాబోవనే పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేస్తామనీ, ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాలయాపన చేయకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.