మొదలు మరచిన పోరాటం
చిలవలు పలవలై అంతానికే
పంతం అంటోంది
ప్రతీకారాలు, అహంకారాలు నాటితే
యుద్ధాలే మొలకెత్తుతాయి
ఆయుధాలు పండించటం మొదలైనప్పుడే
నక్కినక్కి చూస్తున్న యుద్ధం కండ్లు మెరిశాయి
మారణహోమాలిప్పుడు
మానవ కల్యాణాల్లా
రొమ్ము విరుచుకు తిరుగుతుంటే
నింగి నల్లగా..నేల ఎర్రగా ఎదురుపడి
శాంతి గురించి దెబ్బలాడుకుంటున్నాయి
తెల్లపావురాల కువకువలకంటే,
రాబందుల రెక్కల చప్పుడే ఎక్కువగా వినిపిస్తున్నాయి
విశ్వశాంతి మున్ముందు చీకటిగదిలో లేని
నల్లపిల్లి అవుతుందేమోనన్పిస్తుంది!
ఆధిపత్యాలు, అవకాశవాదులు,
ఆయుధాలమ్ముకొనేవాళ్లు,
వెరసి మంటలు ఆరకుండా
యథాశక్తి మాటలు పేలుస్తున్న
యుద్ధభూమిలో మృత్యుపొగల మధ్య
తెల్లమేఘం లాంటి
శాంతిపావురం ఆలివ్ కొమ్మ నోట కరుచుకుని
రెక్కలల్లాడిస్తూ ఏ మూలనుండైనా
ఎగిరొస్తుందని చిన్న ఆశ!
– భీమవరపు పురుషోత్తమ్
9949800253