దాన ధర్మాలకు ధనం ఎక్కడిది?

Where is the money for charity?ఎక్కడైనా, కార్మికులకు తగిన సదుపాయాలు ఉండవు! తగినంత విశ్రాంతి వుండదు! ఒక్కో కార్మికుడూ పని ఒత్తిడితో భారీ యంత్రం కోరల్లో చిక్కుకుపోయి, ముక్క చెక్కలై పోతాడు. ముక్కలైంది ఎవరో పోలికలు తెలియకుండా అయిపోతాడు! ప్రతీ పెట్టుబడి దారీ లాభాల కోసం, ఎన్ని భారీ యంత్ర చక్రాల హత్యలో! ఆ శ్రామికుడి కుటుంబానికి, ఆ దేహం అయినా దొరకదు. ఏం మిగులుతుంది? యజమాని దానం చేస్తే కొంత డబ్బు! ఎంతో కొంత! అది కూడా, అప్పటి దాకా ఆ కార్మికుడి నించీ దోచిన లాభంలో పిసరంత భాగం! అదీ, ఆ శ్రామికుడికి దక్కేది! ఎప్పుడు? భారీ యంత్ర కోరల్తో దుర్మార్గంగా జరిగే మరణం గురించి సమ్మెల వంటిది ఏదో కార్మిక పోరాటం జరగవచ్చనే, ఉత్పత్తి క్రమం ఆగి, ఆనాడు లాభం, రాకపోవచ్చనే జంకుతో!
పరిశ్రమదారులందరూ కూడా మానవులే కాబట్టి, వారికీ మెదళ్ళు వుంటాయి. అవి, నిత్యం లాభాదాయాల కోసం తీవ్రంగా ఆలోచిస్తూ వుంటాయి!
ఇప్పుడు చెప్పండి! ‘డబ్బు’ అనేది, శ్రమ విలువని కొలిచే పరికరం. ఏ పరిశ్రమదారుడికైనా వచ్చే కోట్లూ, శత కోట్లూ, సహస్ర కోట్లూ, శ్రామిక వర్గ జనాల శ్రమ ఫలితాలే! వాటిలో, పరిశ్రమదారుడి శ్రమ వుంటుందా? ఉంటే, అది కొంత కార్మిక జీతాన్నే ఇవ్వగలుగుతుంది. పరిశ్రమదారుడు సరుకు కోసం శ్రమ చేయడం నిజమై, ఆ శ్రమకి కార్మిక జీతం రావలిసిన దానికి కోట్లేమిటి? కోట్లు! వందల కోట్లు! వేల కోట్లు! లక్షల కోట్లు! ఏమిటీ లెక్కలు? స్వంత శ్రమలతో దాన ధర్మాలా? రతన్‌ టాటా ధర్మదాతా? నిత్య కృషీవలుడా? ఆదర్శనీయుడా? కృషీ, ఆదర్శం అన్నీ శ్రమని దోచడానికే కాదా!
శ్రమ దోపిడీలతో, డజన్ల, డజన్ల ఫ్యాక్టరీలపై అబద్దాల ఆదాయాలతో ఆస్తులు పెంచుతూ పోయేవాడు మానవతావాదా? సామాజిక సంక్షేమం కోసం, తపించే మానవులా దోపిడీదారులు? ఎంతెంత కీర్తనలు! ఎంతెంత పొగడ్తలో! ఎంతెంత భజనలో! ఈ భజనలు చేసేది, పెద్ద పెద్ద ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్లు కూడా! జనాల్ని భ్రమల్లో ముంచే మార్గమే కదా అది?
రతన్‌టాటాకి ఏదో ఒక్క ఉక్కు కంపెనీతోనే కాదు సంబంధం. దాదాపు 30 పెద్ద పెద్ద కంపెనీలతో వుంది. ఉక్కునే కాదు, ఉప్పులూ పప్పులూ చేయించే కార్యక్రమాల వంటివి కూడా. పెద్ద పెద్ద విదేశీ కంపెనీల్ని కూడా కొనేసిన అతి పెద్ద ధనస్వాములు టాటాలు!
అసలు, ‘డబ్బు’ అంటే, ‘శ్రమ విలువ’ని కొలిచే సాధనం! ప్రపంచంలో వుండే డబ్బు అంతా, శ్రామికుల అదనపు శ్రమల వల్ల వచ్చేదే!
శ్రామికవర్గ జనాభాలో, డాక్టర్లు వున్నారు. ఇంజనీర్లు వున్నారు. ప్రొఫెసర్లు వున్నారు! అందరూ పెద్ద జీతాలతో! అయినా, తగిన శ్రమలు చేస్తూనే!
కానీ, ఆ పెద్ద శ్రామికులు కూడా పెట్టుబడిదారీ లాభాల దుష్టత్వాల్ని గ్రహించలేకపోతున్నారా? మేధావులే, దుష్టత్వాన్ని గ్రహించకపోతే, ధనికుల ఆస్తి పెంపకాలే వారికి సంతృప్తిని ఇస్తాయా?
ఇంతకీ, టాటాలకి గానీ, ఇంకే ఇతర పెట్టుబడిదారులకు గానీ, లాభం అనేది ఎవరి శ్రమవల్ల వచ్చేది? యంత్రాల వల్లో, ముడిపదార్ధాల వల్లోనా? కాదు. అవి జీవం లేనివి. తమ విలువకన్నా ఎక్కువ విలువని ఇవ్వలేవు. ఇక ఇవ్వగలిగేది, జీవం వున్న కార్మికులే! వాళ్ళు జీతం డబ్బులతో, శ్రమ చేయడానికి కావలిసిన శక్తినిచ్చే తిండీ, బట్టా, నివాసమూ వగైరాలను కొనుక్కుంటారు. కానీ, ఆ జీతాల విలువని మించినంత ‘అదనంగా’ విలువ సృష్టి అవుతుంది! దానినే, పెట్టుబడిదారులు, ‘మా పెట్టుబడికి వచ్చిన లాభం!’ అంటారు, అనుకుంటారు. ‘లాభం’ అనేది, శ్రామికుల శ్రమలో నించి లాగేసిన భాగమే’ అని, లాభానికి సంబంధించిన రహస్యం గురించి తెలియనివారు, ‘చూశారా, వారికి ఎంత అదృష్టంతో ఎక్కువ డబ్బు వచ్చిందో! ఎంత ధర్మదాతో ఈయన, తన లాభాల్లో నించీ, ఎన్ని దానధర్మాలు చేస్తున్నాడో!’ అని మూర్చలు పోతారు. అమాయకులే! అయినా, వారిలో ఈ విషయాలు తెలుసుకోగలిగిన వారూ వున్నారు. ఉదాహరణకి, రతన్‌ టాటాకి మేనత్త కొడుకు అయిన ‘షాపూర్జీ సక్లత్‌ వాలా’ (1874-1936) అనే ఆయన, ధనిక కుటుంబంలో పుట్టినా, ‘శ్రమ దోపిడీని’ వివరించే మార్క్సు సిద్దాంతాన్ని అర్ధం చేసుకున్నాడు! అందుకే అతను బ్రిటన్‌ లో, కమ్యూనిస్టు పార్టీ పనుల్లో జీవితాంతమూ వున్నాడట! (గూగుల్‌ లో వున్న, అతని కధంతా ఇక్కడ చెప్పుకోలేము.)
అన్నిటికంటే, అద్భుతమైన విషయం, మార్క్సుని కలిసిన ‘ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌’ అనే ఆయన ఒక పెట్టుబడిదారుడి కొడుకు అయివుండి, 24వ ఏట, ఈ శ్రమ దోపిడీ, డబ్బూ, లాభం వంటి విషయాలు గ్రహించి, ‘ఇంగ్లండులో కార్మికవర్గ స్తితిగతులు’ అని ఒక గొప్ప పుస్తకం రాశాడు. దానిలో, పెట్టుబడిదారులు చేసే, దానధర్మాల (‘చారిటీ’) గురించీ, వాళ్ళ ‘దాతృత్వం’ (‘ఫిలాంత్రపీ’) గురించీ, పెట్టుబడిదారీ దాతల గురించీ, ఎంత తీవ్రమైన విమర్శ చేశాడో చూడండి!
”నువ్వు ముందు కార్మికుల రక్తాన్ని తాగేసి, తర్వాత నీ ఆత్మ సంతృప్తి కోసం, వంచనాత్మక మానవ ప్రేమను వారిపై కురిపించినా, వారి దగ్గర నుంచి దోచుకున్న (ప్లండరింగ్‌) దాంట్లోంచి వందో వంతు మాత్రమే వారికి తిరిగి ఇచ్చి, ప్రపంచం ముందు అతి గొప్ప మానవత్వ సేవకుడిగా నిన్ను నీవు నిలుపుకుంటున్నావు. దానం అనేది, దాన్ని తీసుకునే వాడి కంటే, అది ఇచ్చేవాడినే ఎక్కువ దిగజారుస్తుంది. సమాజంలో మీరు బహిష్కరించిన బిచ్చగాడు, ఆ దిగజారిన వాడు, తనకున్న ఆఖరి అవకాశాన్ని, అంటే ‘నేనూ మనిషినే’ అనే వాదనను, మీ పాదాల ముందు పరిచి, మీ దయ కోసం ప్రాధేయపడాలనీ, ‘ముష్టివాడు’ అనే రూపంలో మీరు అతని నుదుటిపై శాశ్వత ముద్ర వేయాలనీ, మీ దాతృత్వం డిమాండు చేస్తుంది.”
ఇక్కడ ఎంగెల్సు స్పష్టంగా చెపుతున్నదేమిటి? పెట్టుబడిదారులు తాము కార్మికులనించీ లాభం రూపం లో ”దోచుకున్న” దానిలో నించే దాన ధర్మాలు చేస్తారు-అని!
మనం గమనించవలిసిన ఇంకో విషయం: దానాలు తీసుకోవడం, తీసుకునే వ్యక్తికి అవమానమే. ఇచ్చే వ్యక్తికి కూడా అది విలువ్కెన విషయం కాదు! దానాలు ఇతరులకు ఇవ్వగలిగే ఆర్ధిక స్థితిలో ఎవరు వుంటారు? అలాంటి స్థితిలో వుండడం, ఇచ్చేవాళ్ళకి కూడా అవమానమే. అసలు, ఒక మనిషి దానాలు పట్టే స్థితిలో వుండకూడదంటే, ఇంకో మనిషి దానాలు ఇచ్చే స్థితిలోనూ వుండకూడదు కదా? డబ్బు వున్న మనిషి దానాలు ఇచ్చే పని ‘కరుణతో చేసినట్టు’ కనపడుతుంది! కానీ, అది నిజం కాదు. అవతల బీదరికం వున్న వాళ్ళు దొరకాలి! బీదరికం వుండడం వల్లనే, దానాలు ఇచ్చే వాళ్ళు ‘కరుణామయులుగా’ చలామణీ అవుతారు!
అసలు, పెట్టుబడిదారులు చేసే దానధర్మాలు, అవి లాభాల్లో నించీ ఇచ్చేవి ఎంత పెద్ద శాతమైనా, అవి ‘వారి స్వంత శ్రమ విలువ నించీ’ ఇచ్చేవి కావు. అవి, శ్రమ దోపిడీ ఆదాయల నించీ ఇచ్చేవే! అవి ఒక పరాయి దేశానికే ఇచ్చినా, ఆ పరాయి దేశం బీదదే! అంటే, ఆ దేశం లోని ప్రజలు పేదలే! దోపిడీదారుడి దానాల్ని, కపట స్వభావంతో తమ కీర్తి కోసం, పేరు కోసం, ఇచ్చేవిగానే గ్రహించాలి.
కార్మికులు, సాటి పేదలకు చేసే సహాయాన్ని అయితే, ఒక పేద, ఇంకా తక్కువ పేదకి, నిజమైన దయతో చేసేది అవుతుందని, ఎంగెల్స్‌ అంటాడు: ”బూర్జువాలు విరాళాల ద్వారా చేసే పరోపకారం ఎంత వరకూ ఉపయోగపడిందో, ‘కానన్‌ పార్కిన్‌సన్‌’ (మాంచెస్టరులోని ఒక మత గురువు) స్వయంగా చెప్పిందాన్ని బట్టి తెలుస్తుంది. బీదలకు బూర్జువా వర్గం అందించే సాయం కంటే, చాలా ఎక్కువని సాటి బీదలే ఇతర బీదలకు అందిస్తారు! ఆకలి అంటే ఏమిటో స్వయంగా తెలిసిన, నిజాయితీపరులైన కార్మికులు అందించే సహాయమూ, తనకే చాలని తిండిలోనించే పంచుకోవడమూ వంటిదే, నిజమైన త్యాగం! అది సంతోషంగా చేసే త్యాగం! విలాస వంతుడైన బూర్జువా, నిర్లక్ష్యంగా విసిరే బిచ్చం, పూర్తిగా అబద్దపు భావంతో వుండేదే. తను చాలా దయాళువునని పైకి ప్రకటించే, తనను తను నమ్మించుకునే చర్య అది.”
(‘ఇంగ్లండులో కార్మిక వర్గ స్తితిగతులు’, ప్రగతి ప్రచురణలు, పేజీలు:207-208.)
ఈ విమర్శలు చేసిన 4 ఏళ్ళ తరవాత, ఎంగెల్సు, మార్క్సుతో కలిసి రాసిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ లో ఇలాంటి దాతృత్వాన్ని, ‘బూర్జువా సోషలిజం’గా పిలిచారు! ”బూర్జువా సమాజాన్ని చిరస్తాయిగా చేసే ఉద్దేశంతో, సామాజిక ఇబ్బందులు తొలగించాలని బూర్జువా వర్గం లోని” ‘దానశీలురు’ ఇలా దానాలు చేస్తారని అసలు రహస్యం బైటపెట్టారు!
పాఠకులూ! పారిశ్రామికవేత్తల దానధర్మాల రహస్యాల్ని తెలుసుకున్నారా? మా చిన్నతనంలో, టాటాలూ-బిర్లాలూ- అని ధనికుల పేర్లు వినే వాళ్ళం. ఇప్పుడు, వాళ్ళని తలదన్నే అదానీ, అంబానీ అనే వాళ్ళ గురించి చదువుతున్నాము. ఈ రతన్‌ టాటా దానాలతో, పెట్టుబడిదారుల దాతృత్వం గురించిన సత్యాలేమిటో స్పష్టంగా అర్ధమైపోవడం లేదూ?
(ఇంకావుంది)
రంగనాయకమ్మ