నిరుపేద అనాధలకు మదర్ తెరెసా సొసైటీ సేవలు ఎంతో గొప్ప వని చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ లోని అనాథ ఆశ్రమంలోని 600 మంది మానసిక దివ్యాంగులకు హైదరాబాదుకు చెందిన మదర్ తెరెసా సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సమకూర్చిన రూ. 4 లక్షలు విలువైన నిత్యావసర సరుకులు,నూతన వస్త్రాలు దుప్పట్లు గీజర్లు ఫ్యాన్లు ఆయన చేతులమీదుగా శనివారం పంపిణీ చేసి మాట్లాడారు.సమాజంలో ఆదరణ లేక మానసికంగా అనారోగ్యం తో ఎంతోమంది నిరుపేదలు బాధలు పడుతున్నారని రోడ్ల వెంట చెత్తకుప్పల వెంట తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. అలాంటి వారి ఆకలి బాధ తీర్చేందుకు, వారి జీవితాల్లో సంతోషం నింపేందుకు మదర్ తెరెసాను ఆదర్శంగా తీసుకుని ఈ సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. పుట్టినప్పుడు ఏమీ తీసుకురామని పోయేటప్పుడు తీసుకు వెళ్ళేది ఏమీ ఉండదని గుర్తించి తమ సంపాదనలు కొంత అనాథల కోసం కేటాయించి వారికి సేవలు అందిస్తున్నందుకు మదర్ తెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులను ఆయన ప్రశంసించారు.పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సొసైటీని ఆదర్శంగా తీసుకుని తమ శక్తి మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.తాము సైతం సేవా కార్యక్రమాలు పోలీసు శాఖ ద్వారా నిర్వహించనున్నట్టు ప్రకటించారు.అనాధ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ మాట్లాడుతూ అనాధల ఆకలి తీర్చేందుకు నిత్యావసర సరుకులు సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందించే సహకారాన్ని అనాథల ఆకలి తీర్చేందుకే వినియోగిస్తామని ఈ పుణ్యం దాతలకే దక్కుతుందని అన్నారు. మదర్ థెరీసా సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ అవసరమైన వారికి సేవ చేస్తే ఆత్మసంతృప్తి లభిస్తుందని దేవుడి ఆశీర్వాదం దొరుకుతుందని అన్నారు.సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎలీషా మాట్లాడుతూ 23 ఏళ్లుగా తమ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విద్యాభివృద్ధికి మహిళా సంక్షేమానికి, వృద్ధులను చేరదీయడానికి,అనాధల పునరావాసానికి తమ సొసైటీ ద్వారా సేవలందిస్తున్నామని వివరించారు. సొసైటీ డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరెసా చెప్పిన సిద్ధాంతాన్ని తాము ఆచరణలో పెడుతున్నామని తెలిపారు.సామాజిక కార్యకర్తలు పర్నె శివారెడ్డి,సుక్క సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.అనాధలకు నిత్యావసర సరుకులు అందించినందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మదర్ తెరెసా సొసైటీ అధ్యక్షుడు కిరణ్ ప్రధాన కార్యదర్శి ఎలీషా డైరెక్టర్ సుధీర్ లను ఏసీబీ మధుసూదన్ రెడ్డి సన్మానించారు.