దీపావళి అనగానే ముందుగా మన కళ్ళముందు మెదిలేది పిల్లల చేసే టపాకాయల, బాణసంచా సందడి. పెద్దలు వెలిగించే దీపాల ఆవళి. ఇలా సంస్కతి సంప్రదాయాల పేరిట భక్తి శ్రద్ధలతో వెలిగించే దీపాల వెలుగుల దీపావళి మిలమిల కాంతుల రంగేళీ. భారతీయులు చేసే ప్రతి పండుగ వెనుక ఒకానొక బలమైన నమ్మకంతో పాటు శాస్త్రీయత కూడా ఉంటుందనేది అక్షర సత్యం.
మరి దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఏం చేస్తారు? పండుగ వెనుక ఉన్న అసలైన అర్థం పరమార్థం ఏమిటో చూద్దాం.
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఆశ్వీయుజ అమావాస్య రోజున వస్తుంది. ఈ అమావాస్యకు ముందు ఆశ్వీయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. నరక చతుర్దశి పేరు రావడానికి కారణం నరకుడనే రాక్షసుడిని సంహరించిన రోజు. నరకుడనే రాక్షసుడు మంచి చెడుల విచక్షణ లేకుండా సాధు జనాలను పీడిస్తూ, అనేక రకాల బాధలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా దుష్టత్వం ఎక్కువ కాలం కొనసాగదు. తగిన శిక్ష తప్పకుండా పొందుతారు అనేది మనకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా మితిమీరిన నరకాసురుడి ఆగడాలను అరికట్టడానికి సత్యభామ నరకునితో యుద్ధం చేసి సంహరిస్తుంది.
పురాణేతిహాసాలు, యుగాలు తిరగేస్తే మనకు తెలిసింది ఏమిటంటే నరకుడు భూదేవి కుమారుడనీ, ఇతడికి తల్లి చేతిలో తప్ప ఇతరుల చేత మరణం ఉండదని తెలుస్తుంది.
ఏ తల్లి అయినా స్వయంగా కన్న బిడ్డను చంపుకోదు అనే ధీమాతో నరకాసురుడు చెలరేగిపోయి ప్రజలను హింసించడం, ఆ తర్వాత భూదేవే సత్యభామగా జన్మించి నరకుడిని స్వయంగా సంహరించడం ఇందులో చూస్తాం. ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ‘తమ్ముడు తనవాడైన ధర్మం తప్పు చెప్పకూడదు’ అనే నీతి సామెత. ‘చట్టం ముందు అందరూ సమానమే’ న్యాయ సూత్రం ఇందులో ఇమిడి వుంది. కడుపున పుట్టిన కొడుకైనా దుర్మార్గంతో దుష్టపాలన చేస్తే అతడికి తగిన శిక్ష పడాల్సిందే అనే గొప్ప సత్యం కూడా దాగుంది.
ఈవిధంగా అసురత్వ నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. చతుర్దశి రోజు నరకుని పీడ విరుగడైన ఆనందంతో మరుసటి రోజు ఇంటింటా దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు. ఇది దీపావళి పండుగ గురించి పురాణ కథనం.
ఈ దీపావళి వెనుక అనేకానేక నమ్మకాలతో కూడిన కథలు ఉన్నాయి. లంకలో రావణాసురుడిని సంహరించి సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సమయంలో ప్రజలు ఆనందంతో ఈ పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అనగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ‘చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం సాధించిన విజయా’నికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం విశేషం. ఇక చారిత్రకంగా చూసినట్లయితే చక్రవర్తి విక్రమాదిత్యుడు ఇదే రోజున సింహాసనం అధిష్టించిన రోజు. అతని పాలన ప్రజారంజకంగా సాగిందని, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఆయన సింహాసనం అధిష్టించిన రోజును దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ దీపావళి భారతదేశంలోని ప్రజలు కుల, మత, వర్గ భేదం లేకుండా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
అయితే ప్రజలు కేవలం ఈ కారణాలతోనే కాకుండా ఈ పండుగ చేసుకోవడానికి చాలా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
వేసవి కాలం ముగిసిన తర్వాత శరదతువు ఆరంభంలో వచ్చే పండుగ ఇది. దీనిని వర్ష ఋతువు పండుగగా చెప్పుకోవచ్చు. ఈ కాలం పగలు కంటే రాత్రి సమయం ఎక్కువ. పూర్వకాలంలో విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో చీకటిని పారద్రోలడానికి రాత్రి పూట గహాలు, వీధులు, దేవాలయాల్లో దీపాలు వెలిగించే వారు. ఇలా దీనిని కాంతి పండుగ అని కూడా అంటారు.
దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపావళి రోజున వారి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు.
ఆ తర్వాత సాయంత్రం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాలుస్తారు. అందులో మిరుమిట్లు గొలిపే కాంతుల చిచ్చుబుడ్లు, భూమ్మీద తిరిగే భూచక్రాలు, గిరగిరా తిరిగే విష్ణు చక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళకు జిగేల్ మంటూ వుంటే మరో ప్రక్క లక్ష్మీ బాంబులు సీమ టపాకాయల ధ్వనులతో వీధులన్నీ మారుమోగుతూ వుంటాయి.
అయితే ఈ బాణాసంచా కాల్చడానికి ముఖ్య కారణం వర్ష ఋతువులో నేలలో ఏర్పడిన తేమ వల్ల పుట్టి పెరిగే దోమలు, ఈగలు, రోగకారక క్రిమి కీటకాదులన్నీ బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే వెలుతురు, చప్పుళ్ళు, పొగలకు నశిస్తాయి. బాణాసంచాలో ముఖ్యంగా గంధకం, సురేకారం లాంటి రసాయనిక పదార్థాలు కాల్చడం వల్ల వచ్చే వాయువుల వల్ల క్రిమి కీటకాలు నశించి రాబోయే రోగాలకు చెక్ పెడతాయి.
ఇక ఆధ్యాత్మిక వాదుల భావనలో దీపాల వెలుగు, శబ్ద తరంగాల ద్వారా మనసు శరీరాల్లో ఒకలాంటి ఉత్తేజం, ఉత్సాహం కలిగి నిరాశా నిస్పహలు దూరమవుతాయి.
మరి ఇప్పుడు జరుపుకునే దీపావళి పండుగలో కాల్చే బాణాసంచాలో అనేక రకాల పేలుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడటం వల్ల పసిపిల్లలు, వద్ధులు, వ్యాధి గ్రస్తులకే కాకుండా పక్షులు జంతువులకు కూడా హాని కలుగుతుంది.
కాబట్టి కాలుష్యరహిత హరిత దీపావళి జరుపుకోవడానికి ప్రజలు ముందుకు రావాలి. విద్యుత్ దీపాలు కాకుండా మట్టి దీపాలను వెలిగించాలి. కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ అనుకూలమైన బాణాసంచాను ఎంచుకోవాలి. రంగోళీ రంగుల్లో సింథటిక్ రంగులను కాకుండా పర్యావరణ అనుకూలమైన పూల రేకులతో, బియ్యం పిండి, ఇసుక మొదలైన వాటిని వాడాలి.
పెరుగుతున్న పర్యావరణ కాలుష్యంలో జరుపుకోబోయే ఈ పండుగ మరింత కాలుష్యానికి హేతువు కాబోతుంది. దీపావళికి వెలిగించే బాణాసంచా వల్ల కాలుష్యం కొన్ని చోట్ల 875% పెరిగిందని వాతావరణ నివేదిక వెల్లడించింది.
కాబట్టి ఈ సంవత్సరం జరుపుకోబోయే దీపావళిని పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలి. భూమాత మీద ఒట్టేసి పర్యావరణానికి ఎలాంటి హానీ తలపెట్టమని ప్రతిజ్ఞ చేయాలి.
బాణాసంచాలో ఆకుపచ్చ బాణా సంచాను మాత్రమే ఉపయోగించాలి. దీపాలంకరణకు మట్టి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి.
బాణా సంచాను కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణ హిత దీపావళిని ఆబాల గోపాలం అత్యంత ఇష్టంగా జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలి! అప్పుడే దీపావళి పండుగ మానవాళికి మాత్రమే కాకుండా పశు పక్ష్యాదులకు కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
– వురిమళ్ల సునంద, 9441815722