– 359 పరుగుల
– ఛేదనలో భారత్ 245 ఆలౌట్
– చారిత్రక టెస్టు సిరీస్ ఆ జట్టు సొంతం
– రెండో టెస్టులో భారత్ పరాజయం
శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్ ఓటమి. ఉత్తమ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సేవలు దూరం, కెప్టెన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో సొంతగడ్డపై వరుసగా 18 సిరీస్‌ల్లో ఓటమెరుగని టీమ్ ఇండియాతో సమరం. సహజంగానే న్యూజిలాండ్‌పై కొండంత ఒత్తిడి కనిపించింది.
న్యూజిలాండ్ క్రికెట్ బేసిక్స్‌ను పాటించింది. బలమైన భారత్‌పై ఒక్కో అడుగే వేస్తూ ఆధిపత్యం చూపించింది. బెంగళూర్‌లో పేస్ స్పిన్‌ను విజయంతో 36 ఏండ్లలో భారత్‌లో తొలి టెస్టు విజయం సాధించగా.. పుణెలో స్పిన్ పిచ్‌పై విజయంతో భారత గడ్డపై చారిత్రక తొలి టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 359 పరుగుల ఛేదనలో భారత్ 245 పరుగులకే కుప్పకూలింది. భారత్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. 12 ఏండ్ల తర్వాత భారత్ స్వదేశంలో ఓ టెస్టు సిరీస్‌లో పరాజయం చవిచూసింది. వరుసగా 18 సిరీస్‌ల విజయ పరంపరకు పుణెలో బ్రేక్ పడింది.
నవతెలంగాణ-పుణె
న్యూజిలాండ్ సాధించింది. భారత్‌ను భారత్‌లో ఓడించింది. పుణె టెస్టులో టీమ్ ఇండియాను అన్ని విభాగాల్లోనూ వెనక్కి నెట్టిన న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. గత 12 ఏండ్లలో భారత్‌కు స్వదేశంలో ఇది తొలి సిరీస్ ఓటమి కాగా.. న్యూజిలాండ్‌కు భారత గడ్డపై ఇదే తొట్టతొలి టెస్టు సిరీస్ విజయం కావటం విశేషం. 359 పరుగుల ఛేదనలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (77, 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్థ సెంచరీతో చెలరేగినా.. సహచర బ్యాటర్ల నుంచి సహకారం దక్కలేదు. రవీంద్ర జడేజా (42, 84 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (21, 47 బంతుల్లో 2 ఫోర్లు), అశ్విన్ (18, 34 బంతుల్లో 2 ఫోర్లు) సహా శుభ్‌మన్ గిల్ (23, 31 బంతుల్లో 4 ఫోర్లు) భారత్‌కు గౌరవప్రద ఓటమికి అందించగలిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (17), రిషబ్ పంత్ (0), సర్ఫరాజ్ ఖాన్ (9) తేలిపోయారు. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ (6/104) ఆరు వికెట్ల మాయజాలంతో భారత్ 245 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు, టామ్ లేథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48), టామ్ బ్లండెల్ (41) మెరవటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ వాషింగ్టన్ నాలుగు వికెట్లు కూల్చాడు. 13 వికెట్లతో మాయజాలం చేసిన మిచెల్ శాంట్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 3 మ్యాచుల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో ఎదురులేని ఆధిక్యం సాధించింది. భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబయిలో ఆరంభం కానుంది.
జైస్వాల్ ఆశలు రేపినా
359 పరుగుల లక్ష్యం. నాల్గో ఇన్నింగ్స్‌లో కష్టసాధ్యమైన టార్గెట్. కివీస్ స్పిన్నర్ల ఎదురుదాడి కాచుకుని భారత్ లక్ష్యం దిశగా సాగటం కష్టమే అనిపించింది. కానీ యువ ఓపెనర్ యశస్వి జ్వైస్వాల్ (77) భారత్ శిబిరంలో ఆశలు రేపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (8) మరోసారి విఫలమైనా.. శుభ్‌మన్ గిల్ (23, 31 బంతుల్లో 4 ఫోర్లు) కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ వైపు మిచెల్ శాంట్నర్ మాయ చేసినా.. మరో ఎండ్ నుంచి పరుగుల వేట సాగించాడు. జైస్వాల్ ధనాధన్‌కు గిల్ పోరాటం తోడవటంతో లంచ్ విరామ సమయానికి భారత్ 12 ఓవర్లలోనే 81 పరుగులు చేసింది. 6.75 రన్‌రేట్‌తో ఛేదనను పట్టాలెక్కించిన యశస్వి న్యూజిలాండ్ వెనుకడుగు వేసేలా చేశాడు. కానీ లంచ్ విరామం తర్వాత సీన్ మారిపోయింది. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించాడు. కానీ శుభ్‌మన్ గిల్ మరో ఎండ్‌లో వికెట్ల పతనాన్ని ఆపలేకపోయాడు. శాంట్నర్ ఉచ్చులో పడిన గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. రిషబ్ పంత్ (0) అనవసర పరుగు కోసం వెళ్లి వికెట్ పారేసుకోగా.. విరాట్ కోహ్లి (17) దారుణంగా విఫలమయ్యాడు. యశస్వి జైస్వాల్ క్రీజులో ఉండగా 127/2తో బలంగా కనిపించిన భారత్.. అతడి పతనంతో చేతులెత్తేసింది. లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ (21), రవీంద్ర జడేజా (42), రవిచంద్రన్ అశ్విన్ (18) మెరిసినా.. భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఓ ఎండ్‌లో నిరాకంటంగా మాయ చేసిన మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లతో భారత్‌ను ఆలౌట్ చేశాడు. అజాజ్ పటేల్ 2, గ్లెన్ ఫిలిప్స్ ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 60.2 ఓవర్లలో 245 పరుగులకు భారత్ కథ ముగిసింది.
ఆ ఇద్దరు మెరువగా
ఓవర్‌నైట్ స్కోరు 198/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ మరో 57 పరుగులు జోడించింది. టామ్ బ్లండెల్ (41, 83 బంతుల్లో 3 ఫోర్లు) త్వరగా అవుటైనా.. గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టెయిలెండర్లు త్వరగా నిష్క్రమించినా ఓ ఎండ్ నుంచి విలువైన పరుగులు పిండుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారతకు 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4/55), రవీంద్ర జడేజా (3/72), అశ్విన్ (2/97) వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 259/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 156/10
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 255/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) డార్లీ (బి) శాంట్నర్ 77, రోహిత్ శర్మ (సి) యంగ్ (బి) శాంట్నర్ 8, శుభ్‌మన్ గిల్ (సి) డార్లీ (బి) శాంట్నర్ 23, విరాట్ కోహ్లి (ఎల్బీ) శాంట్నర్ 17, రిషబ్ పంత్ (రనౌట్) 0, వాషింగ్టన్ సుందర్ (సి) యంగ్ (బి) ఫిలిప్స్ 21, సర్ఫరాజ్ ఖాన్ (బి) శాంట్నర్ 9, రవీంద్ర జడేజా (సి) సౌథీ (బి)అజాజ్ 42, ఆకాశ్ దీప్ (సి) రచిన్ (బి) అజాజ్ 1, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 10,
ఎక్స్‌ట్రాలు : 19,
మొత్తం : (60.2 ఓవర్లలో ఆలౌట్) 245.
వికెట్ల పతనం : 1-34, 2-96, 3-127, 4-127, 5-147, 6-165, 7-167, 8-206, 9-229, 10-245.
బౌలింగ్ : సౌథీ 2-0-15-0, ఓరౌర్క్ 1-0-5-0, శాంట్నర్ 29-2-104-6, అజాజ్ 12.2-0-43-2, ఫిలిప్స్ 16-0-60-1.