బీసీలకు కేంద్రం అన్యాయం

– ప్రధాని ఓబీసీ అయినా బీసీలకు ఒరిగిందేమి లేదు : బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ బీసీలకు అన్యాయం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయినా దేశంలోని బీసీలకు చేసింది ఏమిలేదన్నారు. శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని మహాధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాకు పలు రాజకీయ పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ జన గణనలో కులాల వారీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కేటాయించాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. దేశంలో 76 కోట్లకుపైగా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ. 2వేల కోట్ల కేటాయింపులు చేయడం దారుణ మన్నారు. ఈ నిధులతో బీసీలకు చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని రూ. 2 లక్షల కోట్లు కేటాయించి బీసీల అభ్యున్నతికి ఖర్చు చేయాలన్నారు. చేతి వృత్తులు చేసే ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సహాయం అందించాలని కోరారు. లేదంటే బీసీల హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.