విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడులకు ఉపాధ్యాయుల కేటాయింపు

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రభుత్వం దృష్టిసారించింది. విద్యార్థులు ఎక్కువగా ఎండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న స్కూళ్ల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి వారిని ఎక్కువ విద్యార్థులున్న బడులకు కేటాయించాలని డీఈవోలను ఆదేశించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొత్తగా ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పామని వివరించారు.
కొన్ని స్కూళ్లలో విద్యార్థుల నమోదు తగ్గుతున్నదనీ, మరికొన్నింటిలో పెరుగుతున్నదని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించినా కానీ ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తక్కువుండి ఉపాధ్యాయులు ఎక్కువున్న పాఠశాలల నుంచి విద్యార్థులు ఎక్కువున్న బడులకు వారిని కేటాయించాలని పేర్కొన్నారు.