– నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం సచివాలయ ముట్టడి కార్యక్రమం జరిగింది. విద్యార్థి నాయకులు జీహెచ్‌ఎంసీ నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. బీఆర్‌కేఆర్ భవన్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సచివాలయంలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఏఐఎస్‌ఎఫ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌ఏ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. ఫీజులు సకాలంలో విడుదల చేయకుంటే విద్యార్థులు చదువులను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. చదువు పూర్తయిన విద్యార్థులు ఉద్యోగాలు ఎలా చేస్తారనీ, పై చదువుల కోసం విదేశాలకు ఎలా వెళ్తారని అడిగారు. రూ.7,650 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాలు, వారి సమస్యలు తీరడం లేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి చెప్పిందేంటీ?, అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేంటని ప్రశ్నించారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ హయాంలో తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వమే తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఇటికాల రామకృష్ణ, బానోత్ రఘురాం, గ్యార క్రాంతి, రహమాన్, బరిగల వెంకటేష్, సి రాజు, రాష్ట్ర సమితి సభ్యులు చైతన్య, వంశీవర్ధన్‌రెడ్డి, ముదిగొండ మురళీ, జేరిపోతుల జనార్ధన్, రామరాపు వెంకటేష్, దత్తు రెడ్డి, పవన్ చౌహాన్, అంజి, యూనస్, హరీష్, శ్రావణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.