దండుపాళ్యం ముఠాలా తయారైంది

– బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియాపై జగ్గారెడ్డి ఫైర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా దండుపాళ్యం ముఠాలాగా తయారైందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అమెరికా, సింగపూర్‌ నుంచి సోషల్‌ మీడియా నడపడం కాదని…దమ్ముంటే ధైర్యంగా ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సమస్యలపై పోరాడితే తప్పులేదనీ, కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ట్రోల్‌ చేస్తోందని విమర్శించారు. సీఎం అననివి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌, హరీశ్‌రావుకు పిచ్చిపట్టిందని ఆరోపించారు. ‘తేడా వస్తే తాట తీస్తా. రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్‌. బీఆర్‌ఎస్‌ నేతలు ఇలానే వ్యవహరిస్తే మా సోషల్‌ మీడియాను రంగంలోకి దింపుతాం. కేటీఆర్‌ డబుల్‌ లచ్చా. చిట్టి నాయుడు కాదు.రేవంత్‌ రెడ్డి గట్టి రెడ్డి. రేవంత్‌ రెడ్డి తన ఛాంబర్లో తొడగొడితే కేటీఆర్‌కు కాళ్ళు వణుకుతాయి. జగ్గారెడ్డి మాటే శాసనం’ అని అన్నారు. సోషల్‌ మీడియా నడిపేది ఎవడో తెలిస్తే ఖైరతాబాద్‌ సెంటర్లో బట్టలిప్పి కొడతానంటూ హెచ్చరించారు. ఓ కలెక్టర్‌కు తాను ఫోన్‌ చేస్తే ఎత్తలేదనీ, దీంతో తనకు కోపం వచ్చి తిట్టానంటూ చెప్పారు.’బీఆర్‌ఎస్‌ హయాంలో ఇద్దరు కలెక్టర్‌లకు పది సార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు.వాళ్ళని తిట్టాను.తప్పేంటి. నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు’ అని వివరణ ఇచ్చారు.