టీఎస్‌యూఈఈయూలో చేరిన 31 మంది సీబీడీ-ఎస్‌ఎంజీ కార్మికులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న సీబీడీ-ఎస్‌ఎంజీ కార్మికులు తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం)లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో 400, 200, 132కేవీ సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న మెయింటెనెన్స్‌ గ్యాంగ్‌ కార్మికులు, సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌ కార్మికుల సమావేశం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు అధ్యక్షతన జరిగింది. టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.గోవర్ధన్‌ మాట్లాడుతూ…ట్రాన్స్‌కో సీబీడీ- ఎస్‌ఎంజీ గ్యాంగ్‌ కార్మికులు అత్యంత క్లిష్టతర పనులు నిర్వహించే వారికి విద్యార్హతతో సంబంధం లేకుండా గ్రేడ్‌-1 కార్మికులతో సమానంగా వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కె. ఈశ్వర్‌రావు మాట్లాడుతూ గతంలో వారు హైస్కిల్డ్‌ వేతనం పొందేవారనీ, వేతన సవరణ జరిగినప్పటికీ గతంలో కంటే తక్కువ వేతనాలు వస్తున్నాయని వాపోయారు. దీనిని యాజమాన్యం, గుర్తింపు సంఘాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కష్టతరమైన పనిచేస్తున్న సిబీడీ గ్యాంగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలనీ, ఆర్టిజన్‌ కార్మికులకు కన్వర్షన్‌ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్‌కో సీబీడీ గ్యాంగ్‌ కార్మికులు యూనియన్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ కె. మధు, జె. ప్రసాదరాజు, కోశాధికారి ఎస్‌. బస్వరాజు ట్రాన్స్‌కో కమిటీ నాయకులు వెంకటేశ్వరరావు, అంజయ్య, చందులాల్‌, శ్యాం, సైదులు, అరండు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.