ఒకే దేశం-ఒకే ఎన్నిక : ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాల్‌!

One country-one election: a challenge to the spirit of democracy!భారత ప్రజాస్వామ్యంలో ఒక దేశం-ఒకే ఎన్నిక అనే సిద్ధాంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే సమయంలో సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను నిర్వహించడం అంత సులభమేమీ కాదు. కేంద్ర పాలకులు చెప్పే మాటలు, భారత లౌకిక విధానానికి పూర్తి భిన్నం. వాళ్లు చెప్పే ఖర్చుల తగ్గింపు కన్నా ఎక్కువ సమస్యలు నెలకొనే అవకాశాలున్నాయి. ఇది వైవిధ్యoతో కూడిన ప్రజాస్వామ్యస్ఫూర్తికి ఒక సవాల్‌గా మారనుంది? భారతదేశం అనేక భాషలు, సంస్కృ తులు, ప్రాంతాల సమాహారంతో కూడిన దేశం. వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రాజకీయ, సామాజిక సమస్యలున్నాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల కోణంలోనే పరిశీలన చేయాల్సి ఉంటుంది. జమిలితో ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయి సమస్యలను ముందుకు తెచ్చే అవకాశం క్షీణించవచ్చనేది విమర్శకులు భావన. దేశంలో 1952, 1957, 1962 , 1967 వరకు సార్వత్రిక ఎన్నికలు , రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించబడ్డాయి. కానీ, అప్పటి నుండి ప్రాంతీయ రాజకీయాల ప్రాముఖ్యత పెరిగింది. 1967 తర్వాత, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల రద్దు లేదా ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల కారణంగా రాష్ట్రాల ఎన్నికలు వేరుగా నిర్వహించబడ్డాయి. మనది, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పబడే దేశం ‘జమిలి’తో ఏకపక్షంగా రాజకీయాలు సాగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అందువల్ల జమిలి ఎన్నిక అనేది మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధం.
దేశంలో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతాల సమ స్యలు వేరే రాష్ట్రాల సమస్యలతో పోల్చలేము.వీటిని ఆయా రాష్ట్రాల పరిధిలోనే పరిష్కరించుకోవాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక వనరులను రాబట్టగలగాలి. అయితే ఇప్పుడున్న కేంద్రంలోని ఎన్డీయే రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా లాగేసుకుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇవ్వాల్సిన నిధుల్లోనూ కోతలు విధిస్తోంది. అందుకే జమిలి లాంటి విధానాలు రాష్ట్రాలకు మరింత నష్టాలు చేకూరుస్తాయనే భావన కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకే సమయంలో భారీ సంఖ్యలో ఎన్నికలను నిర్వహించడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా అనుమానమే.
ఒకే సమయంలో సుమారు మూడువేల నియోజకవర్గాలు ఎన్నికలలో పాల్గొంటే, ఎన్నికల సంఘంతో పాటు ప్రజలు సమస్యల్ని ఎదుర్కొనే అవకాశముంది. ఒకే ఎన్నికల సమయంలో పోలింగ్‌ నిర్వహణ, ఇవిఎంలు సరిపడా లభ్యం, సురక్షిత చర్యలు వంటి సవాళ్ల గురించి కూడా అనేక చర్చలు నడుస్తున్నాయి. ఇది సాధ్యం కాదేమోననే భావనే ఎక్కువగా ఉంది. అంతకన్నా మతసామరస్యత, లౌకికవాదం అన్నిటికంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రధాన్యత పెరుగుతున్నది. జమిలిని తీసుకొస్తే సమాఖ్య వ్యవస్థ పెద్ద పరిణామాలను ఎదుర్కొనే అవకాశముంది. ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల సమతౌల్యానికి నష్టం జరగచ్చు. అందరికీ ఒకే చట్టం, ఒకే విధానం అనేవి రాష్ట్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవచ్చు.
ప్రజల విశ్లేషణ, సర్వేల ప్రకారం, 2019లో భారతదేశంలో సుమారు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో సుమారు 67శాతం మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రాంతీయ ఎన్నికల ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ భాగస్వామ్యం మరింత వివిధతను ప్రతిబింబిస్తుంది. ఒకే ఎన్నిక ఉంటే, ప్రజల ఆకర్షణ ప్రధాన నాయకత్వంపై మిగిలి, ప్రాంతీయ సమస్యలు దూరమయ్యే ప్రమాదముంది.
అంతిమంగా, జమిలి ఎన్నికలు అనేది వివిధ అభిప్రాయాల మధ్య ఒక సవాల్‌గా ఉందనే చెప్పాలి. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే అభివృద్ధి అని చెబుతున్నప్పటికీ వైవిధ్యమైన భారత్‌లో ఇది సాధ్యం కాదు. ఎన్నికల ఖర్చు తగ్గడం, సమర్థత పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని చేస్తున్న కేంద్రం చేస్తున్న వాదన తప్పు. ఎందుకంటే ఎవరి రాష్ట్రాల వనరులు, ఆర్థిక భారాలు, ఖర్చులు, లోటు, మిగులు ఇప్పుడు భరిస్తున్నదే కదా. కేంద్రం చేస్తున్న సాయం ఏమీ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ, మిగతా రాష్ట్రాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే భారత్‌ భిన్నమతాలు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతుల కలయిక.లౌకితత్వంతో కూడిన దేశం. జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం!
సృజన దుర్గే