నవతెలంగాణ-చేర్యాల
అవమానం భరించలేక ఓ విద్యార్థి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని శభాష్‌గూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణ కేంద్రంలోని వికాస్ గ్రామర్ హైస్కూల్లో గాడిపల్లి మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పరీక్ష సందర్భంగా సెల్ఫోన్లో చూస్తూ రాస్తున్నాడని గమనించి మనోజ్‌పై ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నారు. దాంతోపాటు తండ్రిని స్కూల్‌కి పిలిపించారు. అదే విషయంపై తండ్రి కూడా తోటి విద్యార్థుల ముందే మందలించడంతో అవమానంగా భావించాడు. అనంతరం పాఠశాల నుంచి తన స్వగ్రామం శభాష్ గూడెం వచ్చి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.