ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను కలిసిన జేపీ నడ్డా

–  సిద్ధాంతాలు వేరైనా
అభిప్రాయాలు పంచుకోవడం మంచిదే : నాగేశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. ప్రధానిగా మోడీ తొమ్మిదేండ్ల పాలనపై ముద్రించిన పుస్తకాన్ని నాగేశ్వర్‌కు ఆయన అందించారు. తాజా రాజకీయాలపై కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. నడ్డాతో భేటీ అనంతరం నాగేశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా అనేక మందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నన్ను కలిశారు. అంతకు మించి ఏం లేదు. వివిధ అంశాలపై చర్చించాం. జేపీ నడ్డాతో నా అభిప్రాయాలను పంచుకున్నా.ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిదే’ అని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద శంకర జయంత్‌ను కలిసి మోడీ 9 ఏండ్ల పాలనపై పుస్తకాన్ని అందించారు. మరోవైపు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో బీజేపీ ముఖ్యనేతలతో నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, వివేక్‌, విజయశాంతి, రామచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.