ఎంబీబీఎస్‌లో ఫ్యామిలీ మెడిసిన్‌ను పాఠ్యాంశంగా చేర్చాలి

– ఫ్యామిలీ మెడిసిన్‌ డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరోగ్య సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఫ్యామిలీ మెడిసిన్‌ను ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాల్లో ఒక పాఠంగా చేర్చాలని పలువురు ఫ్యామిలీ మెడిసిన్‌ డాక్టర్లు కోరారు. హైదరాబాద్‌లో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు అకాడమీ ఆఫ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎఫ్‌ పీఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చైల్డ్‌ అండ్‌ ఫ్యామిలీ క్లినిక్‌ డాక్టర్‌ కె.మాధవి, వేంపల్లి సీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.మల్లీశ్వరమ్మ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) (అనంతపురం) జిల్లాలోని ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ మనోరంజన్‌ నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడారు. అన్ని వయస్సుల వారికి చికిత్సను అందించే ఫ్యామిలీ మెడిసిన్‌ చదివిన వారి సేవలను సమాజం, ప్రభుత్వాలు పూర్తిగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.
మూడు సంవత్సరాల పాటు ఫ్యామిలీ మెడిసిన్‌ చదువుకునే సమయంలో వార్డులోని అన్ని రకాల రోగులను చూసిన అనుభవం వారికుంటుందన్నారు. మెడిసిన్‌, సర్జరీ, పీడియాట్రిక్స్‌, గైనిక్‌, ఆర్థోపెడిక్‌, ల్యాబ్‌, రేడియాలజీ తదితర వాటి పట్ల అవగాహన కలిగిన వారి సేవలను ప్రాథమికంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలను కోరారు. తద్వారా ప్రజలకు భవిష్యత్తులో వచ్చే రోగాలను నివారించడంతో పాటు ఆరోగ్యరంగానికి పెట్టే ఖర్చును బాగా తగ్గించొచ్చని చెప్పారు. సూపర్‌ స్పెషలిస్టుల సేవలను గ్రామాల్లో ఉపయోగించుకునేంత వైద్య సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదనీ, కేవలం ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వారినే పంపిస్తే పూర్తి ప్రయోజనం నెరవేరదని తెలిపారు. ఫ్యామిలీ మెడిసిన్‌ అర్హత కలిగిన వారిని పంపిస్తే కుటుంబాల ఆరోగ్యానికి మరింత భరోసా కలుగుతుందని చెప్పారు. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఫ్యామిలీ మెడిసిన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.