గాజాపై ఇజ్రాయిల్‌ భయానక దాడులు

Israeli attacks on Gaza– 22 మంది మృతి
– లెబనాన్‌ సరిహద్దుల్లో ఇండ్లు పేల్చివేత
గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ భయానక దాడులకు పాల్పడింది. ఉత్తర, దక్షిణ గాజాపై శనివారం రాత్రి నుంచి ఉధృతంగా జరుపుతున్న ఈ దాడుల్లో పెద్దయెత్తున ప్రాణ నష్టం ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క ఉత్తర గాజాలోనే 22 మంది చనిపోయారు. దక్షిణ గాజాలోను, గాజా సరిహద్దు గ్రామాలపైన యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. లెబనాన్‌ సరిహద్దు గ్రామాల్లోని ఇళ్లను డైనమైట్‌లతో ఇజ్రాయిల పేల్చివేసినట్లు లెబనీస్‌ మీడియా తెలిపింది. సరిహద్దు గ్రామమైన అడైసేలో ఇజ్రాయిల్‌ సైన్యం తెల్లవారుజామున దాడి చేసి పౌర ఆవాసాలను పేల్చివేసిందని లెబనీస్‌ నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. మరో సరిహద్దు గ్రామమైన పార్‌ కిలాలో కూడా పెద్దయెత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుందని ఎన్‌ఎఎన్‌ తెలిపింది. అంతకుముందు దక్షిణ లెబనాన్‌లోని వ్యూహాత్మక భూగర్భ సదుపాయాన్ని 400 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించి పేల్చివేసినట్టు ఇజ్రాయిల్‌ మిలిటరీ ప్రతినిధి అవిచారు ఆడ్రే చెప్పారు. ఇదిలా వుండగా టెల్‌ అవీవ్‌ సమీపంలోని బస్‌స్టాప్‌ పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తి ఇజ్రాయిల్‌లోని అరబ్‌ పౌరుడని ఇజ్రాయిల్‌ పోలీసులు తెలిపారు. ఇజ్రాయిల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఉత్తర గాజాలో మారణ కాండ పట్ల ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.