రైల్వేలో జనరల్‌ బోగీలను పెంచాలి

దేశంలోని రవాణా వ్యవస్థల్లో సగటు భారతీయునికి తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలిగించేది రైల్వే వ్యవస్థ. కానీ ఇటీవల జరుగుతున్న తరచూ ప్రమాదాలు, కేంద్రం అమలు చేస్తున్న అసాధారణ నిర్ణయాల వలన రైల్వే వ్యవస్థ పట్ల నిర్లిప్తత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే అనేక ప్రమాదాల్లో అమాయకులు చనిపోయారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాల్లో దాదాపు 350 మంది మరణించినట్లు, 970 మంది ప్రమాదాల బారిన పడినట్లు సమాచారం. 2020 ఏడాదిలో రజూకవచ్‌ ప్రవేశపెట్టిన తర్వాత కూడా దాదాపు రెండు వందల ప్రమాదాలు జరినట్టు తెలుస్తున్నది. ప్రయాణికుల రక్షణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అసలు రైల్వే వ్యవస్థలో ఉన్న ఖాళీలెన్నీ, వాటిని భర్తీ చేసే ఆలోచన కేంద్రానికి ఉందా లేదా? ప్రజల రక్షణకు బదులు ఆధునికమైన నవీకరణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ గొప్పకు పోతున్నారే తప్ప, మౌలిక సదుపాయాల కల్పన పట్ల చిత్తశుద్ధి లేదే! కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ నివేదిక కూడా ముఖ్యంగా సిగల్‌ వైఫల్యాల, పట్టాల పగుళ్లు కొనసాగడం గురించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రైల్వే వ్యవస్థలో 50వేల ఖాళీ పోస్టులు ఉన్నట్టు, వాటిని భర్తీచేయకపోగా ఉన్నవారిపై పనిభారం పెరిగి, మానసిక ఒత్తిడితో కొన్ని మానవ తప్పిదాలు జరుగుతున్నట్టు కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇప్పటికైనా రైల్వేలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ తోపాటు కవాచ్‌ వంటి సాంకేతిక రక్షణ భద్రత అమర్చడం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. పేరు ప్రఖ్యాతులకు పోయి, అత్యంత విలాసవంతమైన సౌకర్యాల కోసం, వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు చెప్పే పాలకులు అవి ఎవరికి ఉపయోగం? ధనవంతులకా, సామాన్యులకా? ముందు సామా న్యులు ప్రయాణించే ఫ్యాసింజర్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచాలి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఛార్జీలు తగ్గించాలి.

– డి.రాంచందర్‌ రావు, 9849592958