తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి ప్రారంభమైంది. పది మాసాల్లోనే ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. వాగ్దానాలు చేసినంత వేగం అమలులో లేదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మరేదీ అంత సంతృప్తికరంగా అమలు కాలేదు. ఇతర వాగ్దానాల ఊసు లేదు. ఆగస్టు 15కల్లా రుణమాఫీ చేసి తీరుతామని ప్రతి జిల్లాలో ప్రమాణం చేసిన పాలకులు నేటికీ పూర్తిగా అమలు చేయలేదు. రైతు భరోసా అడ్రస్ లేదు. ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్ సిబ్బంది పోరుబాట పట్టక తప్పలేదు. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా వేలాది గురుకుల విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వోద్యోగులూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి నోరు విప్పకపోవటం ఆశ్చర్యకరం. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంకోవైపు ఈటెల రాజేందర్, బండి సంజరుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తలు నిండిపోతున్నాయి. కానీ వీరెవరూ పై సమస్యల గురించి మాట్లాడటం లేదు. మూసీ పునరుజ్జీవం, ‘హైడ్రా’ తప్ప ఇతర సమస్యలేవీ వీరికి కనిపించవు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అడుగు జారిన బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకునేందుకు తిప్పలు పడుతోంది. బీజేపీ మాత్రం ఇల్లు తగలబడుతుంటే బొగ్గులేరుకుంటున్నట్టు వ్యవహరిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్న ప్రజల దృష్టిని మత విద్వేషాల వైపు మరల్చే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో పాగా వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాత్రం పరస్పరం కాలుదువ్వుకోవడమే తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతపరమైన విద్వేషాలు సృష్టించే బీజేపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా స్పందించటం లేదు. రాష్ట్రంలో ఏ మేరకు బీజేపీ బలపడ్డా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకత్వాల అవకాశవాదమే కారణమవుతుంది. వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టవలసిన శ్రామికులు మాత్రం మతపరమైన చిచ్చుబెట్టే ప్రయత్నాలను ఎదుర్కోవాలి. తమ మధ్య అనైక్యత సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలి.
ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్ 1 అభ్యర్ధులు జీవో నెం.29కి వ్యతిరేకంగా రాత్రీపగలూ రోడ్డున పడవలసి వచ్చింది. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన గందరగోళం ఫలితమిది. కోటిమంది కార్మికులకు సంబంధిం చిన కనీస వేతనాల సమస్యను పరిష్కరించకపోగా ఇరవై ఏండ్ల నాటి వేతనాలనే ఇప్పుడు కనీస వేతనాలుగా ముసాయిదా ప్రకటించడం యజమానుల కొమ్ముగాయటమే. 20 జిల్లాలు, 69 కేంద్రాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదల పట్టాల సమస్యను పట్టించుకోలేదు. గుడిసెవాసుల మీద కేసులైనా రద్దుచేయకపోగా వీరు కూడా మరింత కఠినమైన కేసులు పెట్టారు. ధరణి లోపాలను సవరించడం పక్కనపెట్టి భూమాత గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం పిఆర్‌సి విడుదల చేసినప్పుడల్లా రాష్ట్రంలో ప్రయివేటు ఇంజనీరింగ్ స్టాఫ్‌కు కూడా వర్తించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు అది అమలు జరగటం లేదు. ప్రభుత్వ పథకాలను పార్టీ సొత్తులాగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిష్పాక్షికంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు తమ పార్టీ అనుయాయులతోనే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను నియమిస్తున్నారు. దీనివల్ల అర్హులకు కాకుండా తమ అనుయాయులకు కేటాయింపులు చేసే ప్రమాదం ఉంది. పాత్రికేయులకు ఇండ్ల స్థలాల సమస్య దశాబ్దాలుగా పరిష్కా రం కాలేదు. కొత్త ప్రభుత్వం రాగానే ఒక సొసైటీలో ఉన్న పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ప్రకటించింది. మంచిదే. కానీ ఇంకా ఇతర సొసైటీలు కూడా ఉన్నాయి. సీనియర్లను విస్మ రించిందన్న అపవాదును మూటగట్టుకుంటున్నది.
మూసీ ప్రక్షాళన, పరిరక్షణ, పర్యావరణం, సాగు నీరు, తాగునీటి సమస్యలను పక్కనబెట్టి మూసీ పునరు జ్జీవం, పర్యాటక కేంద్రం పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చుతున్నారు. బడాబాబుల వ్యాపారాల కోసం పన్నెండు వేల కుటుంబాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కన్నా రియలెస్టేట్ ప్రాజెక్టులే పాలకులకు ముఖ్యమవుతున్నాయి. పర్సెంటేజీలు కాజేయడానికి గత పాలకులకు కాళేశ్వరం ఉపయోగపడ్డట్టే నేటి పాలకులకు మూసీ ప్రాజెక్టు పాడిఆవు కానున్నదన్న చర్చ కూడా మొదలైంది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో చెరువులు, కుంటల పరిరక్షణ పేరుతో కట్టడాలను కూల్చుతున్నారు. దీనికోసం హైడ్రా పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటలను ఆక్రమించి వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పిన బడాబాబుల భవనాలను కూల్చటం తప్పుకాదు. మెల్లగా పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూల్చేవైపు అడుగులు వేస్తున్నారు. అమీన్‌పూర్‌లోనూ, కూకట్‌పల్లిలోనూ జరిగింది ఇదే. మధ్యతరగతి కాలనీలు, అపార్టుమెంట్లలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు చెరువులు, కుంటల కింద వ్యవసాయం జరిగింది. ఇప్పుడు హైద్రాబాద్ నగర విస్తరణతో వ్యవసాయం లేదు. మారిన పరిస్థితుల్లో ఈ చెరువులు, కుంటల పరిధిని ఎంతవరకు కాపాడాలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. అందుకవసరమైన సర్వే నిర్వహించలేదు. అనేక ఏండ్లుగా ఈ స్థలాలను రియలెస్టేట్ కబ్జాదారులు ఆక్రమిస్తుంటే పాలకులు కండ్లు మూసుకున్నారు. భవనాల నిర్మాణానికి అధికారులు అమ్యామ్యాలతో అనుమతులిచ్చారు. కొనుగోలు చేసిన మధ్యతరగతి లక్షల రూపాయలు ఇ.ఎమ్.ఐల రూపంలో బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి హైడ్రా పేరుతో వీరి భవనాలను కూల్చితే బజారున పడేయటమే కదా! పాలకుల వైఫల్యాలకు, అవినీతి చర్యలకు ప్రజలు బలి కావాలా? కనీసం ఇలాంటి స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఉన్నతాధికారుల మీద మాత్రం చర్యల్లేవు. పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న తర్వాతనే అనుమతులున్న భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. హైడ్రా స్ఫూర్తితోనేమో, మహబూబ్‌నగర్‌లో రెవిన్యూ అధికారులు పన్నెండేండ్ల కింద ప్రభుత్వమే కేటాయించిన వికలాంగుల ఇండ్లు కూల్చి జబ్బలు చరుచుకున్నారు. గత బీఆర్‌ఎస్ పాలకులు చెరువులు, కుంటల్లో ఉన్న భవనాలను కూల్చుతామని బెదిరించి తెరవెనుక లావాదేవీలు నడిపారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు కూడా హైడ్రా పేరుతో చేస్తున్న హడావుడి అంతా తెరవెనుక చెల్లింపుల కోసమేనని చర్చ జరుగుతున్నది.
తెలంగాణకు మణిహారం సింగరేణి బొగ్గుగనులు. బొగ్గు బ్లాకుల వేలంపాటకు కేంద్ర బీజేపీ సర్కారు నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయిచేయీ కలిపి సహకరిస్తున్నది. వికారాబాద్‌లో రాడార్ ఏర్పాటుకు కేంద్రంతో భుజం కలిపింది. కనీసం ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను కూడా మరిచింది. హైద్రాబాద్ మహానగరంలో స్కిల్ యూనివర్సిటీ ప్రారంబి óస్తున్నట్టు గొప్పగా చెపుతున్నది. రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్న అదానీ ఈ స్కిల్ యూని వర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటిం చారు. ‘ఊరక రారు మహాను భావులు’ అని నానుడి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలన్నీ స్కిల్ యూనివర్సిటీలుగా మార్చాలి కదా! వాటిల్లో తగిన సిబ్బంది, సౌకర్యాలు లేక మూలుగుతున్నాయి. అవన్నీ వదిలి కొత్తగా స్కిల్ యూనివర్సిటీ ప్రకటించారు. అదనంగా మరో యూనివర్సిటీ వస్తే అభ్యంతరమేమీ లేదు. అదొక్కటే స్కిల్ యూనివర్సిటీ కావడమే అభ్యంతరం. అంతేకాదు, అది కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయించిన నూతన విద్యావిధానానికి మారుపేరు కావడమే అసలు సిసలైన వాస్తవం. మండల కేంద్రాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు ముఖ్యమంత్రి. ఉన్న పాఠశాలల్లో తగిన సిబ్బంది, సౌకర్యాలు కల్పిస్తే ప్రతి పాఠశాల ఒక నాణ్యమైన విద్యాసంస్థగా వృద్ధి చెందుతాయి. ఆ విషయం పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం పట్ల మోజు ఎందుకు? అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధరలు తగ్గినా, మోడీ ప్రభుత్వం ధరల భారం మోపింది. అయినా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రశ్నించవు. రాష్ట్రానికి కేటాయింపులు తగ్గినా, విభజన హామీలు అమలు జరగకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ‘కేంద్రంతో సహకారం’ అనే పల్లవి ఎత్తుకున్నది. సహకారం అంటే కేంద్రానికి రాష్ట్రాలదే కాదు, రాష్ట్రాలకు కేంద్రం సహకారం కూడా. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవలసిన బాధ్యత. కేంద్రం పెత్తనంలో సహకారం వెతకడం ‘నేతి బీరకాయలో నెయ్యి వెతకడం’ లాంటిదే. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేసే విషయంలో బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ చేసింది కూడా అదే. అందుకే ఇప్పుడు కేంద్రంతో పోరాడటంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అశక్తురాలయింది. లౌకిక విలువల విషయంలో మాత్రమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు బీజేపీతో విభేదిస్తున్నాయి. అదే సమయంలో, అదే మోతాదులో అవకాశవాదం కూడా ప్రదర్శిస్తున్నాయి. అందుకే సెప్టెంబర్ 17, తెలంగాణ విలీన సందర్భాన్ని బీజేపీ వక్రీకరించినా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకత్వాలు మెతకగా వ్యవహరించాయి. వామపక్షాలు మాత్రమే వాస్తవాలు చెప్పాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలే తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలన్న స్పృహ లేదు. లౌకిక భావాలను పాదుకొల్పి ప్రజలను ఐక్యంగా నడపాలన్న సోయి లేదు. బీజేపీ కుయుక్తులను ప్రశ్నించే తీరిక లేదు వీరికి. బహుశా కేంద్రాన్నీ, బీజేపీని ప్రశ్నిస్తే ఈడీ దాడులు జరుగుతాయని భయపడుతున్నారేమో!
రేపోమాపో విద్యుత్తు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుదలకు రంగం సిద్ధమవుతున్నది. ప్రజల మీద భారాలు మరింత పెరగనున్నాయి. మరోవైపు ప్రజల అసంతృప్తిని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి బీజేపీ నాయ కత్వం సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే బక్రీద్ సందర్భంగా మెదక్ పట్టణంలో బీజేపీ-బజరంగదళ్ నేతల ప్రత్యక్ష నాయకత్వంలో మైనారిటీల ఆస్తులు ధ్వంసం చేశారు. మరో నాలుగు జిల్లాలో ఇలాంటి ఘటనలే జరిగాయి. సమ్మక్క, సారక్క జాతరలో ఎప్పుడూ లేని విధంగా హలాల్ చేసిన మాంసం అనే పేరుతో వివాదం సృష్టించారు. జైనూరులో ఆటో డ్రైవర్ ఒక మహిళ మీద చేసిన లైంగిక దాడిని మత ఘర్షణగా మార్చారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఉట్నూరులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణను కూడా మతాల మధ్య ఘర్షణలుగా చిత్రీకరించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
మరోవైపు మైనారిటీలలో కొందరు మతోన్మాదులు కూడా వీరికి తోడ్పడుతున్నారు. హైద్రాబాద్ ఉప్పుగూడలో దుర్గాభవాని ఆలయం మీద దాడిగానీ, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం చోరీ గానీ ఇలాంటివే. మతోన్మాదానికి హిందువులా, ముస్లింలా అన్న తేడా లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం సాధారణ ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడమే వీరి ధ్యేయం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్ లాంటి సంస్థలు ఒక పథకం ప్రకారం ప్రజల మధ్య మతపరమైన విభజన సృష్టిస్తున్నాయి. శ్రామికులను చీల్చుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటానికి ఇలాంటి మతపరమైన చిచ్చు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. శ్రామిక ప్రజలు ఇలాంటి ప్రయత్నాలను సమైక్యంగా తిప్పికొట్టాలి. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి.
ఎస్.వీరయ్య