మోడీ ‘మంత్రోపాసన’

Sampadakiyamఇన్నాళ్లూ డిజిటల్‌ ఇండియా అంటూ జపం చేసిన ఇదే ప్రధాని నేడు ‘మన్‌కీ బాత్‌’లో డిజిటల్‌ మోసాల గురించి మాట్లాడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రధానమంత్రి చాప కింద నీరులా సమాజాన్ని కబళిస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం సంతోషమే. అయినా, వాటిని అరికట్టడానికి తమ సర్కార్‌ ప్రణాళికలను గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కేవలం కంటి తుడుపు చర్యగా రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు ఈ బెడద నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ‘క్షణమాగండి. ఆలోచించండి. ఆ తర్వాతే స్పందించండి’.. అనే మంత్రోపదేశమొకటి చేశారు. నేటి డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎంతో పురోగతిని చూస్తున్నాం. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్ల వ్యూహాలూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో మోసాలకు తెగబడుతున్నారు. పెరిగిపోతున్న ఈ డిజిటల్‌ మోసాలపై స్వయంగా ప్రధానమంత్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ‘మన్‌కీ బాత్‌’లో సైబర్‌ నేరాల తీవ్రత గురించి ప్రస్తావించారు. వాటిపై ఆందోళన వద్దని, అప్రమత్తతతో ఉంటే చాలని ముక్తాయించారు. అదే సందర్భంలో ప్రధానిగా తమ ప్రభుత్వం ఇలాంటి నేరాల కట్టడికి ఎలాంటి చట్టాలు చేయనుందో ఆయన చెప్పలేదు.
నేడు దాదాపు అన్నిరకాల విక్రయ కేంద్రాల్లో, మారుమూల పల్లెల్లో సైతం క్యూఆర్‌ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. సరికొత్తగా భారత్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌ల శీఘ్రతర చెల్లింపు వ్యవస్థల అనుసంధాన ప్రతిపాదనను ఆర్‌బీఐ వెల్లడించింది. ఇదంతా నాణానికి ఒకవైపు. రెండో పార్శ్వం ఆందోళనకర స్థితిగతుల్ని కళ్లకు కడుతోంది. కేంద్రహోం మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ లెక్కప్రకారం, గత ఐదేండ్లలలో నమోదైన దగాకోరు బాగోతాలు ఎకాయెకీ 5లక్షల పైనే. దేశంలో సగటున రోజుకు ఆరువేలకుపైగా సైబర్‌ నేరాలపై ఫిర్యాదులు అందుతున్నాయంటున్న ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌) ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 7.4లక్షల కేసులు నమోదైనట్టు ధ్రువీకరిస్తోంది. దేశంలో చోటుచేసు కొంటున్న డిజిటల్‌ అరెస్టులు, ట్రేడింగ్‌, రొమాన్స్‌ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాల్లో దాదాపు 46 శాతం మూడు దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ నాలుగు నెలల్లోనే సైబర్‌ నేరగాళ్లు రూ.1770కోట్ల దాకా కొల్లగొట్టారు. షేర్‌ ట్రేడింగ్‌లో విపరీత లాభాలోస్తాయంటూ 23 రాష్ట్రాల్లో 168మందికి రూ.22కోట్లకుపైగా టోపీ పెట్టిన గాజియాబాద్‌ గ్యాంగ్‌ చేతివాటం తాజాగా బట్టబయలైంది. జార్ఖండ్‌, రాజస్థాన్‌, హర్యానా, యూపీలలో తిష్టవేసిన సైబర్‌ ముఠాలే 80శాతం నేరాలకు పాల్పడుతున్నట్టు ఐఐటీ కాన్పుర్‌ అధ్యయనం ఇటీవలే నిగ్గుతేల్చింది. రోజూ వేలల్లో ఫిర్యాదులు వస్తున్నా విచారణరేటు స్వల్పంగానే ఉందన్న జాతీయ సైబర్‌ భద్రతా సమన్వయకర్త, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డాక్టర్‌ రాజేశ్‌ పంత్‌ వ్యాఖ్యలు సైబర్‌ ముష్కరుల కట్టడిలో వ్యవస్థాగత వైఫల్యాన్నే ఎత్తిచూపుతున్నాయి.
దేశంలో వచ్చే ఏడాదికి అంతర్జాల వినియోగదారులు 90కోట్లకు చేరనుండగా ఇప్పటికే మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 116కోట్లకు పైబడింది. వినియోగ విస్ఫోటానికి దీటుగా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకవపోవడంతో తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. వాటిల్లో పొరుగునున్న మయన్మార్‌, లావోస్‌, కంబోడియా కేంద్రంగా ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖే వెల్లడించింది. డిజిటల్‌ భద్రత బీటలు వారకుండా ఎటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలో, ఆన్‌లైన్‌ మోసానికి గురైతే తక్షణం ఎవరిని ఎలా ఆశ్రయించాలో పౌరులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
నేరగాళ్లు ఎక్కడున్నా సాంకేతిక నిఘా, ఉమ్మడి కార్యాచరణతో ఆన్‌లైన్‌ నేరగాళ్లకు ఉచ్చు బిగించడం ఎలాగన్న దానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ఇటీవల 61 దేశాలకు చెందిన పోలీస్‌ దళాలు ‘ఆపరేషన్‌ ఫస్ట్‌ లైట్‌ 2024’ పేరిట చేపట్టిన ఏకోన్ముఖ దాడిలో నాలుగు వేలమంది వరకు మోసగాళ్లు పట్టుబడ్డారు. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటి దేశాలు సైబర్‌ భద్రతకై ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటుచేశాయి. ఆయా దేశాల అనుభవాల నుంచి సైబరాసురుల పీచమణచే వ్యూహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదునుపెట్టాలి. సైబర్‌ నేరగాళ్లపై ప్రభుత్వాలు కలిసికట్టుగా ఉక్కుపాదం మోపితేనే, దేశంలో డిజిటల్‌ చెల్లింపులు సురక్షితమవుతాయి. అంతే కానీ, ప్రధాని చెప్పినట్టు ‘ఆగి…ఆలోచించి… ఆ తర్వాత నిర్ణయించండి..’ అనే ”మంత్రోపాసన” వల్ల పెద్డగా ఒరిగేదేమీ ఉండదు.