సాఫీగా సాగాలంటే…

Smooth-goingఇటీవల స్టార్టప్‌లు, వ్యాపారాలు చేసేందుకు యువతులు, మహిళలు ముందుకొస్తున్నారు. పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేస్తున్నారు. వీరిలో ఎంతో మంది వివిధ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యాపారవేత్తలుగా విజయం సాధిస్తున్నారు. అయితే ఈ వ్యాపార ప్రయాణంలో ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరకుండా సాఫీగా ముందుకు సాగాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం…
వ్యాపారం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. ఎప్పుడు లాభాలొస్తాయో, ఏ క్షణం నష్టాలు ముంచేస్తాయో చెప్పలేం. దీనికి తోడు మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. అయితే ఇలాంటి సవాళ్లతో కూడిన ప్రయాణంలో ఎంత ప్రణాళికతో వ్యవహరించినా ఒత్తిడి, ఆందోళనలు దరిచేరడం సహజం. నిజానికి ఇలాంటి మానసిక సమస్యల్ని అధిగమించినప్పుడే అటు వ్యాపారంలో, ఇటు జీవితంలోనూ రాణించగలం అంటున్నారు నిపుణులు.
ఆఫీసుకే అతుక్కుపోవద్దు
అనేక సందర్భాల్లో చాలా మంది ‘పనిలో పడితే సమయమే తెలియదు’ అంటుంటారు. వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించిన వారు కూడా ఎక్కువ సమయాన్ని ఆఫీసులోనే గడిపేస్తుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫైళ్లు పట్టుకొని కుస్తీ పడుతుంటారు. అయితే దీనివల్ల కూడా మానసిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ‘ఆఫీసు పనులకు, కుటుంబానికి సమప్రాధాన్యం ఇవ్వడం వల్లే ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాం. లాభాలు ఆర్జించగలుగుతున్నాం’ అని కొంత మంది ప్రముఖులు కూడా చెబుతుంటారు. కాబట్టి పని రాక్షసుల్లా ఎప్పుడూ ఆఫీసుకే అతుక్కుపోకుండా ఇంటికీ కొంత సమయం వెచ్చించండి. భాగస్వామితో, పిల్లలతో కాసేపు గడపండి. దీనివల్ల మీరు ఎంత బిజీగా ఉన్నా వారికీ మిమ్మల్ని మిస్సయ్యామన్న భావన ఉండదు. అలాగే మీకూ మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. ఒక సారి ప్రయత్నించి చూడండి.
అధ్యయనం చేయాల్సిందే
ఆఫీసు, వ్యాపార పనుల్లో పడిపోయి చాలా మంది చాలా విషయాలని నిర్లక్ష్యం చేస్తుంటారు. పఠనం కూడా అందులో ఒకటి. కానీ వ్యాపారాల్లో రాణించాలన్నా, ఒత్తిళ్లు దరిచేరకుండా ఉండాలన్నా దీన్ని అలవాటుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుస్తకాలు, వార్తా పత్రికలు, మ్యాగజైన్లు వంటివి తరచూ ఫాలో అవడం వల్ల కొత్త ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. దాన్ని బట్టి మన వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటూ, సృజనాత్మక ఆలోచనల్ని జోడిస్తూ, వినియోగదారుల్ని ఆకర్షించవచ్చు. మనసుకు ఇంకా ప్రేరణ కావాలనిపిస్తే గొప్ప వ్యక్తుల స్ఫూర్తిదాయక కథల్ని, వారు అనుసరించే మార్గాల్ని మన వ్యాపారాలకు సోపానులుగా మలచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో మన పోటీదారుల కంటే ఓ మెట్టు పైనే ఉండచ్చు.
పైన చెప్పిన సూచనలతో పాటు రోజూ ఉదయాన్నే 45 నిమిషాలు వ్యాయామం చేయడం వంటివీ సత్పలితాలను అందిస్తాయి. అలాగే తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదైతే మనల్ని రోజూ ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
ప్లానింగ్‌ అవసరం
పనువు వాయిదా వేయడం చాలా మందికి ఓ అలవాటుగా ఉంటుంది. సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఒక వేళ ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఉదయాన్నే ప్లాన్‌ చేసుకున్నా కొంతమంది వాటిని పూర్తి చేయలేకపోతారు. అసాధ్యమైన పనుల్ని నిర్దేశించుకొని ఒత్తిళ్లకు గురవుతుంటారు. అయితే తమ విధులను సమర్ధంగా నిర్వహించేవారు ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించడానికి మరుసటి రోజు పనికి తగ్గ ప్రణాళికను ముందు రోజే సిద్ధం చేసుకుంటారని చెబుతున్నారు నిపుణులు. దాన్ని బట్టి ఆ రోజు ప్రాధాన్యమున్న పనుల్లో, ఆలోచనల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఫలితంగా సకాలంలో పనులు పూర్తవుతాయి. మానసికంగానూ ప్రశాంతంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా.