తేనె పూసిన విధానాలతో కేంద్ర ప్రభుత్వం భారత ఉపాధి ఆశవాహుల గొంతుకోసే ప్రయత్నాలకు అధికారికంగా శంకుస్థాపన చేసింది. పాపం నిరుద్యోగులు!! ఆశనిపాతంగా పరిణమించనున్న అప్రెంటీస్‌షిప్ విధానాన్ని పసిగట్టలేనంతగా కేంద్రం తన పాచికను విసిరింది. ఇది కార్పోరేట్ కంపెనీల దోపిడీకి అధికారిక రహదారి. అప్రెంటీస్‌షిప్ విధానాల ద్వారా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ద్వారా జరుగుతున్న ప్రయత్నాలు విషపూరిత ఫలితాలను ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటీస్‌షిప్ ప్రతిపాదనలపై కనీసం మాట వరుసకైనా కేంద్ర కార్మిక సంఘాలతో చర్చించకపోవడం సంఘాలపై కేంద్రానికున్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. అప్రెంటీస్‌షిప్ నియామకాలపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేయడం, అనేక కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అవకాశవాదానికి పాల్పడటం చకచకా జరిగిపోతున్నాయి. ఈ అప్రెంటీస్‌షిప్ విధానం కొనసాగితే ఎగువ మధ్య తరగతి మధ్య తరగతిగా, మధ్య తరగతి పేదలుగా క్షీణించిపోయే ప్రమాదమున్నది.
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం జూలై 22న ప్రస్తుత ఆర్థిక ఏడాది పూర్తి కాలపు బడ్జెట్‌కు ముందస్తుగా అందించే ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించింది. ఆ సందర్భంగా భారతదేశంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణాలు రెండు అని పేర్కొన్నది. అందులో ఒకటి, భారత యువత నైపుణ్యలేమితో బాధపడుతున్నదని; రెండవది పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలిపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎదుర్కోవడానికి, నైపుణ్యలేమిని కూడా అధిగమించడానికి స్కిల్‌ఇండియా పేరు మీద యువకులలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని, దానికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది. జూలై 23వ తారీఖున ప్రవేశపెట్టిన పూర్తి సమగ్ర బడ్జెట్‌లో ఈ నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి ఏమంటే, నైపుణ్యాభివృద్ధి కోసం గుర్తించబడినటువంటి 500 కంపెనీలలో ట్రెయినింగ్ ఇచ్చి, ఆ తర్వాత నియామకాలు చేపట్టాలని. అంతేకాకుండా కంపెనీలు కొత్త నియామకాలు చేపడితే కేంద్రం ప్రోత్సాహకంగా ప్రతినెలా రూ.3వేలు ప్రతి ఉద్యోగికి అలా 24 నెలల పాటు చెల్లిస్తుంది. ఇలా చెల్లించడానికి కొలమానంగా పీఎఫ్ అకౌంట్‌లో నమోదు కాబడినటువంటి పేర్లను ఆధారం చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా ఆహ్వానించదగిన ప్రతిపాదనలే. గతేడాది పారిశ్రామికవేత్తలంతా కలిసి ఈ దేశంలో నిరుద్యోగానికి కారణం యువతలో కొరబడినటువంటి నైపుణ్య మని కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు చెప్పిందేమంటే ”దేశంలోని 14 నుండి 18 ఏండ్ల వయసు కలిగిన విద్యార్థులలో 42 శాతం మంది కనీసం రెండో తరగతికి సంబంధించిన సాధారణ లెక్కలు కూడా చేసే స్థితిలో లేరు” అని. ఇది భారత విద్యా విధానంలోని లోపాల్ని స్పష్టం చేసింది. విద్యా విధానాల్లో జరగవలసినటువంటి మార్పులకు ఇవి హెచ్చరికగా కూడా గుర్తుచేసింది.
ఇక పర్మినెంట్ ఉద్యోగాలు లేనట్టే!
పై విషయాల్ని మనం గమనించి అర్థం చేసుకున్నది ఏమిటంటే? నిరుద్యోగం హెచ్చుస్థాయిలో ఉన్నది. అదే సందర్భంలో నైపుణ్య యువకుల కొరత కూడా ఉన్నది. ఈ రెండింటిని తదనిగుణంగా (సైమల్టేనియస్)గా మనం పరిష్కరించాలి. అయితే రోగనిర్దారణ సరిగ్గా చేసినటువంటి కేంద్రం పరిష్కారాన్ని మాత్రం తిరోగమన ఫలితం ఇచ్చేలా చూపిస్తున్నది. నైపుణ్యాభివృద్ధి జరిగిన తర్వాత ఉద్యోగాల కల్పన చేయాలన్న ఆలోచన నుంచి పుట్టినదే అప్రెంటీస్‌షిప్. దీని ద్వారా కంపెనీలు నిరుద్యోగులను చేర్చుకోవాలనే ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు అంకురార్పణ చేసి కేంద్రం సరాసరి కంపెనీలను ఆదేశించడంతో ఇప్పుడు కంపెనీలన్నీ ఉద్యోగాల కల్పన పక్కన పెట్టేసి అప్రెంటీస్‌షిప్ పేరుపైన నిరుద్యోగులను ఏడాది కాలానికి కేవలం రూ.11,500తో నియమించుకుంటున్నాయి. దీని ద్వారా ఏడాది కాలం పాటు ఆ నిరుద్యోగి గొడ్డుచాకిరి చేసి ఆ తర్వాత తిరిగి ఇంటికెళ్లాల్సిందే. మళ్లీ సదరు అప్రెంటీస్‌షిప్ వాళ్లని కొనసాగిస్తారా, కొనసాగించరా? ఇలాంటి వివరాలు లేవు. గత రెండేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ అనే మిలిటరీ నియామకాల పథకానికన్నా ఇది అత్యంత దుర్మార్గమైనది. పర్మినెంట్ ఉద్యోగాల కల్పనకు చరమగీతం పాడి కేవలం అప్రెంటీస్‌షిప్‌ల ద్వారా అత్యధిక పనిని పూర్తి చేయించుకోవాలని ప్రయివేటురంగ పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశాన్ని కూడా ఇస్తోంది.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కన్నా ప్రమాదం
అప్రెంటీస్‌షిప్ చట్టం 1961ను ఉటంకిస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే సరాసరి కంపెనీలకు అవకాశం కల్పించడంతో కంపెనీలన్ని ఎగిరి గంతేసి వేలమందిని అప్రెంటీస్‌షిప్‌లుగా నియమించుకోవడానికి సిద్ధమయ్యారు. సదరు చట్టం ప్రకారం అప్రెంటీస్‌షిప్‌లందరికి పర్మినెంట్ ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపాదించిన ఈ అప్రెంటీస్‌షిప్‌నియామకాలలో అలాంటి వెసులుబాటు గాని లేదా నిర్బంధంగాని ఎక్కడ పేర్కొనలేదు. ఈ ఏడాది అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ 13 వరకు గడువు విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దాదాపు 300కు పైగా కంపెనీలు వేల మందిని అప్రెంటీస్‌షిప్‌లుగా చేర్చుకోవడానికి ఆహ్వానాలు పలికాయి. ఈ అప్రెంటిసులకు ఇచ్చే ట్రైనింగు కన్నా వారి ద్వారా పూర్తి చేయించుకనే పని కచ్చితంగా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాల కన్నా అప్రెంటీస్‌షిప్ విధానం అత్యంత ప్రమాదకరమైనదే కాదు నష్టదాయకమైనది కూడా. ప్రభుత్వరంగ బ్యాంకు కెనరా బ్యాంకు 3వేల మందిని అప్రెంటీస్‌షిప్‌లుగా తీసుకోవడానికి జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేసింది. వారికి నెలకు రూ.15వేల పారితోషికాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం నుండి నెలకు 4500 నేరుగా అప్రెంటిస్ ఖాతాకి జమ అవగా, మిగతా 10,500 బ్యాంకు చెల్లిస్తుంది.
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమేనా?
ఒక ప్రభుత్వరంగ బ్యాంకు ఇలా నిరుద్యోగులను వినియోగించుకుంటే ఇక ప్రయివేటు వారి సంగతేంటి? సాధారణంగా అప్రెంటీస్‌షిప్ సేవారంగాల్లో దాదాపు శూన్యమనే చెప్పాలి. ఇవన్నీ పారిశ్రామిక రంగం, నిర్మాణాల కేంద్రాల్లో జరుగుతుంటాయి. అలా కాకుండా నిరుద్యోగులకు ఉపాధి పేరున అప్రెంటీస్‌షిప్ అవకాశాలను అంటగట్టడ మంటే వారి ఎదుగుదలను ట్రైనింగుతో సరిపెట్టినట్టే! గుర్తించబడిన టాప్ 500 కంపెనీలు అప్రెంటిషన్లకు 11,500 చెల్లించే విధంగా విధానాలు రూపొందించారు. వీరందరూ ప్రస్తుతం కేంద్ర పెద్దలను సంతృప్తి పరిచే ఆ పనిలో నిమగమయ్యారు. అయితే ఈ కంపెనీలు అప్రెంటీస్‌షిప్ విధానాన్ని అమలు పరిచేందుకు కేంద్రం మరో బొనాంజా కూడా ప్రకటించింది. ప్రతి కంపెనీ కూడా కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్) కింద సాలీనా తమ లాభాలలో రెండు శాతం సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వైద్య విద్యాలయాలు, స్వచ్చంద సేవా సంస్థల్లో అలాంటి కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. అప్రెంటీస్‌షిప్‌లను నియమించుకునే కంపెనీలు ఈ నిబంధనను పాటించనక్కర్లేదని కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. నామమాత్రంగానైనా కడుపేదలకందే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానంలో కనీసం స్థిరమైన ఉపాధి అయినా కనిపించేది. అయితే ఇందులో సెమిస్కిల్డ్ ఉపాధిలో నియమితులైన వ్యక్తులు జీవితాంతం అదే పనిలో ప్రమోషన్లు కూడా లేకుండా మగ్గిపోవడం విచారకరం. అయితే ఈ అప్రెంటీస్‌షిప్ విధానంలో అది కూడా లేదు. ఇది ఒకరకంగా నిరుద్యోగ, కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారులకు లాభాలు కట్టబెట్టేలా కేంద్రం చేసిన కుట్ర!
జి.తిరుపతయ్య
9951300016