– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆయుష్ డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, వరంగల్‌లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచనున్నట్టు చెప్పారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనం నిర్మిస్తామనీ, వారం రోజుల్లో విద్యార్థుల ఉపకారవేతనాలను చెల్లించనున్నట్టు వెల్లడించారు స్టైఫండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్స్ట్రక్టర్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేసిన మంత్రి, ఇంకా 214 యోగా ఇన్స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తాని చెప్పారు. యోగా, ఆయు ర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదనీ, మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. వీటిని గ్రామాల్లోకి తీసుకెళ్లాలనీ, వీటి ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పించాలనీ, ప్రకతితో మమే కమై జీవించాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చొంగ్తూ మాట్లాడుతూ 421 ఆయుర్వేద మందిరాల్లో యోగా టీచర్లను నియమించినట్టు తెలిపారు.