– గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్న సీఎం
– అందుబాటులో ఉండాలంటూ మంత్రులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘దీపావళి టపాసుల కంటే ముందే రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలబోతున్నాయి…’ అంటూ ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీపావళి కంటే ఒక్క రోజు ముందు (బుధవారం) ఆ బాంబును పేల్చనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మంగళవారం కొనసాగిన పరిణామాలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. పండగను జరుపుకునేందుకు ఖమ్మం వెళ్లిన మంత్రి పొంగులేటిని వెంటనే హైదరాబాద్‌కు రావాలంటూ సీఎం ఆదేశించారు. దీంతో ఆయన మంగళవారం రాత్రికి నగరానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మిగతా మంత్రులు, ఉన్నతాధికారులందరూ అందుబాటులో ఉండాలంటూ సీఎం సూచించారు.
ఇదే సమయంలో నెలరోజులపాటు హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ను విధించారు. రాజధాని నగరంలో ఆ సెక్షన్‌ను ఇన్ని రోజులపాటు విధించిన దాఖలాలు ఇటీవల కాలంలో లేనేలేవు. సీఎం నోటి నుంచి రాజకీయ బాంబులు పేలిన మరుక్షణమే ప్రతిపక్షానికి చెందిన ఓ కీలక నేతను అరెస్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే 144 సెక్షన్‌ను విధించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదేమైనా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన’పై బుధవారం నిర్వహించబోయే సమావేశం రాజకీయ రంగు పులుముకుంటోంది. దాని తర్వాత సీఎం నిర్వహించబోయే మీడియా సమావేశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.