నిజం నిగ్గుతేలేనా ?

Sampadakiyamగోదావరి నదిపై నిర్మించిన 240 టీఎంసీల మెగా సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం డొల్లతనం ఆవిష్కృతమవుతున్నది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కాళేశ్వరం న్యాయ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ ఘోష్‌ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు బయట కొస్తున్నాయి. కమిషన్‌ అధికారులను ప్రశ్నిస్తున్న తీరుతో, ఆశ్చర్యం గొలిపే అనేక కఠినమైన వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. దోషులను నిగ్గు తేల్చే సమయం దగ్గర పడుతున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో కూడిన కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్దది. బడ్జెట్‌లోనూ భారీనే. ప్రాణహిత చేవెళ్లకు పేరు మార్చి, నిధుల అంచనాలు పెంచి ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా నిర్మించిన సంగతి, అఫిడవిట్ల ఆధారంగా జరుగుతున్న కమిషన్‌ విచారణతో కండ్లకు కడుతున్నది.ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు స్థలం మార్పుతో రూ.750 కోట్లు వృధా అయ్యాయి. దీనికి బీఆర్‌ఎస్‌ సర్కారుదే బాధ్యత. గత ప్రభుత్వ ఏలికలో అంతా ఏకపక్షం. అధికా రులు, సాంకేతిక నిపుణులకు విలువ లేదు. వారి సూచనలనూ బేఖాతర్‌ చేశారు. తానే చీఫ్‌ ఇంజినీరునంటూ ప్రభుత్వ పెద్ద చెప్పిందే వేదంగా నిర్మాణం సాగింది. ఏకంగా బడ్జెట్‌ రూ. 80,180 కోట్ల నుంచి రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకించారు. ఇంకా రూ. 40 వేల కోట్లు కావాలట! తక్కువ సమయంలో ప్రాజెక్టును పూర్తిచేసి నదులకే నడక నేర్పారంటూ మాజీ సీఎం కేసీఆర్‌నూ ఆకాశానికేత్తేశాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్పట్లో.
ఇప్పుడు సీన్‌ రివర్స్‌. బ్లాకులు బద్దలై, ఇసుక కదిలిపోయి మొత్తం ప్రాజెక్టుకే ఎసరొచ్చింది. ‘కాగ్‌’ నివేదిక సైతం కాళేశ్వరం సామర్థ్యంపై రెండేండ్ల కిందే అనుమానపడ్డది. ఎన్‌డీఎస్‌ఏతోపాటు విజిలెన్స్‌ శాఖ సైతం కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి, అవకతవకలు జరిగాయని ఇప్పటికే నివేదికలిచ్చాయి. భారీ సొమ్ముతో నిర్మించిన బ్యారేజీల్లో నీటిని నిలువ చేసే పరిస్థితీ లేదు. ఇందులో మోడీ సర్కార్‌ పాపమూ ఉంది. కనీస పరిశీలన లేకుండానే కేంద్ర జల సంఘం డీపీఆర్‌ను ఆమోదించడం, అలాగే వ్యాప్కోస్‌ సంస్థ సైతం గ్రిన్‌సిగల్‌ ఇవ్వడంతో ఆగమేఘాల మీద ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇదిలా వుండగా గత ఐదు నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది. ఇక ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధుల వంతు రానుంది. రామగుండం మాజీ ఈఏన్సీ నల్లా వెంకటేశ్వర్లు స్టేట్‌మెంటు ఇస్తూ డీపీఆర్‌, డిజైన్లు, డ్రాయింగులు, బ్యారేజీల్లో నీరు నింపడం వరకు అన్ని అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయాలేననీ, మొత్తం కాళేశ్వరం ప్రణాళిక ఆయనదని కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌దే పాపమంటూ వేలెత్తి చూపారు. అందుకవసరమైన సాక్ష్యాధారాలు, సమావేశాల మినిట్స్‌, ఇతర ఫైళ్లనూ కమిషన్‌కు అందజేశారు. అంతా తానై వ్యవహరించిన నేపథ్యంలో ప్రాజెక్టు ఆరంభంలో భుజకీర్తులు తగిలించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌, తాజా ఘోర పరిస్థితికి కూడా బాధ్యత వహిస్తారా? ఇది ఇంజినీర్ల పని అంటూ తప్పించుకోజూస్తారా? అనేది మిలియన్‌ డాటర్ల ప్రశ్న.
జస్టిష్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ నివేదిక కోసం తెలంగాణ ప్రజానీకం వేయికండ్లతో ఎదురుచూస్తున్నది. భారీగా అప్పులు చేసి ఈ ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టారు. తీరాచూస్తే పిల్లర్లు కుంగిపోయి, సీపేజీలు ఏర్పడి సాంతం ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకమవుతున్న వేళ, వేల కోట్ల ప్రజాధనం సముద్రం పాలైనట్టే కదా. గత వర్షాకాలపు వరదనీటిని ఈ ప్రాజెక్టులో నిలువచేసే పరిస్థితి లేకే గేట్లు ఎత్తేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు నీరం దించాలని కేసీఆర్‌ సర్కారు భావించింది. అలాగే చేపల వ్యాపారం,జలక్రీడల నిర్వహణతోపాటు పర్యాటకాన్ని అభివృద్దికీ అవకాశాలూ ఉంటాయని ఉబ్బగొట్టింది. ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటీ అని సాధారణంగా జనం అనుకుంటూ ఉంటారు. మేము అలా అనుకుని ప్రాజెక్టు కట్టాం.. ఇలా జరుగుతుందని ఉహించామా ఏంటీ అనే తరహా ప్రచారానికి బీఆర్‌ఎస్‌ ఒడికడితే అంతకంటే మహాపాపం ఏముంటుంది? ఘోష్‌ కమిషన్‌ ఎదుట కుప్పిగంతులు వేసేందుకు ఒకరిద్దరు అధికారులు ప్రయత్నిస్తే ‘ఎవరో చేసిన తప్పులకు మీ భుజాలపై వేసుకోవద్దు’ అని చైర్మెన్‌ బుద్దిచెప్పిన వైనం పత్రికల్లోనే చూశాం. అసలు ప్రాజెక్టు ప్రారంభ ఏడాది 2019 నుంచే సమస్యల్లో ఉందని అధికారులు చెప్పడాన్ని బట్టి చూస్తే కనీస సాంకేతిక ప్రమాణాలను బీఆర్‌ఎస్‌ సర్కారు పట్టించుకోలేదనే నిగూఢ సత్యాన్ని అంగీకరించకతప్పదు. అందుకే అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాలు, ఇతర వివరాలూ ఇవ్వాలని తాజాగా కమిషన్‌ సర్కారును కోరింది. నాసిరకం పనులతో వేల కోట్లు విలువైన ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారు పాలకులైనా, అధికారులైనా కోర్టు బోనులోకి లాగాల్సిందే. నిజాన్ని నిగ్గుతేల్చాల్సిందే. శిక్షపడేలా సర్కారు కఠినంగా వ్యవహరించాల్సిందే.