ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో అమ్మకాల వెల్లువతో బుధవారం నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 80వేల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ఎలాంటి సానుకూలతలు కానరాకపోవడంతో రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 426.85 పాయింట్లు పతనమై 79,942.18కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు.. ఏ దశలోనూ కోలుకోలేదు. దాదాపు 2,787 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 978 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ట్రెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్స్యూమర్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ఇండిస్టీస్, మారుతీ సుజుకీ లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మీడియా రంగాలు వరుసగా 0.5 నుంచి 2 శాతం పెరిగాయి. బ్యాంక్, ఫార్మా, ఐటీ ఒకశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ యథాతథంగా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది.