– ఉపాధ్యాయ కొలువులు సాధించిన నేపథ్యంలో ఘనంగా సన్మానం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్ళపల్లి మండలం నుంచి ఆటంకాలను జయించి, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించిన కొమరం ధనలక్ష్మి, సుతారి విజయ్ లను మండలంలోని ఆదివాసీ యువత ఆదర్శంగా తీసుకోవాలి స్థానిక ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి మండల శాఖ నాయకులు, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు అభిప్రాయపడ్డారు. గురువారం మండలంలోని మర్కోడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2024 డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్, ఎస్.జి.టి పోస్ట్ లు సాధించి, ఇటీవలే నూతన ఉపాధ్యాయులుగా విధుల్లో చేరిన ధనలక్ష్మి, విజయ్ లను స్థానిక ఆదివాసి ఐక్య కార్యచరణ సమితి మండల శాఖ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్య ను అందించడమే కాకుండా వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది పాఠశాల విద్య అని చెప్పారు. ఆధునిక కాలంలో మనిషి మనుగడకు చదువు అనివార్యమని, చదువుకున్న మనిషి తన జీవితంలో పురోగతి సాధిస్తారని తెలిపారు. “మొక్కై వంగనిదే మానై వంగదు” అనే నానుడిని ప్రస్తావించారు.
పిల్లలను చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన, నైతిక విలువలు నేర్పిస్తే.. వారు ఉన్నతమైన మనిషిగా రాణించగలుగుతారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా విద్యనూ చిన్నతనం నుంచే శ్రద్ధగా చదవాలని, దాంతో ఉత్తమ లక్షణాలు అలవడతాయని చెప్పారు. ఏ దేశమైన, రాష్ట్రమైన త్వరగా అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యారంగం సమగ్రా భివృద్ధి సాధించాలని అన్నారు. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక పురోభివృద్ధికి విద్యతో కూడిన మానవ మేధస్సుతోనే సాధ్యమని వివరించారు. ధనలక్ష్మి, విజయ్ లు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కృషి చేయాలని సూచించారు. జీవితంలో సమాజానికి ఉపయోగపడే విధంగా అంకిత భావంతో పనిచేసి వచ్చే ఫలితాలతో ఆనందాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమములో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పాయం రమేష్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మండల అధ్యక్షులు పాయం రామనర్సయ్య, పాయం నరసింహారావు, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ పాయం, వెంకటనారాయణ, న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కొమరం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, ముత్తయ్య, గొగ్గల బాబు, రవీందర్, సన్మాన గ్రహీతల తల్లిదండ్రులు కమరం తిరుపతమ్మ, సుతారి బుచ్చి రాములు, సత్యవతి, గ్రామ పెద్దలు రాంబాబు, రామనాధం, అగ్ని, సుతారి కృష్ణ, గుమ్మడి నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.