ఈ స్థాయి స్పందన ఊహించలేదు

This level of response
Not expectedదుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. షో, షోకి వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి తమ సంతోషాన్ని మీడియాతో షేర్‌ చేసుకున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ”సోషల్‌ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగటివ్‌ కామెంట్‌ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మా సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. బాలకష్ణ 109వ సినిమా టీజర్‌, విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్‌ను వారం రోజుల్లో ఇస్తాం. రాబోయే రోజుల్లో ఒక భారీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేసే ఆలోచన ఉంది. అలాగే మా బ్యానర్‌లో భిన్న సినిమాల నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తున్నాం’ అని తెలిపారు.
‘నిర్మాత నాగవంశీ ఈ సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాకి ఎక్కడైనా నెగటివ్‌ కామెంట్‌ వస్తే అడగండని చెప్పారు. అయితే ఈస్థాయి స్పందన లభిస్తుందని నేను కూడా ఊహించలేదు. ప్రీమియర్‌ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్‌ వచ్చింది. దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడమనేది చాలా అరుదైన విషయం. ఈ సినిమా పట్ల మీడియా మద్దతుకి, ప్రేక్షకుల ఆదరణకి చాలా చాలా థ్యాంక్స్‌. పండగ అయినా కూడా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. మలయాళ ప్రేక్షకులు దీనిని డబ్బింగ్‌ సినిమాలా చూడటంలేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు’ అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు.