భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక విభజన

Growing economic divide in Indiaఈ సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం), ‘రిలేటివ్‌ ఎకనామిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌: 1960-61 టు 2023-24’ శీర్షికతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇది, దేశ ఆదాయంలో ప్రతి రాష్ట్ర వాటాను, అఖిల భారత సగటుతో పోల్చితే తలసరి ఆదాయ వివరాలను తెలియజేస్తుంది.ఈ వివరాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతీ రాష్ట్ర ప్రాముఖ్యతను, అఖిల భారత స్థాయికి సంబంధించి ప్రతి రాష్ట్ర పౌరుల సగటు సంక్షేమాన్ని తెలియజేస్తాయి. ఈ సగటు, అసమా నతల్ని దాస్తుంది. ఉదాహరణకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా సహాయపడే మహారాష్ట్ర, జాతీయ సగటులో 150 శాతం తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. అయితే దానిలో ధనిక ప్రాంతమైన ముంబై, పేదరికం కారణంగా రైతు ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. ముంబైకి చెందిన ధనికులు అత్యధిక మొత్తంలో ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు, ముంబై నగర మున్సిపాలిటీ దేశంలోనే ధనికమైనది. కానీ అక్కడ పౌర జీవనానికి ఇబ్బందికరంగా పెద్దపెద్ద మురికివాడలున్నాయి.
ప్రాంతాల మధ్య అసమానతలు
ఈ నివేదిక, భారతదేశ పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలు స్థిరమైన మెరుగైన పనితీరును, తూర్పు రాష్ట్రాల బలహీనమైన పనితీరును సూచిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో హర్యానా, ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాల పనితీరు బలహీనంగా ఉంది. మొత్తంగా చూస్తే, దేశంలో ఆర్థిక విభజన పెరుగుతుంది, ఇది సమాఖ్య(ఫెడరల్‌) వ్యవస్థ, వైవిధ్యం కలిగిన భారతదేశం లాంటి దేశానికి మంచిది కాదు.ఈ పెరుగుతున్న అంతరం ఫెడరలిజాన్ని (సమాఖ్యావాదం) ప్రశ్నించడానికి దారితీస్తుంది. ఇటీవల కాలంలో ధనిక రాష్ట్రాల ప్రతినిధులు కేరళలో ఒక సమావేశాన్ని నిర్వహించి, కేంద్రం నుండి తమకు న్యాయబద్ధంగా అందాల్సిన వనరులు అందడం లేదని వారన్నారు. కేంద్రం, తమకు తిరిగి ఇచ్చే నిధుల కన్నా తాము కేంద్ర నిధికి సమకూర్చేది ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు. 2000 సంవత్స రంలో కూడా పదకొండవ ఆర్థిక సంఘం చేసిన అధికార మార్పిడికి నిరసనగా ‘విజయవంతమైన రాష్ట్రాల సమావేశం’ ఒకటి జరిగింది. ఆ విధంగా సమాఖ్య స్ఫూర్తి నెమ్మదిగా బలహీనపడుతూ వస్తుంది.
దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా పని చేయడం ప్రారంభిం చడానికి చిహ్నంగా ఈ నివేదిక సరళీకరణ విధానాన్ని (లిబరలై జేషన్‌) చేర్చింది.కానీ ఇది కారణాల వివరాల్లోకి వెళ్లడం లేదు. ఇది ఒడిశా ఉన్న తూర్పు తీర ప్రాంతాలను కూడా మెరుగైన ప్రాంతాలుగానే సూచిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల బలహీనమైన పనితీరు, మరికొన్ని రాష్ట్రాల మెరుగైన పనితీరుతో ముడిపడి ఉంటుందా? పెట్టుబడులే ఉత్పత్తిని నిర్ణయించే ముఖ్యమైన అంశం. పెట్టుబడి స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా అంతే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి, ఇంకా సంపూర్ణ విశ్లేషణ జరగాలంటే, ప్రతి రాష్ట్రంలోని పెట్టుబడి స్థాయి మరియు పెట్టుబడి రేటును అధ్య యనం చేయాల్సిన అవ సరం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సాధించిన రాష్ట్రాల పెట్టుబడుల రేటు, పేద రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటుం ది కాబట్టి ఆ రాష్ట్రాల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
పెట్టుబడులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి వస్తాయి. మొదటిది విధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుండగా, రెండోది లాభాల అంచనాల పై ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలిక లాభాలు సమకూరక పోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక వెనుకబడిన ప్రాంతాన్ని అభివద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ పన్ను మినహాయింపులు, విద్యుత్‌ ధరల్లో రాయితీలు లాంటివి ప్రభుత్వం కల్పించకుంటే ప్రైవేట్‌ రంగం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడదు. ఖచ్చితంగా లాభాలు ఉంటాయనే హామీ గల పెద్ద మార్కెట్లున్న అభివద్ధి చెందిన ప్రాంతాల్లోనే స్వంతంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌ రంగం ముందుకొస్తుంది. కాబట్టి, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాలను పెట్టుబడికి గమ్యస్థానాలుగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఢిల్లీని ఆనుకొని ఉన్న హర్యానా (అత్యంత ఎక్కువ తలసరి ఆదాయంతో) కూడా బాగానే లాభపడింది. ఇతర కారణాలతో కోల్‌కతాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎగుమతుల ద్వారా బయటి మార్కెట్లకు చౌకగా సమీపించే అవకాశాలు ఉండడం వల్ల కోస్తాతీర ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడికి అవసరమయ్యే దిగుమతులు కూడా చాలా చౌకగా అందుబాటులో ఉండవచ్చు.
రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం, నాణ్యమైన పరిపాలన,లాభాల్ని నిర్ణయించే కీలకమైన అంశాలుగా ఉంటాయి. ధనిక రాష్ట్రాలు ఈ రెండు అంశాల్లో మెరుగ్గా ఉంటూ, ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. మెరుగైన పాలన కూడా మెరుగైన, నాణ్యమైన విద్య, ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఇది, మరింత ఉత్పాదకశక్తి అందుబాటులో ఉండేందుకు దారి తీస్తుంది. కానీ, పేద రాష్ట్రాల నుండి ధనిక రాష్ట్రాలకు భారీగా వలసలు ఉంటున్న కారణంగా ఇది కీలకమైన అంశం కాదు. మొత్తం పెట్టుబడిలో, ప్రైవేట్‌ పెట్టుబడి 75 శాతంగా ఉంది. 1991లో నూతన ఆర్థిక విధానాల(ఎన్‌ఈపి) ప్రారంభం తరువాత ప్రముఖ రంగంగా ఉన్న ప్రభుత్వ రంగం పాత్ర మార్కెట్లకు మారింది. కాబట్టి, లాభాలు ఎక్కువగా ఉంటున్న ధనిక రాష్ట్రాలకు ఎక్కువ పెట్టుబడులు తరలిపోతున్నాయి. 1991 తరువాత పెట్టుబడులకు మార్గనిర్దేశం చేసే ఆర్థిక రంగం మరింత ప్రముఖ రంగంగా మారింది. పేద రాష్ట్రాల్లో గహ పొదుపులు గణనీయంగా ఎక్కువ లాభాలు అందించే ధనిక రాష్ట్రాలకు మళ్లిస్తున్నారు. ధనిక రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు పేద రాష్ట్రాల డిపా జిట్లు పరపతి నిష్పత్తి తక్కువగా ఉండటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ పెట్టుబడి మళ్లింపు హెచ్చుతగ్గుల పెరుగుదలకు దారితీస్తుంది.చివరిగా, తక్కువ ఉత్పాదకత, తక్కువ ఆదాయాలు గల అసంఘటిత రంగంలో పనిచేసే పేద రాష్ట్రాలు పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఈ నూతన ఆర్థిక విధానం, సంఘటిత రంగానికి చాలా అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఈ సంఘటిత రంగానికి సరుకు రవాణా కారిడార్లు, హైవే ల నిర్మాణం తోడ్పడింది. కాబట్టి, సంఘటిత రంగం, అసంఘటిత రంగాన్ని దెబ్బతీసి, ధనిక రాష్ట్రాల వేగవంతమైన అభివద్ధికి ఆజ్యం పోసింది.
క్లుప్తంగా చెప్పాలంటే, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పత్రం తెలిపిన విధంగా, ‘ౖసరళీకరణ విధానాల’ ప్రారంభం నుండి రాష్ట్రాల మధ్య విభజన పెరుగుదలలో నూతన ఆర్థిక విధానాలు (ఎన్‌ఈపి) ఒక ప్రధానమైన పాత్రను పోషించాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల సమస్యలు ప్రత్యేకమైన కోవకు చెందినవి. రెండు రాష్ట్రాల్లో కూడా వామపక్ష ఉద్యమాలు, కార్మిక సమరశీలత చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి, ప్రైవేట్‌ రంగం ఈ రాష్ట్రాల్లో చాలా తక్కువగా పెట్టుబడులు పెట్టాయి. వ్యూహాత్మక కారణాలతో భారతదేశ సరిహద్దు రాష్ట్రాలకు చాలా తక్కువ ప్రభుత్వ పెట్టుబడులు అందాయి. ప్రైవేట్‌ రంగాలను భయపెట్టిన తిరుగుబాట్ల వల్ల కూడా పెట్టుబడులు తక్కువగా వచ్చాయి.
ప్రభుత్వ పెట్టుబడితో కేంద్రం రాజకీయాలు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తరచుగా వినిపించే ‘డబుల్‌ ఇంజన్‌కి సర్కార్‌’ అనే నినాదమే దీనికి నిదర్శనం. రాజకీయ సంకేతాలు ముఖ్యమైనవి కాబట్టి భారతదేశంలో పెరుగు తున్న ఆశ్రితవాదం (క్రోనిజం) కూడా పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇది, ఇతరులకు చిక్కులు పెంచే క్రమంలో ఆశ్రితులకు నష్టాలు తగ్గించడం ద్వారా పెట్టుబడి వాతావరణాన్ని చెడగొడుతుంది. ఫలితంగా పేద రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపే మొత్తం పెట్టుబడి రేటులో ఒక క్షీణత ఏర్పడుతుంది.నల్ల ఆర్థిక వ్యవస్థ కూడా పేద రాష్ట్రాల్లో దామాషా ప్రకారం ఎక్కువగానే ఉంది. ఇది, విధాన వైఫల్యం, బలహీన పాలన కారణంగా పెట్టుబడి వాతావరణాన్ని చెడగొట్టి, వారు స్వీకరించే పెట్టుబడిని తగ్గిస్తుంది. కాబట్టి, ఇది వాటి పెరుగుదల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
సమాఖ్య వ్యవస్థకు ముప్పు
వివిధ రాష్ట్రాల ఆర్థిక పనితీరులో కొనసాగుతున్న వ్యత్యాసాలు సమాఖ్య వ్యవస్థకు ముప్పు తెస్తున్నాయి. అందుకే ఈ ధోరణిని తిప్పికొట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యత్యాసాల్ని కొనసాగించడం కూడా సరైనది కాదు. దీనికి వెనుకబడిన రాష్ట్రాల్లో ప్రైవేట్‌ పెట్టుబడుల ధోరణి, బలహీన పరిపాలన, నాసిరకం మౌలిక సౌకర్యాల ధోరణిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
కేంద్రం, రాష్ట్రం రెండూ చర్యలు చేపట్టాలి. రాష్ట్రాలు, వాటి అధికార పరిధిలో పాలనను మెరుగుపరిచి, అవినీతిని అరికట్టాలి. సామాజిక రంగాల్లో ప్రభుత్వ వ్యయాలను గణనీయంగా పెంచాలి. మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో అధికారిక ఆజ్ఞల తో పేద రాష్ట్రాల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు పెంచకూడదు. అసంఘటిత రంగాన్ని దెబ్బతీసి సంఘటిత రంగానికి అనుకూలంగా వ్యవహ రిస్తున్న కేంద్ర వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అసంఘటిత రంగం పై దష్టి సారిస్తే, అట్టడుగు వర్గాల ఆదాయాలు పెరగడం, ఆ పెరుగుదల పేద రాష్ట్రాల్లో డిమాండ్‌, ఉత్పత్తిని పెంచుతుంది. ఈ రాష్ట్రాల్లో డిమాండ్‌ పెరగడం వల్ల, ఆ డిమాండ్‌ ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
డిమాండ్‌ కొరత కారణంగా సంఘటిత రంగానికి కూడా లాభం జరుగుతుంది. వారికి పెట్టుబడిని పెంచుకోడానికి తగినన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వారికి ప్రభుత్వం నుండి మరిన్ని రాయితీల అవసరమేమీ లేదు. అంటే ఈ విధానపరమైన మార్పుల వల్ల, ధనిక రాష్ట్రాలు అభివద్ధి చెందవని కాదు, కేవలం అసమానతలు తగ్గుతాయి. ఇది ఫెడరలిజంను బలోపేతం చేసే, దేశ ఐక్యతను కాపాడేందుకు సహాయపడే అభివద్ధి అవుతుంది.
(”ద హిందూ” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
ప్రొ.అరుణ్‌కుమార్‌