ద రైవల్స్‌

The Rivalsఈ చావుకి చావన్నా వచ్చి చావదు అనుకుంది బతుకు.
ఈ బతుక్కి బతకడమన్నా వచ్చి బతకదు అనుకుంది బతుకు.
అసలు జీవితం అన్నది చావూ బతుకూ లేక బతుకూ చావూ లేక బతుకూ చావూ కల్సి చేసుకున్న మ్యాచ్‌ ఫిక్సింగేమో!
చావు బతుకుతో, ”నీదేం బతుకు నీదీ ఓ బతుకేనా? బతకడం రాకపోతే చావనన్నా చావొచ్చుగదా?” అంది.
బతుకు చావుతో, ”నీదేం చావు? నీదీ ఓ చావేనా? చావడం రాకపోతే బతకనన్నా బతకొచ్చు కదా?” అంది.
”తెలివి వుంది కదా అని అది తప్పేదాకా కూయకు. నేనన్నదాంట్లో నా చావు తెలివి ఏమీ లేదు. ఉన్నది వున్నట్టు, కుండ బద్దలు కొట్టినట్టు, పీకతెగ్గోసినట్టు మాట్లాడుతాను నేను. బతకలేక, చస్తూ బతకడం కంటే బతక్కపోవడం మంచిదని, బతక్కపోవడం అంటే చావడమేనని ఎరుకచేస్తున్నా”నంది చావు.
”చెప్పొచ్చే ధైర్యం కూడానా నీకు. మోస్ట్‌ అన్‌వాంటెడ్‌ గెస్టువీ, గోస్టువీ నువ్వు. ఎప్పుడు వెన్నుపోటువవుతావో ఎప్పుడు గుండె పోటువవుతావో ఎవరికెరుక! నా బతుకు నా ఇష్టం. నేనిట్లాగే బతకాల్సినన్నాళ్లు బతుకీడుస్తాను. బతికినంతకాలం బతుకుతాను. నా బతుకు మీద నీకు అధార్టీ లేదు” అంది బతుకు.
”లాగి పెట్టి ఒక్కటిస్తాను. గిలగిలాకొట్టుకుంటావు. బతికి వున్నాననే కదా నీ అహంకారం” అంది చావు.
”ఆ మాటకు వస్తే చంపగలనని విర్రవీగే నీది అహంకారం. కాదు దురహంకారం. ఎప్పుడు పడితే అప్పుడు ఒకటీ అరా ఇచ్చే అధికారం నీకు లేదు. నా బతుకు గ్యారంటీ పీరియడ్‌ అయిపోయేదాకా ఆమడదూరంలో అలా నిలబడి మెయిట్‌ చెయ్యాల్సిందే” అంది బతుకు.
”అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావాలి, వద్దన్నప్పుడు రావద్దు అంతేనా?” అంది చావు.
”నేను రమ్మన్నప్పుడు నువ్వెందుకు వస్తావు. నేను వద్దన్నప్పుడు నువ్వెందుకు మానేస్తావు. అయినా రమ్మంటే పారిపోవడం, వొద్దంటే వచ్చి మీద పడ్డం నీకలవాటే కదా!” అంది బతుకు.
”చావు సంగతి బతుక్కు కాక ఇంకెవరికి బాగా అర్థమవుతుంది. కానీ, కాసేపు మాట్లాడకు. ఎవరో వస్తున్నారు” అంది చావు.
చక్రాలు వుండీ కదలకుండా వున్న మంచం మీద కొద్దో గొప్పో ప్రాణం వుండీ కదల్లేక మూల్గుతున్నాడో మనిషి. బతికి బట్టకడతాడో, చచ్చి బట్ట కప్పుకుంటాడో తెలీని మనిషి.
లోపలికి వచ్చాడు డాక్టరు. మనుషుల్ని బతికించినందుకూ చంపినందుకు కూడా ఫీజు వసూలు చేసే డాక్టరు.
”చూడు చూడు! మెళ్లో స్టెత్‌తో వున్న డాక్టర్‌, మెళ్లో పాము వున్న శివుడిలా అవుపించడం లేదూ?” అంది చావు ఆనందంగా.
”అంటే! మంచం మీద మనిషిని మింగేసి రుద్రభూమికి పంపే ఛాన్సు వస్తుందనే కదూ!” అంది బతుకు కోపంగా.
”చావుని నేనిక్కడ రడీగా నుంచున్నాను. వాడెవడు వీడ్ని చంపడానికి. చంపితే చావును నేను చంపాలి కానీ అంది” చావు.
”దిక్కుమాలిన చావ్వి. నువ్వు మాత్రమే వున్నావా ఇక్కడీ దిక్కూ మొక్కూ అయిన బతుకుని నేనూ వున్నానిక్కడ. ఆ డాక్టర్‌ ఈ మనిషిని బతికించడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు నేను బతికిస్తాను” అంది బతుకు.
”ఆ డాక్టరు వీడ్ని చంపడానికి ఏమీ చెయ్యలేకపోయినా నేను చంపేస్తాను” అంది చావు.
”చూడు చూడు! డాక్టరు మంచం మీది మనిషిలో నా కోసం వెదుకుతున్నాడు” అంది బతుకు.
”వాడు వెదికేది నీ కోసం కాదు. వీడిలో ఏయే పార్టులు పనికొస్తాయో చూస్తున్నాడు. జేబుల్లో ఏమైనా వున్నాయేమోనని వెదుకుతున్నాడు. వాచీ, వుంగరాలు, లాకెట్టు గొలుసు వున్నయేమోనని పరిశీలిస్తున్నాడు” అంది చావు.
”నువ్వు చావ్వి కనక ఎవరినైనా చావగొట్టాలనే చూస్తావు కానీ, ఆ డాక్టరు ‘వైద్యోనారాయణోహరి”’ అంది బతుకు.
”వాడు హరి అవునోకాదో కాని ఎందరినో హరీ అనిపించినవాడు. ఫీజు ఇవ్వలేనివాడు పైకి పోతే ఫీజు ఇవ్వలేక పోయేడంటారు. ఫీజు ఇచ్చినవాడు పైకిపోతే ఆయుష్షు తీరి పోయేడంటారు. బతికిన వాళ్ల నంబరు తక్కువే అయినా, తెగ ఆపరేషన్లు తెగేసి చేసినోడని పేరుంది. కిట్టని వాళ్లు కిడ్నీలు అమ్ముకునేవాడని, ప్రాణాలు పోసే లైసెన్స్‌ని ప్రాణాలు తీసే పర్మిట్‌గా వాడుకుంటున్నాడని అంటారనుకో” అన్నాడు బతుక్కి బద్ధశత్రువు.
”పవిత్రమైన వృత్తిని తప్పుపట్టకు” అన్నది బతుకు, బతుకు మీద గంపెడు ఆశతో.
”ఏ వృత్తి చేసేవాడయినా ఆ వృత్తి అపవిత్రమైనదని ఎందుకనుకుంటాడు? స్టార్‌ హోటళ్లలాంటి ఖరీదైన ఆసుపత్రుల్లో ప్రాణవ్యాపారం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క బతుకుమీద ఎన్నో ప్రాణాలు బతుకుతాయి. కాదు కాదు ఒక్క చావు మీద కూడా ఎన్నో ప్రాణాలు బతుకుతాయి” అన్నది బతుకు ఎనిమీ.
సరే అడిగెయ్యి అంది చావు.
”డాక్టరు గారూ… ఈ మనిషి బతుకుతాడా?” అనడిగింది బతుకు డాక్టర్ని.
డాక్టర్‌ బతుక్కేసి ఎగాదిగా చూస్తూ ”పేషెంటు బంధువులు వస్తే గానీ తేలదు” అన్నాడు.
”అదేమిటి?” ఆశ్చర్యపడింది బతుకు.
”వాళ్లు బిల్లు ఏ మాత్రం పే చెయ్యగలరో తెలియాలి కదా!” అన్నాడు డాక్టరు.
”అంటే? బిల్లు బాగా చెల్లుబాటవుతుందని తెలిస్తే చావుని ఆపడం నీ తరం అవుతుందా?” అన్నది చావు ఎకసెక్కంగా.
”బతికే వాణ్ణి బతుకు బతికిస్తుంది. చచ్చేవాణ్ణి చావు చంపేస్తుంది. చచ్చేవాణ్ణి బతుకుతాడని చెప్పి చంపుతాం. బతికేవాణ్ణి చస్తాడని చెప్పి బతికిస్తాం. దేనికైనా బిల్లు వసూలు చేసి తీరతాం” అన్నాడు డాక్టరు.
నా కంటే క్రూరమైన వాడీ డాక్టరు. ఇహ ఇక్కడ ఒక్క క్షణం వుండను. బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయింది చావు.
చావు చంపలేకా చావలేకా వెళ్లిపోయింది కనుక బతుకు బతికి తీరాలి కనక బతుక్కోసం బతికిపోయింది.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212