బధిరుల జీవితాల్లో వెలుగురేఖ ‘హెలెన్‌ కెల్లర్‌’

నిత్య జీవితం… ఆమెకు సమస్యలతో స్వాగతం పలికినా ఏమాత్రం కుంగిపో కుండా, అధైర్య పడకుండా, అవరోధాలను అధిగమించింది. చీకట్లోనూ వెలుగులు చూడగలిగే ధైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆమె చనిపోయేవరకు కూడా వికలాంగులకు చైతన్యపు దారులను వేసింది. ఆమె ఎవరో కాదు అమెరికన్‌ పౌరురాలు, అమెరికన్‌ సోషలిస్టు పార్టీ సభ్యురాలు హెలెన్‌ కెల్లర్‌. నేడు ఆమె142వ జయంతి. ఈ సందర్భంగా ఆమె చేసిన కృషి నేటితరం వికలాంగులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. 1880 జూన్‌ 27న అమెరికాలోని తుస్కంభియ అనే చిన్న గ్రామంలో హెన్రీ కెల్లర్‌, కెట్‌ అడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు జన్మించింది హెలెన్‌ కెల్లర్‌. 19నెలల వయస్సులోనే తీవ్రమైన అనారోగ్యం కారణంగా దృష్టిని, వినికిడి శక్తిని కోల్పోయింది. అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ సూచన మేరకు బ్లైండ్‌ స్కూల్‌లో విద్యార్థిగా చేరి చదవడం నేర్చుకుంది. సలివన్‌ ఉపాధ్యాయిని కృషి ద్వారా అనేక పదాలను తాకడం, వాసన ద్వారా నేర్చుకోవడం చదవడంతో పాటు రాయడం నేర్చుకుని 1904లో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టాను పొందింది. హెలెన్‌ కెల్లర్‌. 1902లోనే ”స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌” అనే పుస్తకాన్ని ప్రచురించి చరిత్ర సృష్టిం చింది. ఈ పుస్తకం 50భాషల్లో ముద్రించబడింది. ఆమె రాసిన పుస్తకాన్ని లేడీస్‌హోమ్‌ జర్నల్‌ అనే పత్రిక సీరియల్‌గా ప్రచురించింది. ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ మోడరన్‌ పీపుల్‌ అనే వ్యాసానికి హార్వర్డ్‌, స్కాట్లాండ్‌, బెర్లిన్‌, జర్మనీ, ఢిల్లీ విశ్వ విద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను పొందింది. సలివన్‌ వివాహం చేసుకున్నప్పటికీ తన భర్త అంగీకారంతో కెల్లర్‌ను వాళ్ళతో పాటు ఉంచుకుని వికలాంగుల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషిలో సహాయకారిగా వ్యవహరించింది. చూపు లేకపోయినా, వినికిడి లోపం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా వికలాంగులను వారికున్నటువంటి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం కోసం, చైతన్యం చేసేందుకు 39దేశాలు పర్యటించింది.
అమెరికన్‌ సోషలిస్ట్‌ పార్టీలో చేరి వికలాంగులు, మహిళలు, బాలలు, కార్మికవర్గ హక్కులు సంక్షేమంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసి చైతన్యపరిచేందుకు జీవితాంతం కృషి చేసింది. ఆమె చేసిన ఉపన్యాసాల ద్వారా అనేక మంది స్పూర్తిపొందారు. ఆమె రాసిన 12పుస్తకాలు ప్రపంచలో అనేక భాషల్లో ముద్రించబడినవి. వికలాంగు లకు సేవ చేయడం కోసం తన వైవాహిక జీవితాన్ని సైతం తిరస్కరించిన గొప్ప యోధురాలు హెలెన్‌ కెల్లర్‌. 1924లో అమెరికన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ సంస్థను స్థాపించి ప్రపంచ దేశాలు పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను సేకరించింది. మిరాకిల్‌ కంటిన్యుస్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి హెలికాప్టర్‌ నడపడం, గుర్రంపై స్వారీ చేయడం తనకు రాకపోయినా పట్టుదలతో షూటింగ్‌ సమయంలో హెలికాప్టర్‌, గుర్రం నడిపితే వచ్చిన నిధులను ఫౌండేషన్‌లో జమ చేసింది. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ బ్లైండ్‌ సంస్థకు అధ్యక్షురాలిగా ఎంపికై అనేక పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రించింది. ఆమె రాసిన అనేక పుస్తకాలు అంధులకు, బధిరులకు ఎంతో ఉపయోగపడినవి. సలివాన్‌తో పాటు థామ్సన్‌, వినరు కర్బల్లి అనే నర్సు హెలెన్‌ కెల్లర్‌కు ఉపాధ్యాయులుగా కొనసాగి, వికలాంగుల హక్కుల కోసం, మహిళలు, బాలలు, సోషలిజం, కమ్యూనిజం కోసం వ్యాసాలు రాయడానికి సహాయం చేశారు. 1903-1965 వరకు ఆమెరికా అధ్యక్షులుగా ఉన్నవారందరికీ వికలాంగులు, మహిళలు ఎదురొంటున్న సమస్యలపై లేఖలు రాసింది. ఆమె రాసిన ప్రతి లేఖకు అమెరికా అధ్యక్షులు అందరు తిరిగి సమాధానం పంపించారంటే ఆమె చేస్తున్న కృషి పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం. చార్లీ చాప్లిన్‌, గ్రహం బెల్‌, నెహ్రూ, డేవిడ్సన్‌, విలియం జేమ్స్‌ వంటి ప్రభుత్వపు నేతలతో స్నేహం చేసి వికలాంగుల హక్కులు, సంక్షేమం, సోషలిజంపై నిరంతరం వార్తా చర్చలు జరిపేవారు. హెలెన్‌ కెల్లర్‌ ఇన్‌ ఆఫ్‌ మై స్టోరీ అనే డాక్యుమెంటరీకి 1955లో ఆస్కార్‌ అవార్డు పొందింది. 1964 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌ హెలెన్‌ కెల్లర్‌ను తమ దేశ ముద్దుబిడ్డగా ప్రకటించి ప్రెసిడెన్షియల్‌ మోడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అనే అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. 1961లో వాషింగ్టన్‌ జరిగిన బహిరంగ సభలో లయన్స్‌ హ్యూమనేటర్‌ అనే అవార్డును పొందింది. జీవితాంతం చేసిన కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఆమె పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయి. 1988జూన్‌ 1న ఆమె మరణించారు. అమె చనిపోయేవరకు కూడా నిరంతరం వికలాంగుల సంక్షేమం, హక్కుల కోసం పరితపించారు. 80సంవత్సరాల వయసులోనూ ప్రతిరోజూ సేవా కార్యక్రమాల్లో నిమగమయ్యారు. తనకు చూపులేక పోయినప్పటికీ మహిళల్లో వికలాంగులు, బాలలు, మానవ హక్కులపై నిరంతరం ఉపన్యాసాలిస్తూ పుస్తకాలు రాశారు
2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ప్రతి 18మందిలో ఒకరు వినికిడి సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి తీవ్రమైన వినికిడి సమస్యలున్న వారి సంఖ్య 2005 కోట్లకు చేరుతుందని ప్రకటించింది. ఇందులో 70కోట్ల మంది తప్పనిసరిగా వినికిడి పరికరాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుబెల్లా మెదడువాపుకు వ్యాక్సిన్‌ వేయడం ద్వారా చిన్న పిల్లల్లో వచ్చే వినికిడి సమస్యను 60శాతం వరకు నివారించవచ్చని అనేక సర్వేలు వెల్లడిస్తున్నవి. కొన్ని రకాల యాంటీ బయాటిక్‌ మందులు వాడటం ద్వారా కొందరిలో వినికిడి సమస్యకు దారితీస్తుంది. ప్రస్తుతమున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినికిడి సమస్యను ముందే గుర్తించవచ్చు. వినికిడి లోపం వలన మానసిక సమస్యలు కూడా వస్తున్నవి, వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటున్నవి. చెవుడు వలన వృత్తి పరంగా వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. వినికిడి లోపం కలిగిన వారు సమాజంలో తీవ్రమైన వివక్షతకు గురవుతున్నారు. 78శాతం పేద దేశాల్లో 10లక్షల మందికి ఒక ఈఎన్‌టీ డాక్టర్‌ కూడా లేరు. మనదేశంలో 15 నుండి 20శాతం మంది వినికిడి, మాట సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 50ఏళ్లలోపు వయస్సున్న వారిలో 60శాతం 70ఏళ్లలో పైసున్న వారిలో 75శాతం మంది వినికిడి లోపానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ఐదు వేలమంది మాత్రమే ఆడియాలజిస్టులు మాత్రమే ఉన్నారంటే బధిరులపై కేంద్రం శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ని అభివృద్ధి చేయకుండా అమెరికన్‌ సైన్స్‌ లాంగ్వేజ్‌ వినియోగించడం బాధాకరం. దీనికోసం ఉన్న అవకాశాలను వినియోగించుకునేలా కేంద్రం ఆలోచించడం లేదు. ఇది ఎంతమాత్రం సరికాదు. హెల్లెన్‌ కెల్లర్‌ చూపిన మార్గంలో బదిరుల హక్కుల సాధనకు వికలాంగులు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎం. అడివయ్య
9490098713