వాళ్లు సరే.. మరి మనం..?

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన సంతోషమే లేకుండా పోతోంది మన ప్రధాని మోడీజీకి. ఎందుకంటే ఇంతకుముందులాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేకుండా పోయిందాయే. అందుకే ఆయన తాజాగా తన అక్కసునంతా వెళ్లగక్కారు. వెనిజులాకు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రతినిధులకు అనుమతినివ్వ లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను మోడీజీ దునుమాడారు. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణలో హస్తం పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఒంటికాలి మీద శివాలెత్తారు. కర్నాటక కాంగ్రెస్‌ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది, ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలను సకాలంలో చెల్లించటం లేదు, తెలంగాణలో రుణమాఫీని సరిగా అమలు చేయలేదంటూ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఓకే.. కరెక్టే..నిజమే… మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అన్నింటా విఫలమైంది, ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేస్తోంది.. ఇది నూటికి రెండొందల శాతం కరెక్టు. మోడీగారు చెప్పింది అక్షరాలా నిజం. కానీ పదేండ్ల క్రితం ఇదే నరేంద్రమోడీ చెప్పిన విషయాలు, చేసిన వాగ్దానాలు మననం చేసుకుంటే మన కండ్లు బైర్లు కమ్మి కింద పడటం ఖాయం. ‘విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తెస్తాం, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తాం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం రైతులకు మద్దతు ధరలు కల్పిస్తాం…’ అంటూ మస్తు జబర్దస్త్‌గా మాటలు చెప్పారు. పదేండ్లు గిర్రున తిరిగాయి. ఇప్పుడా మాటలన్నీ మరిచి, కాంగ్రెస్‌ను ఇరగదీస్తున్నారు మన పీఎమ్‌ సాబ్‌. ఇది చూసి…’ఎదుటోడికి నీతులు చెప్పే ముందు మనం కూడా వాటిని పాటిస్తే మంచిది కదా…?’ అంటున్నారు జనాలు. నిజమే కదా మోడీ సాబ్‌… వాళ్లు సరే.. మరి మన హామీల సంగతేంది?
-బి.వి.యన్‌.పద్మరాజు