పేలని ‘బాంబులు’

బాంబులనగానే హైదరాబాద్‌ గోకుల్‌చాట్‌, మక్కామసీదులో పేలిన బాంబులే మనకు టక్కున గుర్తొస్తాయి. కానీ తాజాగా ‘రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేలుతారు’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సౌత్‌ కొరియా గడ్డపై చేసిన హాట్‌ కామెంట్లపై నెటిజన్లు, రాజకీయ నేతలు పలురకాలుగా స్పందిస్తున్నారు. దీంతో రాజకీయాల్లో ఏం జరుగనుందనే ఆసక్తి నెలకొంది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం ‘బాంబు’ పేలడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగైయిపోయింది కదా? ఇంకేం బాంబులు పేలుతాయానడంతో అక్కడున్నవాళ్లు గొల్లుమన్నారు. ‘దీపావళి బాంబులు తుస్పుమన్నాయి’ అని ఇంకొందరూ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పొంగులేటి వద్ద ప్రస్తావించగా ‘బాంబులు పేలడానికి కొంత సమయాన్ని ఫిక్స్‌ చేస్తారు. మనం అనగానే అవి పేలవు. అలాగే రాజకీయ బాంబులు పేలేందుకు కూడా కొంత సమయం పడుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. అసలు పొంగులేటి మనసులో ఉన్న బాంబు ఏంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుంటే, దానికి కొంతమంది నెటిజన్లు మాత్రం వెరైటీగా స్పందిస్తూ…’ఏమీ లేదబ్బా శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి ఓ పెద్ద ఎమ్మెల్యేల గుంపు ‘కాంగ్రెస్‌ మంద’లో కలవబోతున్నది. దీంతో మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా పోతుంది. ఆయన కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు ఇలాంటి అవ మానాన్ని చేశారు కదా? ఇప్పుడు కేసీఆర్‌కు అలాంటి దుస్థితి రాబోతుంది.’ ఇదే పొంగులేటి బాంబుల సూత్రం అని రాసుకొచ్చారు. ‘ఓరి నాయనా అది కాదురా.. బాంబులు పేలుతాయంటే… సీఎం రేవంత్‌రెడ్డిని దించేసి ఆయన స్థానంలో మరొకర్ని కూర్చొబెట్టబోతున్నారట. ఇది అసలైన పెద్ద బాంబు’ అని మరో నెటిజన్‌ చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో, అది ఎవరికి ప్రమాదమో, మరెవరికి ప్రయోజనమో..లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ…
– గుడిగ రఘు