తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంటాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో శారీరక ఎదుగుదలలో చిన్నచిన్న లోపాలను సైతం భూతద్దంలో పెట్టి చూస్తూ ఇక వారికి ఏదీ చేతకాదు, వారు ఏ పనీ చేయలేరు అని చెప్పి ఉదాశీనతతో వ్యవహరిస్తూ పిల్లలు చేసుకోవలసిన చిన్న చిన్న పనులను సైతం తల్లిదండ్రులే తీరుస్తూ పిల్లలను సోమరులుగా, నిస్సహాయులు మారుస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా ‘పొన్నం ఆదిత్య’ తల్లిదండ్రులను చెప్పొచ్చు…
ఇంతకీ ఎవరీ ఆదిత్య…? అతని విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న మెలకువలేంటి…? ఆదిత్య గురించి చర్చించుకోవాల్సినంతగా ఏముందనేది మీ కనిపించొచ్చు. అందుకే ఈ నెల (నవంబర్) ఏడు నుంచి 10వ తేదీ వరకు గోవాలో జరగనున్న కరాటే వరల్డ్ కప్ చాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటున్న ఆదిత్య గురించిన ఫుల్ డీటెయిల్స్‌ని, అతని సక్సెస్‌ని తెలుసుకుందాం.
ఆదిత్య తల్లిదండ్రుల నేపథ్యం:
పొన్నం వేణు, కోమలత దంపతులకు ఇరువురు సంతానం. పాప శ్రీ వైష్ణవి, కుమారుడు ఆదిత్య. వీరి స్వగ్రామం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామూరు. కానీ వేణు, కోమలత దంపతులు వత్తిరీత్యా హనుమకొండ నగరంలోని రాంనగర్‌లో సెటిలయ్యారు. వేణు ప్రైవేట్ పెస్టిసైడ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ కాగా కోమలత గహిణి.
ఓవర్‌వెయిట్ తగ్గించడానికి మార్గం:
ఆదిత్య శారీరక ఎదుగుదల వేణు, కోమలత దంపతులను కృంగదీసేది. బాబు ఫ్యాట్‌గా ఉండేవాడు. 11 సంవత్సరాల వయసులోనే ఆదిత్య సుమారు 60 కేజీల వెయిట్ ఉండటం వాళ్ళని కలవర పరిచేది.
ఎలాగైనా ఆదిత్యని ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్‌కి తీసుకురావలనేది ఈ దంపతులకు పట్టుదల. దగ్గరి బంధువు ఒకరి సూచన మేరకు ఆదిత్యను కరాటే క్లాస్‌కి పంపాలనే ఆలోచన వేణు దంపతులకు కలిగింది.
కరాటే అంటేనే శారీరక కసరత్తు. నిత్యం వివిధ రకాల ఎక్సర్‌సైజులు, కరాటేకి సంబంధించిన, కట్టాస్, స్పారింగ్ లాంటి శారీరక శ్రమతో కూడుకున్న ఎన్నో ఈవెంట్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆదిత్యను కరాటేకి పంపాలని తల్లిదండ్రులు దఢంగా నిర్ణయించుకున్నారు. అప్పటికే వేణు సోదరుడు రాకేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్న రెడ్డబోయిన భరత్ కరాటే బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ పొంది, చుట్టుపక్కల పిల్లలకి కరాటే క్లాసులు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. అతడి ఆలోచనలకు తగ్గట్టుగా వేణు దంపతులు కూడా తమ కొడుక్కి కరాటే నేర్పించాలనుకోవడంతో వారి గమ్యం సులభమయింది. అలా అతి చిన్న వయసులోనే కరాటేలో వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడు ఆదిత్య.
అనతి కాలంలోనే ఆదిత్య ప్రతిభ:
ఇప్పటివరకు ఆదిత్య కరాటే స్టేట్ లెవెల్ చాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్, జాతీయస్థాయి కరాటే పోటీలలో మరో గోల్డ్ మెడల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఛాంపియన్షిప్ విన్నర్‌గా ఆదిత్య నిలిచిన తీరు, చూపిన ప్రతిభ ప్రశంసనీయం.
వరల్డ్ ఛాంపియన్షిప్‌కి ఆదిత్య:
ఈ ఏడాది నవంబర్ ఏడవ తేదీ నుండి 10 తేదీ వరకు 24 ఎఫ్ ఎస్ కె ఎ వరల్డ్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు గోవాలో జరగనున్నాయి. సుమారు 50కి పైగా దేశాలు పాల్గొంటున్న ఈ పోటీల్లో 14 సంవత్సరాల లోపు విభాగం బిలో 55 కేజెస్ విభాగం కటా, స్పారింగ్ ప్రదర్శనలో ఆదిత్య తన ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ప్రోత్సాహం కోసం….
ఆదిత్య ప్రతిభనైతే సాధించాడు కానీ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనాలంటే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే వుంది.
ఆదిత్య పోటీలలో పాల్గొనాలంటే, సేఫ్టీ కిట్స్, ఈవెంట్ ఇక్విప్మెంట్స్, ట్రావెలింగ్, తదితర అనేక ఖర్చులకు వారి ఆర్థిక స్థోమత అడ్డంకిగా మారుతుంది. దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించినట్లయితే ఆదిత్య మరింత ప్రతిభతో తన సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటే అవకాశం లేకపోలేదు.
– కోగిల చంద్రమౌళి, 9573187218