సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయండాక్టర్‌ … డాక్టర్‌ అని అరుస్తూ ఆసుపత్రి వెళ్లిన చంద్ర శేఖరం, ”గత మూడు నెలల నుండి తీవ్రమైన తలనొప్పి, అలసట, అజీర్తి, కాళ్లు చేతులు లాగడం సమస్యలు ఎక్కువయ్యాయి. పూర్తిగా నీరసించి పోతున్నాను దీనికి సరైన చికిత్స చేయండి” అంటూ అడిగాడు.
డాక్టర్‌ గారు అన్ని రకాల పరీక్షలు చేసి అంతా బాగుంది. మీరు ఎక్కువగా బయట దొరికే ఆహారాన్ని తింటున్నట్టున్నారు. అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అన్నాడు.
”లేదు డాక్టర్‌ ఇంట్లో భోజనం మాత్రమే తింటాను. మార్కెట్లో దొరికే కూరగాయలు, ఇంట్లో వండినవి మాత్రమే తింటాను” అన్నాడు చంద్రశేఖరం.
డాక్టర్‌ గారు వెంటనే ”చూడండి… చంద్రశేఖరం గారు మార్కెట్లో దొరికే కూరగాయలు మాత్రమే తింటున్నారని చెప్తున్న కూరగాయలపైన రకరకాల రసాయనాలను పిచికారి చేస్తున్నారు. పంటదిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు మొక్కలపైన అపరిమితంగా రసాయనాలు పిచికారి చేస్తున్నారు. వాటి నుండి వచ్చిన కూరగాయలు తినడం ఫలితంగా మన జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఇలాంటి రకరకాల రోగాల బారిన పడుతున్నాం. ఇది నేను చెప్పిన మాట కాదు ఇటీవల ఒక సర్వేలో ఇలాంటి విషయాలు తేల్చి చెప్పారు. మితిమీరిన రసాయనాల పిచికారి మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది” అని డాక్టర్‌ గారు చెప్పగానే, మరి ఇలాంటి రోగాలు రాకుండా ఏ విధంగా నివారించ వచ్చని చంద్రశేఖరం డాక్టర్‌ గారిని అడిగాడు.
అప్పుడు డాక్టర్‌ రసాయనాలు పిచికారి చేయకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించినట్లయితే మన ఆరోగ్యాలను కాపాడుకుంటాం. పంట దిగుబడి కోసం రసాయనాలకు బదులుగా సహజసిద్ధమైన పశువుల పేడ, మేకపెంట వ్యర్థాల నుండి తయారుచేసిన వివిధ ఎరువులను వాడాలి. ఈ దిశగా రైతులు చైతన్యవంతం కావాలి. అప్పుడే ఈ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు అని డాక్టర్‌ చెప్పాడు.
చంద్రశేఖరం డాక్టర్‌ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆరోజు రాత్రి తీవ్రంగా ఆలోచించాడు.
తర్వాత తనకున్న రెండు ఎకరాల పొలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టాడు. అందుకుగాను సహజసిద్ధమైన ఎరువులను వాడాడు. చాలా దిగుబడి వచ్చింది. మార్కెట్లో అందరికీ కంటే తక్కువ ధరకే కూరగాయలను ఆన్‌లైన్లో అమ్మడం మొదలుపెట్టాడు చంద్రశేఖర్‌. అతి తక్కువ కాలంలోనే చాలా డిమాండ్‌ పెరిగింది చంద్రశేఖరం పండించిన కూరగాయలకు.
సేంద్రియ పద్ధతిలో పండించి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నందుకు చంద్రశేఖరం కూడా చాలా సంతోషపడ్డాడు. ఈయనను ఆదర్శంగా తీసుకుని చాలామంది రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని కూరగాయల సాగును మొదలుపెట్టారు.
నీతి: మితిమీరిన రసాయనాలు ఆరోగ్యానికి ముప్పు.
– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105