– ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ మెరిట్ స్కాలర్షిప్ను విద్యార్థులకు అందిస్తున్నదని తెలిపారు. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు పునరుద్ధరణ దరఖాస్తులను ఈనెల 15 వరకు సమర్పించేందుకు అవకాశముందని పేర్కొన్నారు. 2024 వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులను పునరుద్ధరణ చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ష్ట్ర్్జూ://రషష్ట్రశీశ్రీaతీరష్ట్రఱజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ నోడల్ అధికారులు (ఐఎన్ఓ) పరిశీలించేందుకు చివరి తేదీ ఈనెల 30 వరకు ఉందని తెలిపారు. టాప్ 20 పర్సెంటైల్ సాధించి తాత్కాలికంగా ఎంపికైన 59,355 మంది విద్యార్థుల జాబితాను tgbie.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. వారిలో జనరల్ అభ్యర్థులు 13,676 మంది, ఓబీసీలు 32,392 మంది, ఎస్సీలు 8,089 మంది, ఎస్టీలు 5,198 మంది ఉన్నారని తెలిపారు.