
– గంజాయి పేకాటకు బానిసవుతున్న యువత
– పట్టించుకోని 3 టౌన్ పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజ్ మైదానం అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. నిత్యం మద్యం సేవించడం పేకాట ఆడడం గంజాయి త్రాగడం వంటివి చేస్తూ గొడవలు పడుతున్నారు. కానీ మూడవ టౌన్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరతినట్లు వ్యవహరిస్తున్నారు. గత దశాబ్దాల క్రితం ఎప్పుడు కూడా ఇలాంటివి జరిగేవి కావు కానీ సుమారు ఐదేళ్లుగా తరచు పేకాట స్థావరం గా మారి యువత పెడదారిన పడుతున్నారు. పేకాటనే కాకుండా గంజాయి తాగుతూ గొడవలను సృష్టిస్తున్నారు. స్థానిక ప్రజలతోపాటు కళాశాలకు వెళ్లే విద్యార్థినిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం గుండా వెళ్లాలంటేనే మహిళలు, చిన్నారులు, పెద్దవాళ్లు భయపడుతున్నారు. ఈ విషయంలో ఎవరైనా స్పందిస్తే వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. దానికి తోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు మితిమీరిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా అనునిత్యం ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ వెళుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదైనా తప్పు జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇలాంటి గొడవలు జరగకుండా పేకాట ఆడకుండా గంజాయి సేవించకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.