కళ్లెం ఉన్నది మనచేతిలో
గుఱ్ఱం మాత్రం పడెగోతిలో,
దప్పి తీరదని నేనంటాను
నీళ్లే అందని మన నూతిలో
పడవ నడపలేనివాడు నావికుడు
పదము పాడలేనివాడు గాయకుడు
అందుకనే వేదనతో నేనంటాను
ప్రజల నడపలేనివాడు నాయకుడు!
పైపై సొగసులు కల్లసుమా!
లోపలిదంతా డొల్లసుమా!
నిజం తెలియమని నేనంటాను
లేదా కొంపే గుల్లసుమా!
నింగి కితాబుగ చేశాను
చుక్కల హిసాబు వేశాను
ప్రేయసి కోసం వేచీవేచీ
తుదకు మంచమే నేశాను
బండను కోయాలి కుసుమదళం
గుండెను కోయాలి నయన జలం
కదనరంగమున, నేనంటాను
కత్తిని మించాలి కవుల కలం
నవబాష్పధారలో నవ్వు కాగలవు
ముళ్ల తీగెలలోన పువ్వు కాగలవు
యత్నించి చూడమని అంటాను నేను
రాళ్ల రాసులలోన రవ్వ కాగలవు
– దాశరథి కృష్ణమాచార్య
(5వ తేదీ దాశరథి 37వ వర్థంతి)