కోమా పేషేంట్‌కు రేవంత్‌ సర్కార్‌ చేయూత

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాల తో పది నెలలకుపైగా ఖతార్‌లోని ఆస్పత్రిలో కోమా స్థితిలో ఉన్నారు. కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్‌ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి నిమ్స్‌కు బదిలీ చేశారు. వైద్య ఖర్చులు భరించే స్థోమత లేదనీ, నిమ్స్‌ ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇప్పించి, ఉచిత వైద్యం అందించాలని సాయన్న భార్య ప్రేమలత, కుమారులు వికాస్‌, వినీత్‌లు సీఎం ఏ రేవంత్‌రెడ్డి, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంచార్జి ముత్యాల సునీల్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు వారు విడుదల చేసిన వీడియో విజ్ఞప్తికి, అంతకు ముందు పంపిన వినతి పత్రానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్‌ అధికారి ఎస్‌. వెంకట్రావు, సెక్షన్‌ ఆఫీసర్‌ ఇ. చిట్టిబాబు చొరవ తీసుకుని నిమ్స్‌లో అడ్మిషన్‌ కు అనుమతి మంజూరు చేయించారని ప్రభుత్వ తెలిపింది.