నవతెలంగాణ – హలియా: ఈ నెల 6 నుండి చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై టామ్ టామ్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.సోమవారం ఆమె నల్గొండ జిల్లా, హలియా మున్సిపాలిటీలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వే పట్ల ఎన్యుమరేటర్లు నిర్లక్ష్యంగా ఉండవద్దని, పూర్తి జాగ్రత్తగా వివరాలు సేకరించాలని కలెక్టర్ అన్నారు. కేటాయించిన ప్రతి ఇంటి నుండి వివరాలు సేకరించాలని, సర్వే కి వెళ్లిన సమయంలో ఒకవేళ ఎవరైనా ఇంట్లో లేనట్లయితే మరోసారి ఆ ఇల్లును సందర్శించాలని, వివరాలు సేకరించిన తర్వాత ఇండ్లకు స్టిక్కర్ అతికించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు 6 తేదీ నుండి సర్వే కు వస్తున్నందున జిల్లాలోని గృహ కుటుంబ యజమానులందరు ఆధారాలతో సహా అందుబాటులో ఉండాలని కోరారు. సమగ్ర సర్వేను వివరాలను గోప్యంగా ఉంచాలని , పూర్తి శ్రద్ధగా పనిచేసి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఉపాధ్యాయులు గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే బాధ్యత ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగిందని, అందువల్ల బాధ్యతగా సర్వే చేయాలని చెప్పారు .ఈ సర్వే కేవలం రాష్ట్రంలో సమాచార నిమిత్తం ,ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే ఫారాలలోని ఖాళీలను ఎలా పూరించాలో తెలియజేయడమే కాకుండా ప్రశ్నావలి పై ఎన్యుమరేటర్లకు వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో హలియా మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గారెడ్డి ,మండల ప్రత్యేక అధికారి బిక్షపతి తదితరులు ఉన్నారు.