ఇప్పుడు ”ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం”గా పిలవబడేదంతా సత్యాన్ని వెలికితీసే లక్ష్యంతో కాకుండా దానిని మసిపూసి మారేడుకాయ చేసే లక్ష్యంతో నడుస్తోంది. ఆర్థిక శాస్త్రానికి ఉన్న ఈ సైద్ధాంతిక స్వభావాన్ని కార్ల్‌మార్క్స్ లోతుగా గ్రహించాడు గనకనే ‘సాంప్రదాయ ఆర్థిక శాస్త్రం’, ‘అసభ్యకర ఆర్థిక శాస్త్రం’ (వల్గర్ ఎకనామిక్స్) అని రెండు రకాలుగా ఆర్థిక శాస్త్రాన్ని వేరుచేసి చూడాలని చెప్పాడు. ఈ రెండో రకపు అర్థశాస్త్రం ఉత్పత్తి ప్రక్రియను పట్టించు కోదు. మారకం మీద మాత్రమే తన దృష్టినంతటినీ పెడుతుంది. ఆ మారకం జరిగే మార్కెట్‌లో పాల్గొనే ప్రతీ వ్యక్తీ ఒకేస్థాయిలో ఉంటాడు కనుక ఉత్పత్తి రంగంలో జరిగే దోపిడీ సంగతి పూర్తిగా మరుగున పడిపోతుంది.
పెట్టుబడిదారీ విధానంలో అదనపు విలువ ఎలా వస్తుంది అన్న అంశం మీద మార్క్స్ ప్రధానంగా తన దృష్టి నంతా సారించాడు. కనుక ఆ కోణం నుంచే ఆర్థికశాస్త్రం సైద్ధాంతిక స్వభావాన్ని ఆయన చర్చించాడు. ఐతే, మొత్తం వ్యవస్థను పరిశీలించే విషయంలో ‘ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రం’ సామ్రాజ్యవాదం అనేది ఒకటుందని గుర్తించదు. సామ్రాజ్యవాదాన్ని పట్టించు కోకపోవడం కాదు.అసలు సామ్రాజ్యవాదం అనేది ఉనికిలో ఉన్న వాస్తవాన్ని అది నిరాకరిస్తుంది.
ఇలా అంటున్నానంటే, ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర రంగంలో ఉన్న పండితులందరిలోనూ నిజాయితీ లోపించిందని భావించకూడదు. వారి సిద్ధాంతం సంచరించే పరిధిని దాటడం వారికి సాధ్యం కావడం లేదు. అంతే. బోధనా రంగాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు తమ వృత్తిలో పై స్థానాలకు ఎదగాలంటే, వారి పరిశోధనలు ప్రచురించ బడాలంటే, వారికి అవార్డులు, పదవులు రావాలంటే వారు ‘ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రం’ పరిధిని అతిక్రమించ కుండా దానికి లోబడే వ్యవహరించాల్సి వుంటుంది. ఆ పరిధిని గనుక అతిక్రమించి ‘సామ్రాజ్యవాదం’ వంటి అంశాలను చర్చించడానికి పూనుకుంటే అందుకు వారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందుచేత చాలా మంది ఆర్థిక శాస్త్ర పండితులు ఆ పరిధులకు లోబడే నడుచుకోడానికి నిర్ణయించుకుంటారు. ఆ ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ అనేదానిలోనే సామ్రాజ్యవాదం అన్న విషయం కనిపించదు కనుక వారు దాని ఊసెత్తరు. అంతే తప్ప వారంతా నిజాయితీ లేని పండితులు అని, కావాలనే వారంతా అలా వ్యవహరిస్తున్నారని మనం అనుకోవద్దు.
ఒకటి, రెండు ఉదాహరణలతో ఈ విషయాన్ని బాగా గ్రహించవచ్చు. మొదటిది ఆర్థికవృద్ధికి సంబంధించిన సిద్ధాంతం. ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికజనం వృద్ధి చెందే రేటుతో ఆ సమా జపు ఆర్థికవృద్ధిని ముడిపెట్టి చూస్తుంది. అంటే ఆ సమాజంలో జనాభా సహజంగా పెరిగే రేటుతో అది ముడిపడి వుంటుందని భావిస్తుంది. ఈ దృక్పథంలో ఉన్న లోపం ఏమంటే అది సమాజం మొత్తంగా ఉన్న డిమాండ్ తాలూకు పాత్రను అది గుర్తించదు. ఆ దృక్పధం ‘సే’ సూత్రాన్ని విశ్వసిస్తుంది. సమాజంలో ఎంత ఉత్పత్తి అవుతుందో అదంతా చెల్లుబాటు అయిపోతుంది అని ‘సే’ సూత్రం అంటుంది. ఎక్కడైనా సూక్ష్మ స్థాయిలోనో, తాత్కాలికంగానో డిమాండ్ కొరత రావచ్చునేమో తప్ప మొత్తం మీద మార్కెట్‌లో ఎంత ఉత్పత్తి వస్తుందో అంత మేరకు సరిపడా డిమాండ్ ఉంటుందని ఆ సూత్రం చెప్తుంది. కాని ఇది చారిత్రికంగా చూసినప్పుడు వాస్తవం కాదు.
అమెరికా, కెనడా వంటి ‘కొత్త ప్రపంచపు’ దేశాలలో పెట్టుబడిదారీ విధానం నడవడానికి కావలసిన శ్రామిక జనాన్ని అందించడం కోసం 19వ శతాబ్దం వరకూ దాదాపు రెండు కోట్లమంది ప్రజలను ఆఫ్రికా నుండి బానిసలుగా పట్టి తెచ్చి నియోగించారు. వారిచేత గనుల్లో, తోటల్లో పని చేయించారు. అదే విధంగా భారత దేశం నుండి, చైనా నుండి దాదాపు ఐదు కోట్ల మంది శ్రామికులను ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని ఆ కొత్త ప్రపం చానికి తరలించారు. ఇది దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం దాకా కొనసాగింది. (అంతకు ముందే యూరప్ నుంచి దాదాపు ఐదు కోట్ల మంది ప్రజానీకం ఇష్టపూర్వకంగానే కొత్త ప్రపంచానికి వలసలు వచ్చారు. ఆ కొత్త ప్రపంచంలో అంతవరకూ జీవిస్తున్న స్థానికులను వారి ఆవాసాల నుండి తరిమివేసి ఆ భూములను ఆక్రమించుకున్నారు)
పెట్టుబడిదారీ విధానం విస్తరణ క్రమంలో ఇంత భారీ స్థాయిలో జనాభా ఒక దగ్గరినుండి మరొక చోటికి తరలించబడడం అనేది ‘ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం’ చెప్పే వృద్ధి సిద్ధాంతానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. జనాభా సహజ వృద్ధి మీద ఆధారపడి ఆర్థిక వృద్ధి జరుగుతుందనే ఆ సిద్ధాంతం ఇక్కడ వర్తించలేదు. అయినప్పటికీ, వాళ్లూ ఇప్పటికీ అదే వృద్ధి సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఒకవేళ ‘సామ్రాజ్యవాదం’ అనేది లేకపోయినట్టైతే ఈ వృద్ధి సిద్ధాంతం చెల్లుతుంది కదా అనే వాదన చేసినవాళ్లూ ఉన్నారు. ఆస్ట్రియా కు చెందిన ఆట్టో బేయర్ అనే మార్క్సిస్టు ఈ విధమైన వాదనలనే చేశాడు. కాని పెట్టుబడిదారీ విధానం తన అవసరాల కోసం సాగించిన భారీ స్థాయి జనాభా తరలింపులను అతను గుర్తించనేలేదు. ”21వ శతాబ్దంలో పెట్టుబడి” అనే గ్రంధాన్ని 2013లో రచించిన థామస్ పికెటీ సైతం చారిత్రకంగా ఖండాంతరాలను దాటి జరిగిన శ్రామిక జనుల నిర్బంధ తరలింపును తన సిద్ధాంతంలో పరిగణనలోకి తీసుకోలేదు.
ఇక రెండో ఉదాహరణ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన సిద్ధాంతం. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా ప్రతీ దేశమూ ప్రయోజనం పొందుతుంది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ప్రతీ దేశంలోనూ ఉత్పత్తి విధానంలో ఉండే అన్ని అంశాలూ (పరిశ్రమలు పూర్తి కెపాసిటీ మేరకు నడవడం, ముడిసరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కావడం, కార్మికులు పూర్తి స్థాయిలో పనుల్లో నియోగించబడడం వగైరా) పూర్తి వినియోగంలో ఉంటాయన్నది ఈ సిద్ధాంతానికి ప్రాతిపదిక. స్వేచ్ఛా వాణిజ్యానికి అనుమతి నిచ్చిన తర్వాత కూడా ఉత్పత్తి విధానంలోని అన్ని అంశాలూ పూర్తి స్థాయిలో వినియోగించ బడుతూనే వుంటాయని, ఐతే, ఏ దేశం ఏ యే ఉత్పత్తులు చేస్తుందనేది మాత్రం మారుతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది. ప్రతీ దేశమూ తన వనరులను వినియోగించుకుంటూ మొత్తం ప్రపంచ మార్కెట్‌కు తగినట్టు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని చేపడుతుందని, వివిధ దేశాల మధ్య పరస్పర సహకారం ఏర్పడుతుందని, దాని వలన అన్ని దేశాలూ వృద్ధి చెందుతాయని ఈ సిద్ధాంతం భావిస్తుంది. పరస్పర పోటీలో నిలదొక్కుకోగలిగినవారే మిగులుతారనే పోటీ సిద్ధాంతాన్ని అది తిరస్కరిస్తుంది.
అయితే ఇలా అన్ని దేశాలూ పూర్తి స్థాయిలో ఉత్పత్తిని చేపట్టగలగాలంటే ఆ ఉత్పత్తిని అంతటినీ పూర్తిగా వినియోగించగలిగే డిమాండ్ ఉండి వుండాలి. కాని ప్రపంచం మొత్తం మీద ఎంత డిమాండ్ ఉంటుందో అంతమేరకే ఉత్పత్తిని చేపట్టడం జరుగుతుంది కాని అందుకు భిన్నంగా కాదు. ఉన్న డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేస్తే ఆ సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలిపోతాయి. అందుచేత ఒకానొక దేశంలో గనుక ఉత్పత్తి పెరిగితే, అది మరొక దేశంలో ఉత్పత్తి తగ్గిపోడానికి దారితీస్తుంది. అంటే స్వేచ్ఛా వాణిజ్యం ఫలితంగా అన్ని దేశాలూ వృద్ధి చెందుతాయనే వాదన చెల్లదు. కొన్ని దేశాలు బాగుపడడానికి మరికొన్ని దేశాల పరిస్థితులు దెబ్బ తినవలసిన పరిస్థితులను స్వేచ్ఛా వాణిజ్యం కల్పిస్తుంది. అందుకే వివిధ దేశాల నడుమ మార్కెట్ల మీద పట్టు కోసం పోరాటం జరుగుతూ వుంటుంది. ఇలా మార్కెట్లమీద అదుపు సాధించే లక్ష్యమే సామ్రాజ్యవాదం అనే స్వభావానికి మూలం. వాణిజ్యం అనేది ఒక పోరాటంగా చూడడం బదులు. అది పరస్పర సహకారంతో జరుగుతుందని చెప్పడం ద్వారా ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ సామ్రాజ్యవాదం అనే లక్షణాన్ని పూర్తిగా మరుగుపరుస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించే సిద్ధాంతవేత్త అయిన ప్పటికీ జాన్ మేనార్డ్ కీన్స్ ఈ మార్కెట్ల కోసం దేశాల నడుమ జరిగే పోరాటాన్ని గుర్తించాడు. అందుకే అతడు ‘సే’ సూత్రాన్ని తిరస్కరించాడు. ఒకానొక దేశం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే మార్కెట్ల కోసం పోటీ పడవలసిందేనని అతడు తెలిపాడు. అటువంటి పోటీని తట్టుకోవాలంటే దేశీయ మార్కెట్‌లోని డిమాండ్‌ను బలోపేతం చేయాల్సి వుంటుందని, పూర్తిస్థాయిలో అందరికీ ఉపాధి కల్పించేవిధంగా ప్రభుత్వం జోక్యం కల్పించుకున్నప్పుడే దేశీయ డిమాండ్ బలపడుతుందని కీన్స్ ప్రతిపాదించాడు. అదే విధంగా దేశీయ మార్కెట్‌ను, ఉత్పత్తిదారులను, అంతర్జాతీయ పోటీ తాకిడినుండి కాపాడ డానికి సైతం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అతను చెప్పాడు. అంటే స్వేచ్ఛా వాణిజ్యం ప్రయోజనకరం అనే సిద్ధాంతాన్ని అతడు తిరస్క రించడాన్నమాట.
కాని ఇప్పటికీ, స్వేచ్ఛా వాణిజ్యం సిద్ధాంతాన్ని చిలక పలుకుల్లా వల్లించేవారు ఉన్నారు. వారంతా మార్కెట్ మొత్తం మీద డిమాండ్‌కు ఏర్పడే కొరతను పరిగణనలోకి తీసుకోరు. అందువలన మార్కెట్ కోసం అనివార్యంగా తీవ్రమైన పోటీ ఉంటుందనే వాస్తవాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ఆ పోటీ సామ్రాజ్యవాదానికి దారి తీస్తుందని వారు గుర్తించరు. నిజానికి సామ్రాజ్యవాదం అనే ధోరణిని కప్పిపుచ్చడానికే వాళ్ళు స్వేచ్ఛా వాణిజ్యం సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. దానిని సమర్ధించుకోడానికి కాలం చెల్లిన ‘సే’ సూత్రాన్ని జపిస్తున్నారు.
మూడో ప్రపంచ దేశాలలో పరిశ్రమలను వలసపాలన కాలంలో నాశనం చేయడం, ఆ దేశాలకు తమ పారిశ్రామిక సరుకులను పెద్దఎత్తున దింపి మార్కెట్‌ను చేజిక్కించుకోవడం చారిత్రక వాస్తవం. కాని, ఈ చారిత్రక అనుభవాన్ని కూడా స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతకారులు గుర్తించరు. అందుచేత మూడో ప్రపంచ దేశాలలో నెలకొన్న పేదరికానికి మూలం సామ్రాజ్యవాదుల దోపిడీయే అన్న సత్యాన్ని, సంపన్న దేశాలతో వాణిజ్యం నిజానికి మూడో ప్రపంచ దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే సత్యాన్ని వారు కప్పిపుచ్చే పనిలో ఉన్నారు.అందుకే ఈ ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ అనేది నిష్పాక్షికమైనదేమీ కాదు. అది సామ్రాజ్యవాద దోపిడీని కప్పిపుచ్చే సైద్ధాంతిక మాయాజాలం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్