– ఐపీఎల్ వేలం వేదిక ఖరారు
– ఈ నెల 24, 25న ఆటగాళ్ల వేలం
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరుగనుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ అనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో వేదికగా జెడ్డాను ఖరారు చేశారు. ఈ నెల 24, 25న జెడ్డాలో రెండు రోజుల పాటు ఐపీఎల్ 2025 ఆటగాళ్ల మెగా వేలం జరుగనుంది. వేలానికి 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా..పది ప్రాంఛైజీలు గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయనున్నాయి. 1574 మంది ఆటగాళ్లలో 1165 మంది భారత క్రికెటర్లు కాగా 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ నుంచి 48 మంది క్యాప్‌డ్, 1172 అన్‌క్యాప్‌డ్ (భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించని) ప్లేయర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది వేలంలోకి రానుండగా.. ఆస్ట్రేలియా నుంచి 76, ఇంగ్లాండ్ నుంచి 52, న్యూజిలాండ్ నుంచి 39, వెస్టిండీస్ నుంచి 33, అఫ్గనిస్థాన్ నుంచి 29 మంది క్రికెటర్లు వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే పది ప్రాంఛైజీలు రిటెన్షన్ జాబితా సమర్పించాయి. ప్రతి ప్రాంఛైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు.