ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు 26

– ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 27 వరకు అవకాశం : ఇంటర్‌ బోర్డు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2025, మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు ఈనెల 26వ తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ (జనరల్‌, ఒకేషనల్‌) రెగ్యులర్‌, ఫెయిలైన విద్యార్థులతోపాటు హాజరు మినహాయింపు ఉన్న ప్రయివేటు విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాలని కోరారు. ఆలస్య రుసుం లేకుండా బుధవారం నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆలస్య రుసుం రూ.100తో ఈనెల 27 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు, రూ.500తో అదేనెల ఐదు నుంచి 11 వరకు, రూ.వెయ్యితో 12 నుంచి 18 వరకు, రూ.రెండు వేలతో వచ్చేనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించాలని కోరారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం థియరీ సబ్జెక్టులకు జనరల్‌ విద్యార్థులు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులు రూ.750 (థియరీకి రూ.520, ప్రాక్టికల్స్‌కు రూ.230) చెల్లించాలని తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులు థియరీ సబ్జెక్టులకు రూ.520, సైన్స్‌ విద్యార్థులు రూ.750 (థియరీకి రూ.520, ప్రాక్టికల్స్‌కు రూ.230) ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ విద్యార్థులు రూ.750 (థియరీకి రూ.520, ప్రాక్టికల్స్‌కు రూ.230) ఫీజు కట్టాలని వివరించారు. ఇతర వివరాలకు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల ఫీజు స్వల్పంగా పెరగడం గమనార్హం. అంటే థియరీ సబ్జెక్టులకు రూ.10, ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.10 చొప్పున ప్రభుత్వం పెంచింది. గతేడాది కంటే ప్రథమ సంవత్సరం ఆర్ట్స్‌, సైన్స్‌ విద్యార్థులు రూ.10, ద్వితీయ సంవత్సరంలో సైన్స్‌, ఒకేషనల్‌ విద్యార్థులు రూ.20 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.