
మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు సందర్శించి పరిశీలించారు. నాగాపూర్, చౌట్ పల్లి, హాస కొత్తూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వేను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వద్దన్నారు. కుటుంబ యజమాని తెలిపిన మేరకు పూర్తి సమాచారంతో సర్వేలో ఆ కుటుంబ వివరాలను పొందుపరచాలన్నారు. ఒక కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే ఆ ఇంటి గోడ పైన స్టిక్కర్ అతికించాలని సూచించారు. ప్రజలు కూడా సర్వే సిబ్బందికి సహకరించి స్పష్టంగా తమ కుటుంబ వివరాలను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంధ్య, గంగా జమున, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.