సోవియట్ విప్లవం ప్రపంచవ్యాపితంగా ఉన్న పెట్టుబడిదార్ల, భూస్వాముల గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. జాతీయ విముక్తి ఉద్యమాలకు బాసటగా నిలిచింది. ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్లో దాని ప్రాసంగితను రేఖామాత్రంగానైనా అర్థం చేసుకునేందుకే ఈ వ్యాసం.
(జూలియన్ క్యాలెండర్ ప్రకారం) అక్టోబరు విప్లవం రష్యాలోనే సంభవించి ఉండచ్చు. అది రష్యాకే సంబంధించినది ఎంతమాత్రం కాదు. ఆ విధంగా వ్యాఖ్యానించిన వారి నోళ్లు మూయించడానికా అన్నట్టు స్టాలిన్ ”అక్టోబర్ విప్లవం ఒక జాతీయ సరిహద్దుల మధ్య జరిగిన ఘటనగా చూడకూడదు. ప్రాథమికంగా ఇది అంతర్జాతీయ ప్రాధాన్యతున్న విషయం. ప్రపంచ మానవాళి చరిత్రను ఒక మలుపు తిప్పిన ఘటన. గతంలో జరిగిన విప్లవాలన్నీ ఒక దోపిడీ చేసే ముఠా స్థానంలో మరో దోపిడీ ముఠా అధికారాన్ని హస్తగతం చేసుకున్నవే. దోపిడీ యథాతధంగా ఉండింది. కానీ, అక్టోబర్ విప్లవం దోపిడీనే అంతం చేసింది. వర్గరహిత సమాజాన్ని ఆవిష్కరించింది” – (స్టాలిన్ ఏరిన రచనల నుండి)
ప్రపంచ పరిణామాల దశనూ, దిశనూ మార్చిందా విప్లవం. వలస రాజ్య వ్యవస్థ బీటలు వారడానికి బీజాలు పడ్డాయి. జాతీయ విమోచనోద్యమాలకు మద్దతుగా 1920లో లెనిన్ కోమిన్‌టర్న్ 2వ కాంగ్రెస్‌లో ప్రతిపాదించిన తీర్మానం వలస వ్యవస్థలపై పోరాడే శక్తులకు వెయ్యేనుగుల బలమిచ్చినట్లయింది. ఎక్కడిదాకో ఎందుకు? భారత జాతీయోద్యమ నేతలందరిపై, లాలా లజపతిరాయి నుండి నెహ్రూ వరకు బాగా ప్రభావం చూపింది. 8 గంటల పనివిధానం కోసం ప్రపంచవ్యాపితంగా సాగే పోరాటాలకు అక్టోబర్ విప్లవానంతర నిర్ణయాలు ఉత్ప్రేరకాలయ్యాయి. అధికారంలోకొచ్చిన మరుక్షణం ఆ కార్మికవర్గ రాజ్యంలో 8 గంటల పని విధానం అమల్లోకొచ్చింది.
రష్యా ఫ్యూడల్ వ్యవస్థలో తాము సాగుచేస్తున్న భూమిపై ఏ హక్కులూ లేక అర్థాకలితో చనిపోతున్న రైతాంగానికి అక్టోబర్ విప్లవం జయప్రదమైన మరుక్షణం విడుదలైన ‘భూ డిక్రీ’ (ఆ దేశంలోని భూమంతా ప్రభుత్వం జాతీయం చేయడం) పెద్ద ఊరటనిచ్చింది. మన దేశంలో భూ పోరాటాలకు ఊపునిచ్చింది. దున్నేవాడికే భూమన్న నినాదానికి బలం చేకూర్చింది. కీలక పరిశ్రమలన్నీ జాతీయం చేయడం కూడా మన వంటి దేశాల్లో ప్రభుత్వరంగ కాన్సెప్ట్ అనలు తొడిగేందుకు తోడ్పడింది.
లెనినిజం ప్రాధాన్యత
విప్లవం జయప్రదమయ్యేనాటికి రష్యా అనేక ఐరోపా దేశాలతో పోలిస్తే వెనకబడిన దేశం. బాగా అభివృద్ధిచెందిన పారిశ్రామిక దేశాల్లో, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా వంటి చోట్ల కార్మికవర్గం తిరగబడ్తుందని, పెట్టుబడి పాలనను కూలుస్తుందన్న అంచనా వేశాడు మార్క్స్. దానికి భిన్నంగా సాపేక్షంగా వెనుకబడ్డ దేశం రష్యాలో ఈ తిరుగుబాటు ఎలా సాధ్యమైంది? ‘నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయడమనే సూక్తిని లెనిన్ ఉటంకిస్తూ కూచోలేదు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ మేరకు అభివృద్ధి అయిందో అధ్యయనం చేశాడు. ‘భూ సమస్య’ ఏమిటో అధ్యయనం చేశాడు. సామ్రాజ్యవాద దశలో నాటి రష్యా ఉందనీ, ఆ సామ్రాజ్యవాద గొలుసులో బలహీనంగా ఉన్న లింకును తెంపాలని, అప్పటికి రష్యానే ఆ లింకని గుర్తించి ఆ లింకుపై భారీ సమ్మెట దెబ్బ మోదాడు. దభేల్న బద్దలైంది. కష్టజీవులపై వెలుగులు ప్రసరించింది.
మరో కీలకాంశం రష్యాలోని జాతుల సమస్యను లెనిన్ పరిష్కరించిన తీరు. ఏండ్ల తరబడి రష్యన్ జాతి కింద అణిచివేయబడుతున్న జాతులను జారు పాలనను కూల్చేందుకు సహకరించాలని, ‘జాతుల బంధిఖానా’ కూలిపోయిన తర్వాత ‘విడిపోయే హక్కు’తో సహా వారికి గ్యారంటీ చేసేసరికి దశాబ్దాల అణిచివేతకు వ్యతిరేకంగా ఆ జాతులన్నీ ఉవ్వెత్తున లేచి జారు పాలనను కూల్చడంలో బోల్షివిక్కులకు సహకరించాయి. ఆ విధంగా ‘యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్స్’ (యూఎస్‌ఎస్‌ఆర్) ఉనికిలోకి వచ్చింది.
అనేక యుద్ధాలతో విసిగిపోయి, చితికిపోయిన రష్యన్ సైన్యం యుద్ధాలు చేయలేక డస్సిపోయి ఉన్నది. ఈ సైనికులంతా రైతాంగ బిడ్డలే. అందుకే వీరిని ‘యూనిఫార్మ్ వేసుకున్న రైతులు (”పెజెంట్స్ ఇన్ యూనిఫార్మ్”) అన్నాడు లెనిన్. 1905 విప్లవం విఫలమైన తర్వాత ‘సర్వాధికారాలు సోవియట్లకే’ అన్న లెనిన్ నినాదం కోట్ల సంఖ్యలో రైతాంగాన్ని కదిలించింది. నవంబర్ 7న అధ్యక్ష భవనంపై దాడి చేసిన కార్మికవర్గానికి, సైనిక సోవియట్‌లకు అండగా నిలిచింది రైతాంగం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం భూమిని, పరిశ్రమలను జాతీయం చేయడంతోపాటు తాము ఏ దేశంతో యుద్ధం కోరుకోవడం లేదు కాబట్టి, శాంతిని వాంఛిస్తున్నాం కాబట్టి అన్ని యుద్ధాల నుండి వైదొలగుతున్నాం అని లెనిన్ ప్రకటించేసరికి రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయడమనే లెనినిస్టు సూత్రానికి నమూనాలివి. లెనినిజం ఒక మార్గదర్శి, విప్లవోద్యమానికి ఒక వేగుచుక్క అయ్యింది. ఆ విధంగానే మార్క్సిజం – లెనినిజం అనేమాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
కష్టజీవుల ఆశాజ్యోతి సోషలిజం
1886 తర్వాత 8 గంటల పనిదినంకై సాగుతున్న ప్రపంచ కార్మికవర్గ పోరాటాలకు బహుశా ఈ కార్మికవర్గ రాజ్యం సోవియట్‌లోనే పరిష్కారం దొరికింది. అధికారంలోకి రాగానే 8 గంటల పనిదినం చట్టపరంగా అమలుచేశారు బోల్షివిక్కులు (కమ్యూనిస్టులు). సామాజిక భద్రతా అంశాలు అనేకం అమల్లోకొచ్చాయి. వాటి రూపాంతరాలే నేడు మన దేశంలో అమలౌతున్న పిఎఫ్, ఇఎస్‌ఐ వంటివి. కార్మికుల సంక్షేమం కోసం యజమానులు ఖర్చుచేయడం అప్పటిదాకా పెట్టుబడిదారీ ప్రపంచంలోని కార్మికుల ఊహకందని విషయాలివి. అటు కార్మికవర్గ రాజ్యం ఆవిర్భవించడంతోపాటు 1918లో మొదటి ప్రపంచయుద్ధ పరిసమాప్తి తర్వాత సామ్రాజ్యవాద దేశాల మధ్య మళ్లీ యుద్ధాలు రాకుండా చూసేందుకు ఒక ‘రిఫరీ’ని, ‘నానా జాతి సమితి’ని ఏర్పాటు చేసుకున్నారు. దాని ఆధ్వర్యంలో నడిచే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 1919లో ఆవిర్భవించింది. సోవియట్ ప్రభుత్వం చర్యలు చూసిన తర్వాత ఐఎల్‌ఓ సభ్య దేశాలన్నింటిలో 8 గంటల పనివిధానం అమలు చేయాలనే నిబంధన వచ్చింది. బ్రిటన్‌లో 8 గంటల విధానం అమల్లోకొచ్చినా వారే పాలిస్తున్న భారతదేశంలోగాని, మరే వలస దేశంలోగాని 8 గంటల పని అమల్లోకి రాలేదు. మరో ముఖ్యమైన అంశం ప్రణాళికాబద్ధ అభివృద్ధి. సోవియట్‌లో 1928లో స్టాలిన్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమైనాయి. పెట్టుబడిదారీ దేశాలకు తెలియనిది ఈ ప్రణాళికాబద్ధ అభివృద్ధి. అక్కడ పెట్టుబడిదారులకు ఏ రంగంలో లాభమొస్తే అక్కడే పెట్టుబడులు కేంద్రీకరిస్తారు. ప్రజలకు ఏది అవసరమో అది కాదు. మొదటి నుండీ ప్రణాళికలను వ్యతిరేకించే నాటి జన సంఘం, నేటి బీజేపీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసి, ఆగస్టు 15 ఎర్రకోట ఉపన్యాసంలో ‘ప్లానింగ్ కమిషన్’ను రద్దుచేస్తున్నట్టు మోడీ ప్రకటించేశారు. 2015 జనవరి 1న నిటిఆయోగ్ పుట్టినట్టు ప్రకటించారు.
నేడు సోవియట్ సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలంగానే మన దేశంలో 12 గంటల పనిదినం, చట్టాల్లో మార్పురాకుండానే సర్వసాధారణమై పోయింది. ప్రధాని కాకముందే ”ప్రభుత్వరంగం పుట్టిందే చావడానికి, కొన్ని ముందే చస్తాయి, కొన్ని కొంచెం ఆలస్యంగా చస్తాయి” అన్నారు మోడీ. ఆ విధంగా నేడు సైద్ధాంతికంగానే ప్రభుత్వరంగం అంటే గిట్టని బీజేపీ చేతిలో దేశ పాలనుంది. ఒక పక్క సోషలిస్టు నమూనా కూలిపోయింది. మరోపక్క ఇంగ్లండ్‌లో థేమ్స్ నది ప్రయివేటీకరణ దగ్గరి నుండి రైల్వేల ప్రయివేటీకరణ, క్యాలిఫోర్నియా విద్యుత్ ప్రయివేటీకరణ వరకు బయట జరిగే ఏదీ మన దేశంలో ఎవరికీ తెలియవన్నంత తేలిగ్గా దేశంలో ‘మోడియా’ ప్రచారహోరు సాగుతోంది. ప్రయివేటీకరణల జోరు తగ్గట్లేదు.
నాడు సోవియట్‌లో సోషలిస్ట్ వ్యవస్థే లేకుంటే తూర్పుకి నాజీల దండయాత్ర విజయం సాధించివుంటే భారతదేశ స్వాతంత్య్రం మనకి కలగానే మిగిలిపోయేది. ప్రపంచంలో వలస వ్యవస్థ యధాతథంగా ఉండి వుండేది. దాదాపు రెండు కోట్ల మంది సోవియట్ పౌరులు ప్రాణత్యాగం చేసి హిట్లర్ సైన్యాన్ని అడ్డుకున్నారు. వాడి చావుకు కారణమైనారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్య కూటమి ఓటమిపాలు కావడం సోవియట్ ప్రజల అసమాన త్యాగాల ఫలితమే.
భారత జాతీయోద్యమంపై ప్రభావం
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన చుట్టూ జరిగే విషయాలను లోతుగా అధ్యయనం చేసేవారు. ఆయన 1930లో మాస్కో నుండి రాసిన లేఖలో ”నేను ప్రస్తుతం రష్యాలో ఉన్నాను. నేను ఇక్కడికి రాకుంటే నా జీవిత గమ్యం అసంపూర్తిగా ముగిసేది. మొత్తం ప్రపంచం వారికి వ్యతిరేకంగా వున్నా లక్షపెట్టక ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి వారు చేస్తున్న కృషి నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. నా కళ్లతో నేను చూడకపోయుంటే తరతరాల పీడన వలన అజ్ఞానంలో, న్యూనతతో కుమిలిపోతున్న లక్షలాది ప్రజలను అక్షరాశ్యులను చేయడం, గౌరవంగా జీవించే మానవులుగా తీర్చిదిద్దడం సాధ్యమని నేను నమ్మేవాణ్ణి కాదు. ఆ వ్యవస్థను ఆ ప్రజలే కాపాడుకోగలరు” – అన్నారు ఠాగూర్. నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన లేఖలో మొదటి ప్రపంచయుద్ధం సంగతి ఎలా ఉన్నా ఆ (అక్టోబర్) విప్లవమే ఒక అసాధారణ ఘటన. అది ప్రపంచ చరిత్రలో అసమాన్యమైనది. అప్పటికి ఆ విప్లవం మొదటిదే అయినప్పటికీ ఎంతోకాలం అది ఒంటరిగా ఉండదు. ప్రపంచవ్యాపితంగా విప్లవకారులకు ఆదర్శంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఆయన అక్కడే ఆగిపోలేదు. ఒక కాంగ్రెస్ మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ ”ప్రపంచ, భారతదేశ సమస్యలకు సోషలిజమొక్కటే పరిష్కారమని నేను విశ్వసిస్తున్నాను. సోషలిజం అనే మాటను అస్పష్టమైన మానవతావాద దృష్టిలో నేను వాడలేదు. శాస్త్రీయపరమైన, ఆర్థికపరమైన అర్థంలోనే వాడుతున్నాను. సోషలిజం ద్వారా తప్ప మన దారిద్య్రాన్ని, విపరీతమైన నిరుద్యోగాన్ని రూపుమాపలేము” – అన్నారు. అతివాద నాయకులైన లాలాలజపతిరారు 1920 ఎఐటీయూసీ ప్రారంభ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ ”సామ్రాజ్యవాదం, మిలటరీయిజం ఈ రెండూ పెట్టుబడిదారీ వటవృక్షానికి పుట్టిన కవలలు. దీనికి ఆలస్యంగానైనా రష్యాలో విరుగుడు కనుగొనబడింది. అదే రష్యా కార్మికవర్గ విప్లవం. ఏనాటికైనా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థలకన్నా సోషలిజం, అందులోనూ బోల్షివిక్కులు నిర్మిస్తున్న వాస్తవమే నమ్మదగినది. మానవీయమైనది. ఉన్నతమైనది” అని స్పష్టం చేశారు.
ఆ విప్లవ ప్రభావం భారతదేశంపై పడకుండా 1920-28 మధ్య బ్రిటిష్ పాలకులు మూడు పెషావర్ కుట్రకేసులు, కాన్పూర్ కుట్రకేసు, బొంబాయి నుండి కలకత్తా వరకు కార్మికోద్యమంలో పనిచేస్తున్న 33 మందిని ఏరి మీరట్ కుట్ర కేసు బనాయించి జైళ్లలో కుక్కారు. అయినా, కమ్యూనిస్టు ఉద్యమం దేశవ్యాపితమైంది.
ముగింపు
కృశ్చేవ్ రూపంలో పుట్టిన రివిజనిజం ‘వేరు పురుగై’ మొత్తం వృక్షాన్ని తొలిచింది. చివరికి మిహాయిల్ గోర్బచేవ్ వంటి కుక్కమూతి పిందెలు ‘పెరిస్ట్రోయికా”, ”గ్లాస్‌నాస్త్” అంటూ 1991లో ఆ సోషలిస్టు మహా వృక్షాన్ని కూల్చేశారు. సోషలిజం కూలిపోయిందని కొందరు పండగ చేసుకున్నారు. కాని 1998 ఆసియా పులుల ఆర్థిక సంక్షోభం, 2001లో డాట్ కామ్ సంక్షోభం, 2008లో బద్దలైన అమెరికా హౌసింగ్ బుడగ సంక్షోభం నేటి వరకు పెట్టుబడిదారీ దేశాలను పట్టిన సంక్షోభాలు వదలడం లేదు. అందుకే పెట్టుబడిదారీ విధానమంటేనే సంక్షోభం, యుద్ధాలు, లాభాలకై వెంపర్లాట!
కష్టజీవులందరికీ నేడు సోవియట్ విప్లవం ఒక చెదిరిన కల. ”చరిత్ర ఎప్పుడూ గెలిచిన వారి ఆస్తి” అనే మాట గుర్తుపెట్టుకుంటే నేటి యుధ్ధంలో గెలిచిన సామ్రాజ్యవాదం వండివార్చిన కథలే ప్రచారంలో వున్నాయి. నాటి అక్టోబర్ విప్లవ నేపథ్యమేమిటి? దాని ప్రభావం ఏమిటి? వంటి అంశాలను తవ్వి తెలుసుకోవడమే మన కర్తవ్యం.
ఆర్. సుధాభాస్కర్