నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచుతా..!

– రూ.2 కోట్ల రూపాయలకు శంకుస్థాపన 
– ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు 
– ఇందిరా గాంధీ విగ్రహం పెట్టి కాలని అభివృద్ధి చేస్తాం
– నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచుతానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బుదవారం హుస్నాబాద్ మున్సిపాలిటీలో 3,4,5,18 వార్డుల్లో ఒక్కో వార్డుకు 50లక్షల చొప్పున రూ .2 కోట్ల రూపాయలతో  రోడ్లు ,మురుగు కాలువల నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మీ అందరి సమక్షంలోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. హుస్నాబాద్ లో రీడింగ్ రూమ్స్ పేరుతో అన్ని కులాలకు 45 లక్షల చొప్పున  కేటాయించడం జరిగిందన్నారు.బుడగ జంగాల కాలనీ వద్ద ఇందిరమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆ చౌరస్తా ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బుడగ జంగాల కాలని కి అవసరమైన రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ పట్టణంలో గాంధీ , అంబేద్కర్ ,నాగరం , కరీంనగర్ చౌరస్తా ల అభివృద్ధికి రూ.50 లక్షల చొప్పున కేటాయించుకున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి రూ.18 కోట్ల రూపాయలు టెండర్ అయిందన్నారు. హుస్నాబాద్ లో పూర్తైన ప్రభుత్వ కార్యాలయాలు ,కరీంనగర్ 4 లైన్ల రహదారి, 150 పడకల ఆసుపత్రి , సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం అభివృద్ధి , మహాసముద్రం , ఆర్టీవో ఆఫీస్ స్థలం, స్టేడియం పనులు ఇలా  అన్నిటికీ ఒకేసారి ప్రారంభించుకోవడానికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి  తీసుకొచ్చి ఫౌండేషన్ వేయాలని కార్యాచరణరూపొందిస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ ఎండీ తో కలిసి చౌటపల్లి వద్ద స్థల పరిశీలన చేశామని, దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ  ఏదైనా సలహాలు సూచనలు చేయవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ ఒక రోల్ మోడల్ గా దేశానికి దిక్సూచి లాగ కుల గణన సర్వే జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం  ఏర్పడగానే రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కి గ్యాస్ ఇస్తున్నామని ఎవరికైనా రాకపోతే అధికారులను సంప్రదించాలన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. వ్యవసాయానికి సంబంధించి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ పూర్తైందనీ. 2 లక్షల పైన ఉన్న వారికి కుటుంబ నిర్ధారణ పూర్తైంది పైన డబ్బులు చెల్లిస్తే మిగిలినవి మాఫీ అవుతాయని, త్వరలోనే దానికి సంబంధించిన విది విధానాలు వస్తాయన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 2006 లో  8 రేషన్ షాపులు ఉంటే  2024 లో కూడా 8 ఉండడం దురదృష్టకరమన్నారు. ఎంత జనాభా కి ఎన్ని రేషన్ షాపులు ఉండాలని వివరాలు సేకరించాలనీ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో కొత్త రేషన్ షాపులు తీసుకొచ్చి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ మను చౌదరి  మాట్లాడుతూ
హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు, మున్సిపల్ కార్యాలయం, లైబ్రరీ బిల్డింగ్, మరియు ఓవర్ అల్ వర్క్స్ వార్ పుట్టింగ్ లో పూర్తి చేసి ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మంచి సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో పగడ్బందీగా చేపట్టామనీ తెలిపారు. సర్వే కోసం ఇంటింటికి వచ్చే ఎన్యూమారేటర్  అధికారులకు వివరాలు పూర్తిగా అందించాలని సూచించారు. జిల్లాలో 2 లక్షల 36 వేల ఇండ్లు ఉన్నాయనీ గ్రామలు, పట్టణాలలో సర్వే కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించామని అన్నారు. నవంబర్ చివరి వరకు సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్  ఆకుల రజిత వెంకన్న , వైస్ చైర్మన్ ఐలేని అనిత, సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి ,సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ , మండల అధ్యక్షుడు బంక చందు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.