మహా కథకుడిని మదితలంచి…

Considering the great storyteller...ఒక వ్యక్తి వందేండ్ల పుట్టినరోజును వారి కుటుంబ సభ్యులు జరుపుకుంటే అది వారింటి కార్యక్రమం. అది వారికి, ఆ ఇంటికే పరిమితం. కానీ సమాజం ఆ వ్యక్తిని గుర్తుంచుకుని ఆయన నడిచొచ్చిన దారినీ ఆయన నిర్వర్తిం చిన సామాజిక బాధ్యతల్నీ, సాధించిన విజయాల్నీ, ఎక్కడోచోట పొందిన వైఫల్యాల్నీ తలుచుకుని, ఆయన సగంలో వొదిలెళ్ళిన పనుల్నీ పూర్తిచేయాలనే సంకల్పం తీసుకోవడం ఉందే అది ఆ వ్యక్తికి ఈ సమాజం ఇచ్చే గొప్ప నివాళి.
కా.రా మాష్టారుగా ప్రసిద్ధుడైన కాళీపట్నం రామారావు మాష్టారి జయంతి ఏడాది ఇది. వంద సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా ‘పొందూరు’ లో జన్మించి ‘మురపాక’లో ఎదిగిన ఈ వ్యక్తి గురించి ఇప్పుడెందుకు మాడ్లాడుకుంటుందీ సమాజం? ఆయన ఏంచేసేడని? ఏమి సాధించేడని? అని ఈతరం కుర్రాళ్లు ప్రశ్నించొచ్చు. అది వారి తప్పు కాదని మనకి తెలుసు. వారికి ఆ స్ఫూర్తి అందజేయడంలో మా తరం వైఫల్యం ఉందని అనుకుంటాను.
తండ్రి ముందు తన ఖర్చుల కోసం చెయ్యిచాపక తన సంపాదనతోనే ఏదైనా చెయ్యాలనే పట్టుదలతో దాన్ని సాధించడానికి ఏయే ప్రయత్నాలు చేసేడో, ఎంతక్షోభకు గురయ్యేడో, తన మాట ఎలా నిలబెట్టుకున్నాడో ఆ కొడుకు గురించి తెలుసుకోవాల్సిందే.
వేదాంత గ్రంథాలు చదివి, సత్యమంటే ఏమిటి? జీవిత పరమార్థం ఏమిటి? అని సత్యాన్వేషణలో రెండుసార్లు ఇల్లొదిలి పెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఆ ప్రయత్నాలు విరమించుకున్న ఆ యువకుడి గురించి తెలుసుకోవాలంటే మాష్టారి జీవితంలోకి తొంగిచూడాల్సిందే.
చాలా ఉద్యోగాలు చేసి ఒకానొక ఉద్యోగం తన స్వశక్తితో వచ్చింది కాదని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలి తన తోటి ఉద్యోగిని పైఅధికారి అకారణంగా ఏదో అన్నందుకు ఎదురు తిరిగి ఆ ఉద్యోగాన్నీ వదిలేసిన ఆయన నిష్కర్షనీ, నిజాయితినీ, ఆత్మాభిమానాన్నీ తెలుసుకోవాలంటే ‘కారా’ మాష్టారి గతాన్ని చదవాల్సిందే.
మూడోసారి ఇంట్లో తెలీకుండా ఉద్యోగం సంపాదించ డానికి మద్రాస్‌ వెళ్లినప్పుడు శ్రీశ్రీ గారిని కలిసేరు, ఏ ఉద్యోగమూ రాకపోగా ఆకలితో రోడ్లమీద తిరుగుతున్న, చేతిలో చిల్లిగవ్వలేని ఒకానొక క్లిష్ట పరిస్థితిలో పేరు తెలియని ‘గుంటూరు సజ్జనుడు’ చేసిన సహాయంతో తిరిగి ఇంటికి చేరిన ఆ యువకుడు తరువాతి కాలంలో తాను ‘రాగ మయి’ అనే పెద్ద కథ రాసి ఆ కథను తనను ఆదుకున్న ఆ ‘గుంటూరు సజ్జనుడికి’ అంకితమిస్తూ ఏమన్నారంటే ‘ఒకప్పుడు నేను మద్రాసు వీధుల్లో దిక్కు తోచక అల్లాడుతూ ఉండగా తెలుగువాడినై ఉండటం తప్ప ఇంకే ఇతర యోగ్యతలు లేని నాకు అయాచితంగా ఎంతో సహాయం చేసిన ఒకానొక గుంటూరు సజ్జనునకు… ఆ తర్వాత అతని పేరైనా జ్ఞాపకం ఉంచుకోలేకపోయిన నా కృతజ్ఞతా హీనతకు శాశ్వత చిహ్నంగా ఇది అంకితం” అని ఏ అరమరికలు లేకండా చెప్పుకున్న ఒక మానవుడి జీవిత విశేషాల్ని తడమాల్సిందే.
సత్యాన్వేషణలోని వైఫల్యం మనసులో కల్లోలానికి కారణమై, సత్యం తెలుసుకోలేని జీవితం వ్యర్థమని అశాంతికి గురయి, ఆత్మహత్యా ప్రయత్నం చేసి, యాదృచ్ఛికంగా ఆ ప్రయత్నం విఫలమయ్యాక ఆత్మహత్య ఎంత భయంకరమైనదో గ్రహింపుకొచ్చిన ఆయన కథలలో పాత్రలకి ఆత్మహత్యా పరిష్కారాలు ఇవ్వరాదని, కథ కోసం ఆత్మహత్యను చిత్రించాల్సిన అవసరముందనుకుంటే పాఠకులకు భయమూ, అసహ్యమూ కలిగేలా రాయాలని చెప్పిన రచయిత గురించి తెలుసుకోవాలంటే కథాదీపధారి బతుకు పుస్తకంలోకి చూపు సారించాల్సిందే.
ఎనభై రూపాయలు జీతం వచ్చే స్టోర్స్‌ డిపో లోని ఉద్యోగానికి రాజీనామా చేసి తన సాహిత్యానికి అనువుగా ఉంటాదని ముప్పై రూపాయల జీతం మాత్రమే వచ్చే ఉపాధ్యాయ ఉద్యోగం కోసం భీమునిపట్నం సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌లో చేరిన సాహితీ పిపాసి గురించి తెలుసుకోవాలంటే ఈ కథల మాష్టారి గతంలోకి వెళ్లాలి. మనకి కథల మాష్టారిగానే తెలిసిన కా.రా మాష్టారు పద్యాలు రాసేవారని, బొమ్మలేసేవారని, సరదాగా డోలక్‌ వాయించే వారని తెలిస్తే ఆశ్చర్యం కదా..ఇది నిజం. మనకు తెలీని కళలెన్నో నిక్షిప్తమై ఉన్న ఒకనాటి కవి, కళాకారుడి గురించి తెలుసుకోవాలని ఉన్నా ఒకసారి మాష్టారి తొలినాళ్లలోకి వెళ్ళి తచ్చాడి రావాల్సిందే.
ఎదురైన ఎన్నెన్నో ఒడిదొడుకుల్ని తట్టుకుని జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడిపి, ముప్పై రూపాయల జీతంతో సంసార సాగరాన్ని ఈదలేక, కుటుంబ నిర్వహణ కోసం ప్రైవేట్లు చెప్పి, సామాజ మార్పు కోసం రచన ఒక మార్గంగా ఎంచి, తనదైన మార్గంలో ఉన్నత విలువలతో జీవితాన్ని నిర్వహించిన సర్వోన్నత మానవుడి గురించి ఎరుక కలగాలంటే మాష్టారిని, మాష్టారి సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యాల్సిందే.
సాహిత్యకారులు చాలామంది..వారిలో నిబద్ధత, నిమగత కలిగిన సాహిత్యకారులు అతి కొద్దిమందే. ‘ప్లాటుఫారమో’ అనే కార్డు కథ నుండి ‘అన్నెమ్మనాయురాలు’ కథ దాకా మాష్డారు చేసిన సాహిత్య ప్రయాణం ఎంత పకడ్బందీగా జరిగిందో ప్రత్యేక శ్రద్ధతో తప్పక గమనించాల్సిందే.
మాష్టారిలోని సత్య నిష్ఠ, మాష్టారి క్రమశిక్షణ వారి జీవితంలో అడుగడుగునా ప్రస్ఫుటమౌతాయి. ఆచి తూచి మాడ్లాడే ఆయన, తన రాసిన కథల్లో కూడా అదే పాటించడం చూస్తాం. మాటల పొదుపు కథకెంత ముఖ్యమో అంతంత పెద్ద కథల్లో కూడా ఎలా నిర్వహించేరో తెలియడానికి ఆ కథల్ని సూక్ష్మ పరిశీలన చెయ్యాల్సిందే.
ఒక వ్యాసం (పెనుగొండ లక్ష్మీనారాయణ రాసినది) చదివి కథల లెక్క తేల్చాలని భుజానికి సంచీ దోపి ఊళ్లు తిరిగిన ‘కథల దిమ్మరి’ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమే. ఎక్కరాని ఇంటి మెట్లెక్కి, అడగరాని వారిని అడిగి లేదనిపించుచుకుని అయినా ‘పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని భుజానికెత్తుకున్నట్టు పుస్తకాల సంచీ భుజాన దోపుకున్న కథక విక్రమార్కుడి గురించి, కథ కోసం నిరంతరం శ్రమించి, తనకొచ్చిన అవార్డుల సొమ్ము, సామాజికుల నుండి స్వీకరించిన విరాళాలతోను ‘కథానిలయం’ అనే కథల గూడును శ్రీకాకుళంలో నిర్మించి ‘కథ కంచికి’అనే నానుడిని మార్చి ”కథ ‘శ్రీకాకుళ కథానిలయానికి” అనే కొత్త నానుడి సృష్టికి కారణమైన కథా దీపధారి గురించి తెలియాలంటే శ్రీకాకుళం వైపు చూడాల్సిందే.
మాష్టారి కథలెంత గొప్పవో ఆయన సాహిత్యంపై వచ్చిన వేల పేజీల సమీక్షలు విమర్శలు ఉదాహరణగా నిలుస్తాయి. ఒక్క ‘యజ్ఞం’ కథ మీదనే వచ్చిన విమర్శ ప్రపంచంలో మరే భాషలోనూ కథ గురించి రాలేదని అంటారు. అందరూ కథలు రాస్తారు. గొప్పవాళ్లు మాత్రమే గొప్ప కథలు రాస్తారు.. భూగర్భ శాస్త్రజ్ఞులు చారిత్రక ఆధారాల కోసం భూమి పొరల్ని తవ్వినట్టు మాష్టారి కథల్ని కూడా అలా పొరలు పొరలుగా తవ్వుకోవాలంటారు విమర్శకులు. ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే అలాంటి గొప్ప కథకుల్లో ఒకరైన కా.రా మాష్టారి సాహితీ సాగరంలో ఈదులాడాల్సిందే.
ప్రతి వ్యక్తీ తీర్చవలసిన రుణాలు నాలుగు. అవి తల్లి రుణం, తండ్రి రుణం, గురు రుణం, సమాజ రుణం అంటారు మాష్టారు. మన ఎదుగుదలలో సమాజం పాత్ర గొప్పది. ఆ సమాజ రుణం ఏదో రూపంలో తీర్చుకోవాలని ఆ ప్రయత్నంలో కథానిలయం నిర్మించి ‘సమాజ రుణం’ తీర్చుకున్న ఆ ‘కథల రుషి’ గురించి తెలుసుకోవాలంటే ‘భక్తులు తిరుపతికి వెళ్ళినట్టు సాహిత్యాభిమానులు కథల పుణ్యక్షేత్రాన్ని కథానిలయాన్ని దర్శించాలి. అలా దర్శించడానికి శ్రీకాకుళం వెళ్లాల్సిందే.
9 నవంబర్‌1924న అరుదైన మానవుడు, గొప్ప కథకుడు అయిన కాళీపట్నం రామారావు శతజయంతి రోజు.ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు గ్రామంలో భ్రమరాంబ, పేర్రాజుల అయిదుగురి సంతానంలో పెద్దవారయిన కాళీపట్నం రామారావు అనే పేరుగల ”కా.రా” అని పొట్టి పేరుతో సాహిత్యాభిమానులు పిలుచుకునే ఆయన గొప్ప కథకుడే కాదు, గొప్ప వ్యక్తి కూడా.
కా.రా మాష్టారు శ్రీ శ్రీ గురించి రాస్తూ ”శ్రీశ్రీ కంటే శ్రీశ్రీ మార్గం గొప్పది” అన్నారు. కా.రా మాష్టారి గురించి చెప్పాలంటే ”వ్యక్తిగా కా.రా మాష్టారూ, కా.రా సాహిత్యమూ రెండూ గొప్పవే. ఇటువంటి మహామానవుడు జీవించిన కాలంలోనే మనమూ జీవించి ఉన్నామని, ఉండటమే కాదు వారితో చాలా దగ్గరగా తిరిగేవాళ్లమని, ఆయనతో కలిసి నడిచేమని అనుకుంటే అదెంతో సంతోషంగానూ, గర్వంగానూ ఉంటుంది కదా.
(కా.రా మాష్టారి శత జయంతి సందర్భంగా)
– గంటేడ గౌరునాయుడు